పరారే.. పరారే! | Sakshi
Sakshi News home page

పరారే.. పరారే!

Published Sat, Mar 8 2014 2:44 AM

congress party scared to participate in municipal elections

సాక్షి ప్రతినిధి, అనంతపురం : మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే కాంగ్రెస్ శ్రేణులు వెనకడుగు వేస్తున్నారు. ఎన్నికల వ్యయం పూర్తిగా భరిస్తాం పోటీచేయండని చెబుతున్నా పారిపోయే పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ చతికిలపడింది. రాష్ట్ర విభజన ప్రక్రియ ఆ పార్టీని జిల్లాలో దాదాపు ఖాళీ చేసింది. కాంగ్రెస్ పేరు వింటేనే ప్రజలు కన్నెర్ర చేస్తోండటమే అందుకు కారణం. ప్రజాగ్రహం వెల్లువెత్తుతోన్న నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్‌పై మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఏ ఒక్కరూ సాహసించడం లేదు.
 
 జిల్లాలో అనంతపురం నగర పాలక సంస్థతో పాటు 11 మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 10 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అభ్యర్థుల కోసం కాంగ్రెస్ అగ్రనేతలు వెతుకులాడుతున్నారు. ‘టికెట్ ఇస్తాం.. ఎన్నికల ఖర్చులను భరిస్తాం.. పోటీచేయండి చాలు’ అంటూ ద్వితీయశ్రేణి నేతలను కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడుతున్నా ఏ ఒక్క నేతా ఆ ప్రతిపాదనను అంగీకరించడం లేదు. అనంతపురం నగరపాలక సంస్థలోని 50 డివిజన్‌లలో ఒక్క డివిజన్‌లో కూడా కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేస్తానని ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడమే అందుకు నిదర్శనం. మారూ. మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న కళ్యాణదుర్గం నగర పంచాయతీలోనూ.. ఆయన సొంత నియోజకవర్గ కేంద్రమైన మడకశిర నగర పంచాయతీలోనూ ఏ ఒక్కరూ కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.
 
 ఇదే అంశాన్ని ఇటీవల హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్స నిర్వహించిన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో వై.శివరామిరెడ్డి స్పష్టీకరించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఏదో ఒక రూపంలో పోటీ చేయించకపోతే కేడర్ మొత్తం చెల్లాచెదురవుతుందని ఆ పార్టీ అగ్రనేతలు ఆందోళన చెందుతున్నారు.
 
 ఇది సార్వత్రిక ఎన్నికల్లో తమను మరింత ఇరకాటంలోకి నెడుతుందని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేడర్‌ను కాపాడుకునేందుకు ‘స్వతంత్ర’ అభ్యర్థిగా బరిలోకి దిగాలంటూ శ్రేణులకూ సూచిస్తూ.. ఎన్నికల ఖర్చులకు కాస్తోకూస్తో నిధులను కూడా అందిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తోన్న గుంతకల్లు, కళ్యాణదుర్గం, మడకశిర మున్సిపాల్టీల్లో ఈ ఎత్తును అమలుచేస్తున్నారు. తాము స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసినా.. ప్రచారం కోసం తమ వద్దకు రావద్దని ఆ అగ్రనేతలకు కాంగ్రెస్ చోటా నేతలు షరతు పెడుతుండటం కొసమెరుపు.  
 

Advertisement
Advertisement