తప్పుకోకుంటే ఐటీ దాడులే !

30 Jan, 2014 01:56 IST|Sakshi

* రాజ్యసభ రెబల్స్‌పై కాంగ్రెస్ కూటనీతి
* అధిష్టానం ఆదేశంతో రంగంలోకి రాష్ట్ర పెద్దలు
* ఆదాల, చైతన్య రాజులపై ఒత్తిళ్లు, బెదిరింపులు
* అన్నివిధాలా తిప్పలు తప్పవంటూ హెచ్చరికలు
* మీ సంగతి చూస్తామన్న మంత్రి కొండ్రు మురళి
* ఏమనుకుంటున్నారంటూ దానం వార్నింగులు
* మద్దతిచ్చిన ఎమ్మెల్యేలతో ఉపసంహరణ లేఖలు
* అవి చెల్లబోవన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
* ఆదాల, రాజు నామినేషన్లు సక్రమమేనని ప్రకటన

 
 సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన తిరుగుబాటు అభ్యర్థులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, చైతన్య రాజులను రంగం నుంచి తప్పించడానికి కాంగ్రెస్ పార్టీ బుధవారం ‘అన్ని రకాలుగా’ ప్రయత్నించింది. వారి నామినేషన్లపై సంతకాలు చేసిన పార్టీ ఎమ్మెల్యేలను నయానాభయానా ‘దారి’కి తెచ్చుకుని, వారితో మద్దతు ఉపసంహరణ లేఖలిప్పించడమే గాక హైడ్రామాకు తెర తీసింది. చివరికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ కల్పించుకుని అలా ఉపసంహరించుకోవడం చెల్లదని.. ఆదాల, రాజు నామినేషన్లు సక్రమమేనని తేల్చారు. దాంతో అధిష్టానం పెద్దల్లో గుబులు మొదలైంది. రెబల్స్ కారణంగా ఎన్నికలు అనివార్యమయ్యేలా ఉన్నాయంటూ రాష్ట్రంలో మకాం వేసిన ఏఐసీసీ పరిశీలకులు తిరునావుక్కరసు, ఆర్‌సీ కుంతియా సమాచారం పంపడంతో అధిష్టానం అవాక్కైంది.
 
 దాంతో దండోపాయానికి దిగి, ‘నామినేషన్లను ఉపసంహరించుకోకుంటే రాజకీయ భవిష్యత్తుండదు. ఐటీ దాడులు కూడా జరుగుతాయి’ అంటూ ఆదాల, రాజులకు హెచ్చరికలు పంపుతున్నట్టు సమాచారం. సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ బుధవారం ఉదయమే సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు ఫోన్ చేశారు. ‘‘ఎలాగైనా రెబల్స్‌ను తప్పించి, ఎన్నికలను ఏక గ్రీవం చేయండి’’ అని ఆదేశించారు. దాంతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులు కూడా, ‘తప్పుకుంటారా, లేదా?’ అంటూ రెబల్స్‌ను హెచ్చరించడంతో పాటు వారిపై తీవ్రస్థాయిలో బెదిరింపులకు కూడా దిగారు!
 
-  ఆదాల, రాజులకు బొత్స ఫోన్ చేసి, ‘అధిష్టానం సీరియస్‌గా ఉంది. తప్పుకుంటే మంచిది. పార్టీలో  భవిష్యత్తుంటుంది. లేదంటే రాజకీయంగా, ఆర్థికంగా ఇబ్బందులు తప్పవ్’ అని హెచ్చరించారు.
-  అసెంబ్లీ లాబీలోని మంత్రి గంటా చాంబర్లో ఆదాల, రాజులతో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, ఎంఏ ఖాన్ సమావేశమై, తప్పుకోవాల్సిందిగా వారిని కోరారు. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధమేనంటూ ప్రతిపాదన చేసినట్టు తెలిసింది.
 
-  బొత్స రెబల్స్‌ను మంత్రి ఆనం చాంబర్లోకి తీసుకెళ్లారు. ఎంత బుజ్జగించినా వినకపోవడంతో రెబల్స్‌పై మండిపడ్డట్టు తెలిసింది. మంత్రి కొండ్రు మురళి అయితే, ‘‘కాంగ్రెసంటే ఏమనుకుంటున్నారు? తప్పుకుంటే మంచిది. లేదంటే ఏం చేయాలో తెలుసు. మీ సంగతి చూస్తాం’’ అని హెచ్చరించారు. మరో మంత్రి దానం నాగేందర్ కూడా, ‘డబ్బుంది కదాని ఏది పడితే అది చేస్తామంటే కుదరదు. ఇదేమీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినట్టు కాదు. రిలయన్స్ వద్ద బోలెడు డబ్బుంది కదా అని ముకేశ్ అంబానీ పోటీకి దిగుతాడా? దిగితే ఏమవుతుందో, కాంగ్రెస్ ఏం చేస్తుందో ఆయనకు తెలుసు’’ అని బెదిరించారు. ‘రాజు పోటీ చేసినా బాధలేదు. ఏం చేయాలో మాకు తెలుసు’ అని మీడియాతో అన్నారు.

 ఢిల్లీ రాజ్యాంగేతర శక్తి భయపెడుతోంది: జేసీ
 ‘‘ఆదాల, రాజులను తప్పించేందుకు పైనుంచి కుట్ర జరుగుతోంది. ఢిల్లీలోని ఓ రాజ్యాంగేతర శక్తి (అహ్మద్‌పటేల్‌ను ఉద్దేశించి) ఎన్నికల సంఘంపై కూడా ఒత్తిడి తెచ్చింది. అది సాధ్యం కాకపోవడంతో అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఐదేళ్లుగా ఏనాడూ పట్టించుకోని ఎమ్మెల్యేలను ఇప్పుడు బుజ్జగిస్తున్నారు’’
 
-     ఆదాల, చైతన్యరాజులకు మద్దతుగా సంతకం చేసిన ఎమ్మెల్యేలందరిని బుధవారం ఉదయం అసెంబ్లీ మొదలవకముందే బొత్స పిలిపించుకున్నారు. ఒత్తిడి తెచ్చి, ‘పార్టీపరంగా సాయం చేస్తా’మంటూ ప్రలోభపెట్టి, మాట వినకుంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించినట్టు సమాచారం.
-     సిహెచ్.వెంకట్రామయ్య, శ్రీధర్ కృష్ణారెడ్డి మినహా 8 మంది ఎమ్మెల్యేలు రిటర్నింగ్ అధికారి రాజా సదారాంను కలిసి మద్దతు ఉపసంహరణ లేఖలిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులమని చెప్పినందుకే వారికి సంతకాలు చేశామని, స్వతంత్రులని తేలినందున ఉపసంహరించుకుంటున్నామని, వారి నామినేషన్లను తిరస్కరించాలని పేర్కొన్నారు.
-     బొత్స, కొండ్రు కూడా సదారాంను కలిసి, తమ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారంటూ కాంగ్రెస్ తరపున లేఖ ఇచ్చారు. వారి సంతకాలను ఫోర్జరీ చేశారనే అనుమానం వ్యక్తం చేశారు.
-     ఎమ్మెల్యేల మనసు మారవచ్చేమోనని, నామినేషన్ల పరిశీలన పూర్తయేదాకా వారిని ఆనం చాంబర్‌కే పరిమితం చేశారు
-     ఎమ్మెల్యేల లేఖలపై గంటలో వివరణ ఇవ్వాలని స్వత్రంత అభ్యర్థులను సదారాం కోరారు. ఎమ్మెల్యేలను హాజరు పరచాలన్నారంటూ ప్రచారమూ జరిగింది. ఆయన తీరుపై ఆదాల, రాజు అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను హాజరు పరచాలనే హక్కు మీకెక్కడిదంటూ జేసీ నిలదీయడంతో తానలా అన్లేదని సదారాం వివరణ ఇచ్చారు.
-     అభ్యర్థులిద్దరూ హైకోర్టు సీనియర్ న్యాయవాదులు, ఎన్నికల న్యాయ నిపుణులతో ఫోన్లో మంతనాలు జరిపి, వారి సూచన మేరకు లేఖ రూపొందించి సదారాంకు అందజేశారు.
-     వివాదం నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ అసెంబ్లీకి వచ్చారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 37వ సెక్షన్ ప్రకారం ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణ చెల్లదని తేల్చారు. ఆదాల, చైతన్యరాజు నామినేషన్లు సక్రమమేనని ప్రకటించారు.
 
 కేసులు బనాయిస్తారట: ఆదాల
 ‘‘తప్పుకోవాలంటూ మాపై ఒత్తిడి తేవడమే గాక ఐటీ దాడులు చేయిస్తామని, కేసులు బనాయిస్తామని బెదిరిస్తున్నారు. నా వ్యాపారాలన్నీ సక్రమంగానే ఉన్నాయి. ఏటా సక్రమంగా ఐటీ చెల్లిస్తున్నాం. ఏం చేస్తారో చేసుకోండని చెప్పాం. మేమైతే బరిలో ఉంటాం. సమైక్య ఓట్లు చీలకుండా ఉండేందుకు, తద్వారా గెలిచేందుకు అవసరమైతే మాలో ఒక్కరైనా నిలబడి తీరుతాం’’
 
 నిలుస్తా.. గెలుస్తా: చైతన్యరాజు
 ‘‘ఒత్తిళ్లు వస్తున్నా తగ్గేది లేదు. 54 ఎమ్మెల్యేల మద్దతుతో గెలుస్తాననే నమ్మకముంది. నిన్న రాత్రి సుబ్బరామిరెడ్డి ఫోన్ చేసి తప్పుకోవాలని కోరారు. ఆదాల ఇప్పటికే తప్పుకున్నారని చెప్పారు. నేను ఆదాలకు నేను ఫోన్ చేస్తే అలాంటిదేమీ లేదన్నారు. పైగా నేను తప్పుకున్నానని చెబుతూ సుబ్బరామిరెడ్డే తనకు ఫోన్ చేశారని, తప్పుకోవాలని కోరారని చెప్పారు. తప్పుకునే ప్రసక్తే లేదని మేమిద్దరం ఆయనకు తేల్చిచెప్పాం’’

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు