రాష్ట్రాన్ని విడగొట్టి ఒక్కటవుతున్నాయి: జూపూడి | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని విడగొట్టి ఒక్కటవుతున్నాయి: జూపూడి

Published Thu, Mar 6 2014 10:46 PM

రాష్ట్రాన్ని విడగొట్టి ఒక్కటవుతున్నాయి: జూపూడి - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ద్వంద వైఖరిని ప్రదర్శించిన టీడీపీ, కాంగ్రెస్‌లు ఇప్పుడు ఒక్కటవుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు వ్యాఖ్యానించారు. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నాలుగున్నర ఏళ్లుగా కలిసి పనిచేస్తున్న కాంగ్రెస్, టీడీపీలు... ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత ఆ ముసుగును తీసేసి ఒకటిగా కలిసిపోతున్నారని దుయ్యబట్టారు. టీడీపీలో కాంగ్రెస్ విలీనం కావడానికి సిద్ధపడుతోందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న టీడీపీ ‘పిల్ల టీడీపీ కాంగ్రెసో, తల్లి టీడీపీ కాంగ్రెసో’ చంద్రబాబే స్పష్టంచేయాలన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కాంగ్రెస్ నేతలను టీడీపీలోకి తీసుకోవడం కోసం చంద్రబాబు వారి పార్టీ కార్యకర్తలకు చేసిన హితోపదేశాన్ని ప్రత్యేక తెరపై జూపూడి ప్రదర్శించారు. ‘‘ఇది చారిత్రాత్మకమైన సమయం. కాంగ్రెస్ వాళ్లు ఎంత మంది వస్తే అంతమందిని కలుపుకోండి. గ్రామస్థాయితో పాటు ఎక్కడికక్కడ కలుపుకుంటే పార్టీ బలపడుతోంది. ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. నేను హైదరాబాద్ లేవల్లో ఆలోచన చేస్తున్నా. త్వరలో పార్టీలోకి చేర్చుకునే వారిని మీరు పేపర్లో చూస్తారు’’ అంటూ కార్యకర్తలను హైదరాబాద్‌కు పిలిచి కాంగ్రెస్‌తో చెలిమి చేయడం, వారిని కలుపుకోవడానికి గల కారణాలను చంద్రబాబు వివరిస్తూ ఉపోద్ఘాతం చేశారని దుయ్యబట్టారు.

ఎన్నికల ముందు చంద్రబాబు ఇలాంటి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు విశ్వసించరని చెప్పారు. 2009లో ఎన్నికల్లో కూడా మహాకూటమిని ఏర్పాటు చేసినా ప్రజలు చంద్రబాబును ఓడించారన్నారు. అవిశ్వాసం సందర్భంగా వచ్చిన 18 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కలిసి పనిచేసినా... ప్రజామోదంతో వైఎస్సార్‌సీపీ 15 స్థానాలను కైవసం చేసుకుందన్నారు. దీంతో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే వాటి ఫలితాలు ప్రకటించొద్దంటున్నారని విమర్శించారు. తెలంగాణకు, సీమాంధ్రకు చంద్రబాబు తీరని ద్రోహం తలపెట్టారని జూపూడి మండిపడ్డారు.

సింగపూర్‌తో చంద్రబాబుకు విడదీయరాని బంధం ఉంది. కుటుంబంతో పాటు వ్యక్తిగత పనుల మీద ఆయనిప్పటి వరకు దాదాపు 200సార్లు వెళ్లివచ్చుంటారు.

* సింగపూర్ అంటూ సీమాంధ్రలో వ్యవసాయం లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారా? రైతుల భూములన్నింటినీ లాక్కుంటారా?
* హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణాన్ని కాంట్రాక్టుకు ఇచ్చినందుకు పార్టీ కార్యాలయాన్ని, హెరిటేజ్ కార్యాలయాన్ని ఉచితంగా నిర్మించుకున్న విషయం ప్రజలకు గుర్తుంది.

* చంద్రబాబు మాటలన్నీ నీటి మూటలే. ఆయనే గనుక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లయితే రెండుసార్లు ఎందుకు ఓడిపోయారు. చంద్రబాబు వన్నీ మాయమాటలు, నయవంచన. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదు.

* కేంద్రమంత్రి పురందేశ్వరి మాపార్టీపై విమర్శలు చేసే అర్హతలేదు. చంద్రబాబు వెంట ఉండి తండ్రి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిపించిన పురందేశ్వరి, ఇప్పుడు రాష్ట్ర విభజన జరుగుతుంటే కాంగ్రెస్, బీజేపీ పంచన చేరారు.
 

* పురందేశ్వరి అధికార దాహం కోసం ప్రతీ పదేళ్లకు ఒకసారి పార్టీలు మారే సంప్రదాయముంది. ఆమెకు తండ్రి ఆత్మగౌవరమే కాదు తెలుగుప్రజల ఆత్మగౌరవం పట్టదు.

Advertisement
Advertisement