తేలని టీడీపీ, బీజేపీ పొత్తు ! | Sakshi
Sakshi News home page

తేలని టీడీపీ, బీజేపీ పొత్తు !

Published Sat, Mar 22 2014 12:27 AM

తేలని టీడీపీ, బీజేపీ పొత్తు ! - Sakshi

  • పార్టీ శ్రేణులఎదురు చూపు
  •  చిన్నమ్మకు చుక్కెదురు
  •  లోక్‌సభకు వెంకయ్యనాయుడు?
  •  సాక్షి, విజయవాడ : బీజేపీ, టీడీపీల మధ్య పొత్తుల గందరగోళం ఇంకా తేలలేదు. ముఖ్యంగా సీటు ఇచ్చి, పుచ్చుకునే విషయంలో రెండుపార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని శుక్రవారం విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తేలింది. పోత్తులు పెట్టుకునే పార్టీలంతా త్వరగా ముందుకు రావాలంటూ ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ పిలుపునిచ్చారు. వారం పదిరోజుల్లో పొత్తుల విషయం ఒక కొలిక్కి వస్తుందని, ఒకవేళ పొత్తులు కుదరకపోతే సీమాంధ్రలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సీట్లకు అభ్యర్థుల్ని నిలబెట్టెందుకు సిద్ధంగా ఉండాలని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు  పార్టీ నేతలకు సూచించారు.
     
    పొత్తులపై పెదవి విరుపు....
     
    ఎన్నికలకు కేవలం నెలన్నర వ్యవధి మాత్రమే ఉండగా ఇంకా పొత్తులు కుదరకపోవడంపై పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. నరేంద్రమోడి హవా దేశంలో వీస్తుండం వల్ల తమపార్టీకి సీమాంధ్రలో ఏడు పార్లమెంట్, 25 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది. దీనికి చంద్రబాబునాయుడు అంగీకరించకపోతే తక్షణం పొత్తులకు స్వస్తిపలకాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు.

    చంద్రబాబునాయుడు రెండుకళ్ల సిద్ధాంతం, రాష్ట్రం విడిపోయే సమయంలోనూ కనీసం సమైక్యాంధ్ర అనే మాటను ఉచ్చరించడానికి చంద్రబాబు ఇష్టపడకపోవడంతో సీమాంధ్రలో పార్టీ బాగా దెబ్బతిందని అందువల్ల ఆ పార్టీతో పోత్తుకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి వద్ద స్థానిక నేతలు తేల్చి చెప్పినట్లు సమాచారం. టీడీపీతో పోత్తులు తమకు శాపంగా మారతాయనే అభిప్రాయం  కొంతమంది వ్యక్తం చేసినట్లు తెలిసింది.
     
    చిన్నమ్మకు చుక్కెదురు.....
     
    చిన్నమ్మ పురందేశ్వరీ విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈనేపథ్యంలో విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆమె హజరయ్యారు. ఎనిమిదేళ్లు కాంగ్రెస్‌లో కేంద్రమంత్రి పదవిని అనుభవించి, ఇప్పుడు ఆ పార్టీని కాదని బీజేపీలోకి రావడాన్ని స్థానిక  బీజేపీ నేతలు, కార్యకర్తలు తప్పు పడుతున్నారు. కేంద్రమంత్రులంటే ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఇప్పుడు ఆ ప్రభావం  పార్టీపై పడుతుందని పలువురు నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. బీజేపీలోకి వచ్చేవారు చివర వరకు ఈ పార్టీలోనే ఉండేందుకు సి ద్ధపడాలని, ముందుగానే పదవులు కావలంటూ రాకూడదని, పార్టీలో పనిచేయడానికి ఇష్టపడేవారు త్యాగాలకు సిద్ధపడాలని వెంకయ్యనాయుడు సూచించారు. కొత్తవారు రావడం వల్ల దీర్ఘకాలంగా పార్టీలో పనిచేసేవారు తమ అవకాశాలు పోయాయని కూడా భాదపడతారని ఆయన అభిప్రాయపడ్డారు. చిన్నమ్మను విజయవాడ బీజేపీ ఎంతమేరకు కలుపుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
     
    లోక్‌సభకు వెంకయ్యనాయుడు!?
     
    వెంకయ్యనాయుడును లోక్‌సభకు పోటీచేయాలంటూ ఆ పార్టీ శ్రేణుల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయి. రాష్ట్రకార్యవర్గసమావేశంలో ఈ మేరకు కొంతమంది నేతలు నినాదాలు కూడా చేశారు. సీమాంధ్రప్రాంతం నుంచి వెంకయ్యనాయుడు పోటీ చేస్తే, ఇక్కడ పార్టీ బలపడుతుందని పలువురు భావిస్తున్నారు.టీడీపీతో పోత్తుల కంటే వెంకయ్యనాయుడు ఈ ప్రాంతం నుంచి పోటీయే తమకు ఎక్కువ లాభిస్తుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.  అయితే ఈ ప్రతిపాదనకు  వెంకయ్య నాయుడు సుముఖంగా లేరు.  ఇప్పుడు తాను జాతీయ రాజకీయాల్లో ఉన్నందున రాష్ట్ర రాజకీయాలపై దృష్టిసారించలేనని తేల్చి చెప్పారు. కావాలంటే తన సలహాలు, సూచనలు రాష్ట్ర పార్టీకి అందిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement