కానిస్టేబుల్ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ ఆత్మహత్య

Published Sun, Jan 5 2014 2:50 AM

Constable suicide in Tenali

తెనాలి రూరల్, న్యూస్‌లైన్ : వ్యక్తిగత కారణాలతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పట్టణంలో శుక్రవారం రాత్రి 11 గంటలకు చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన జల్లి జయరావు (27) 2009లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. తొలి పోస్టింగ్‌గా వేమూరు పీఎస్‌లో బాధ్యతలు స్వీకరించి, డిప్యుటేషన్‌పై కొన్నాళ్లు తెనాలి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించాడు. ప్రస్తుతం వేమూరు పీఎస్‌లో పనిచేస్తున్నాడు. ఉద్యోగం రాగానే చుండూరు మండలం మండూరుకు చెందిన ఝాన్సీరాణితో తల్లిదండ్రులు వివాహం చేశారు. నాలుగేళ్లుగా తెనాలి బస్టాండ్ సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 
 కొంతకాలంగా కుటుంబంలో కలహాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల భార్య టూ టౌన్ పోలీస్‌స్టేషను ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేయగా వారు పిలిపించి సర్దిచెప్పి పంపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11గంటల సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  మరో గదిలో ఉన్న భార్య గమనించి చుట్టుపక్కల వాళ్లకు, బంధువులకు తెలియజేసింది. ట్రైనీ డీఎస్పీ సౌమ్యలత, టూ టౌన్ సీఐ ఎస్.ఆంథోనిరాజు, వేమూరు ఎస్‌ఐ క్రాంతికిరణ్, సిబ్బంది శనివారం ఉదయం జయరావు మృతదేహాన్ని సందర్శించి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. ఆత్మహత్య కేసుగా నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement