ప్యాకేజీ మాయాజాలం | Sakshi
Sakshi News home page

ప్యాకేజీ మాయాజాలం

Published Thu, Apr 14 2016 4:56 AM

ప్యాకేజీ మాయాజాలం - Sakshi

కల్వర్టులు నిర్మించకుండానే రోడ్డు నిర్మాణం
నాణ్యత ప్రమాణాలకు మంగళం
పత్తాలేని అధికార యంత్రాంగం
కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..

 
ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లు కళ్లకు కట్టినట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు. పదికాలాలపాటు ఉండాల్సిన రోడ్ల నిర్మాణంలో అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. దీంతో నిర్మాణ దశలోనే ఆ రోడ్లు దారుణంగా తయారవుతున్నాయి. క్యూరింగ్ సరిగా లేకపోవడంతో పాటు రోలింగ్ కూడా నామమాత్రంగా చేస్తుండటంతో మరు సటి రోజే రోడ్డుైపై రాళ్ల లేస్తున్నాయి.
 

 
సైదాపురం: కల్వర్టులు నిర్మించాలని ఎస్టిమేషన్లలో చూపారూ..ప్రభుత్వం కూడా నిధులను మంజూరుచేసింది. అయితే ఆ కల్వర్టులను నిర్మించకుండానే కాంట్రాక్టర్లు రోడ్డు పనులను సాగిస్తున్నారు. కంకర కూడా నాసిరకంగా ఉండటంతో రోడ్డు ఎంతకాలం ఉంటుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘సారూ మా రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేదు. పదికాలాల పాటు ఉండాల్సిన నిర్మాణంలో పూర్తిగా పర్యవేక్షణ కొరవడింది.మీరు పట్టించుకోరా’ అం టూ గ్రామస్తులు పర్యవేక్షణ ఇంజనీర్‌కు విన్నవించుకున్నా ప్రయోజనం శూన్యం. గ్రామం సమీపంలో దెబ్బతిన్న రెండు కల్వర్టులను పూర్తిచేయకుండానే రోడ్డును ఎందుకు వేస్తున్నారంటూ ప్రజలు అధికారిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలతో దాట వేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


 ఎన్నిరోజులు ఉంటాయో..
పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో సీఆర్‌ఆర్ (ఎస్‌సీ,ఎస్‌పీ) ప్యాకేజీ కింద అప్రోచ్ రోడ్డు నుంచి దేవరవేమూరు ఎస్సీకాలనీ వరకు రోడ్డును నిర్మించేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. సుమారు 2.68 కిలోమీటర్ల వరకు బీటీరోడ్డును నిర్మించేందుకు ప్రభుత్వం రూ.1.05 కోట్ల నిధులను మంజూరుచేసింది. రోడ్డు నిర్మించే సమయంలోనే కల్వర్టులను నిర్మించాల్సి ఉంది. కానీ అవేమీ పట్టించుకోకుండా పనులు చేసుకుపోతున్నారు. దెబ్బతిన్నవాటిని కూల్చి కొత్త కల్వర్టులను నిర్మించిన తర్వాతనే రోడ్డు వేయాలని గ్రామస్తులు పట్టుబట్టినా ఫలితం లేకుండాపోయింది. దేవరవేమూరు బీటీ రోడ్డు నిర్మాణ పనుల్లో పలు అక్రమాలు జరుగుతున్నాయి.

అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ నాణ్యతకు స్వస్తి పలికారు. క్యూరింగ్ సరిగా లేకపోతుండటంతో వేసిన రోజు నుంచే కంకర లేస్తుంది.సైడ్‌బరమ్ కూడా తూతూమంత్రంగా చేస్తుండటంతో ప్రమాదాలు జరిగే పరిస్థితులున్నాయి. కంకర విషయంలోనూ నాణ్యత లోపించిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

 నిర్భయంగా సమాధానాలు
 మండలంలో రూ.కోట్ల వ్యయంతో జరుగుతున్న ప్యాకేజీ పనుల్లో అన్నిచోట్ల అధికారులు తమ లీలలను ప్రదర్శిస్తున్నారు.   పొక్కందలలో ఎస్సీ కాలనీ వరకు పీఆర్‌ఆర్ గ్రాంట్ కింద సుమారు రూ.60లక్షల వ్యయంతో 1.40 కిలోమీటర్ల రోడ్డును నిర్మించేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఈ రోడ్డు నిర్మాణంలో మొదటి నుంచి అక్రమాలపర్వం నడుస్తోంది. రోడ్డు విస్తరణలో భాగంగా దగ్గర్లోనే ఉన్న మైకా దిబ్బల మట్టిని ఉపయోగిస్తుండటంతో మైకా అంతా రోడ్డుపైనే మెరుస్తోంది. ఈ మట్టి వల్ల రాబోయే రోజుల్లో మార్జిన్ దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే తమకు అర కిలోమీటర్ వరకే పర్మిషన్ ఉందని, ఈప్రాంతంలో ఆ మట్టి తప్ప వేరేది అందుబాటులో లేదని పర్యవేక్షణ ఇంజనీరు బాహాటంగా చెప్పడం గమనార్హం.


అటవీ అధికారులు నిఘా...: ప్యాకేజీ పనుల్లో భాగంగా షామైన్ రోడ్డు నుంచి మొలకలపూండ్ల వరకు బీటీరోడ్డును నిర్మించేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఆ కాంట్రాక్టర్ అటవీ అధికారులకు సమాచారం ఇవ్వకుండానే అటవీ ప్రాంతంలో ఉన్న మట్టిని తరలించారు. అటవీ అధికారులు తెలుసుకునే సరికి ఆయన చల్లగా జారుకున్నారు. మళ్లీ పనులను ప్రారంభిస్తే యంత్రాలను సీజ్ చేసేందుకు అటవీ అధికారులు ఉన్నారని తెలుసుకున్న కాంట్రాక్టర్ పత్తా లేకుండాపోయారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి నిర్మాణంలో జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తే మరిన్ని నిజాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి.
 
 
 కల్వర్టులు నిర్మాస్తాం:
దేవరవేమూరు రోడ్డులో కొత్తగా రెండు వంతెనలను నిర్మించాల్సి ఉంది.త్వరలోనే నిర్మిస్తాం. రోడ్డు పనుల్లో నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకుంటాం.  -డీఈ రాజు

Advertisement

తప్పక చదవండి

Advertisement