నత్తనడకన ‘గోదావరి’ | Sakshi
Sakshi News home page

నత్తనడకన ‘గోదావరి’

Published Fri, Feb 28 2014 1:34 AM

contractors neglect on pipeline works

 మేడ్చల్, న్యూస్‌లైన్ : జిల్లాకు సాగునీటితో పాటు హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టినప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ప్రాణ హిత నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల మీదుగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వరకు గోదావరి జలాలను తరలించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అలాగే గోదావరి జలాలను మేడ్చల్ మీదుగా నగరానికి కూడా తరలించనున్నారు.

ఇందుకోసం మండలంలోని గుండ్లపోచంపల్లి పరిధిలోని అయోధ్య చౌరస్తా వద్ద నెల రోజుల క్రితం పైపులైన్ నిర్మాణం పనులు  చేపట్టారు. శామీర్‌పేట్ మండ లం మీదుగా పైపులైన్ రావాల్సి ఉన్నా అక్కడ నిర్మాణం పనులు చేపట్టకుండా అయోధ్య చౌరస్తా నుంచి  దూలపల్లి  మీదుగా నగరానికి గోదావరి జలాలు తరలించేలా పైపులైన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే రోడ్డును తవ్వేయడంతో అయోధ్య చౌరస్తా మీదుగా రాకపోకలు సాగించాల్సిన 15 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 ప్రత్యామ్నాయ దారి లేదు...
 పైపులైన్ నిర్మాణం కోసం అయోధ్య చౌరస్తా వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డు తవ్వి ఒకపక్కనుంచి పైపులైన్ వేయాలి. అయితే సదరు కాంట్రాక్టర్ ఎలాంటి ప్రత్యామ్నాయ రోడ్డు వేయకుండా చౌరస్తా వద్ద మొత్తం రోడ్డు తవ్వేసి పైపులైన్ నిర్మాణ పనులు మొదలుపెట్టాడు. దీంతో మేడ్చల్ నుంచి గుండ్లపోచంపల్లికి అలాగే కండ్లకోయ, గౌడవెళ్లి, సుతారిగూడలతో పాటు నగరం నుంచి బాసిరేగడి, జ్ఞానాపూర్, నూతన్‌కల్, బండమాదారం, శ్రీరంగవరం, రాయిలాపూర్, గిర్మాపూర్,  మేడ్చల్ నుంచి కుత్బుల్లాపూర్‌లకు వెళ్లేందుకు ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో సుదూర ప్రాంంతాల నుంచి వచ్చిన భారీ వాహనాలవారు చౌరస్తా నుంచి దారి లేకపోవడంతో తిరిగి వేరే మార్గాల ద్వారా మేడ్చల్ మీదుగా వెళ్లే జాతీయ రహదారిపైకి రావాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి  చర్యలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement