పాజిటివ్‌గా మారిన నెగెటివ్‌ కేసులు | Sakshi
Sakshi News home page

తగ్గినట్టే తగ్గి... తలెత్తుతోంది

Published Fri, Apr 24 2020 1:03 PM

Corona Negative Case Test Come Positive Again in East Godavari - Sakshi

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం:  జిల్లాలో కరోనా వైరస్‌ నెగెటివ్‌ కేసులు పాజిటివ్‌ రావడం కలకలం రేపుతోంది.  గడచిన రెండు రోజులుగా జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల చరిత్ర తిరగేస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. తాజాగా గురువారం  రాజమహేంద్రవరం నెహ్రూనగర్‌లో ఒకటి, సామర్లకోట కోలావారి వీధిలో మరో  పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 34కు చేరుకుంది. ఇంతవరకు క్వారంటైన్, హోం క్వారంటైన్, జీజీహెచ్‌లోని ఐసోలేషన్‌ వార్డుల్లో దఫ, దఫాలుగా పరీక్షల నిర్వహించి అనంతరం నెగెటివ్‌ అని నిర్ధారిస్తున్నారు. అటువంటి వారిని డిశ్చార్జి చేశాక వారంతా ఎప్పటిలానే నిశ్చింతగా జనజీవన స్రవంతిలో ఉంటున్నారు. ఇక ముందు అలా ఉండడానికి వీల్లేదంటున్నారు. ఎందుకంటే బుధ, గురువారాల్లో నమోదైన పాజిటివ్‌ కేసులు గతంలో నెగెటివ్‌ వచ్చినవే కావడంతో జిల్లాలో ఆందోళన నెలకొంది. ఢిల్లీ వెళ్లి తిరిగొచ్చిన వారితో కాంటాక్ట్‌ అయిన వారికి మొదట నెగెటివ్‌ రాగా 20 రోజుల తరువాత పాజిటివ్‌ వచ్చింది. రాజమహేంద్రవరానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు ఢిల్లీ వెళ్లి తిరిగొచ్చాడు. అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు. (39 మంది పారిశుద్ధ్య కార్మికులకు కరోనా పాజిటివ్‌)

ఇంతలో అతడు అదే ఆస్పత్రిలో గుండె పోటుతో మృతి చెందాడు. అప్పుడు అతడి కుమారుడికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ రావడంతో ఇంటికి పంపేశారు. మృతి చెందిన వృద్ధుడి కుమారుడికి రోజువారీ వైద్య పరీక్షల్లో భాగంగా వలంటీర్లు, వైద్య సిబ్బంది పరిశీలించగా కరోనా లక్షణాలు కనిపించడంతో మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ రావడంతో ఆశ్చర్యపోవడం వైద్యుల వంతైంది. వెంటనే తేరుకున్న వైద్యులు  అతడితో పాటు ఢిల్లీ వెళ్లి తిరిగొచ్చిన వారందరికీ మరోసారి పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌లలో ఆరు నెగెటివ్‌ కేసులు కాస్తా పాజిటివ్‌గా తిరగబడ్డాయి. ఇదే తరహాలో సామర్లకోట కోలావారివీధికి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి కూడా నెగెటివ్‌ నుంచి పాజిటివ్‌గా తేలింది. 20 రోజుల క్రితం నెగెటివ్‌ అని నిర్ధారించి ఇళ్లకు పంపించేసిన కేసుల్లో సామర్లకోట, రాజమహేంద్రవరం నగరం, రూరల్‌లలో ఏడు కేసులు పాజిటివ్‌గా లెక్క తేలడంతో వైద్యులు ఉలిక్కిపడ్డారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కరోనా లక్షణాలతో క్వారంటైన్‌ చేసి గతంలో నెగెటివ్‌ వచ్చిన కేసులన్నింటినీ తిరగదోడే పనిలో పడ్డారు.  మూడు రోజుల వ్యవధిలోనే 13 పాజిటివ్‌ కేసులు రావడంతో మరిన్ని∙జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం 34 కేసుల్లో ఒక్క రాజమహేంద్రవరంనగరం, రూరల్‌లో కలిపి 19 కేసులు ఉండడంతో రాజమహేంద్రవరంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారితో కాంటాక్టైన వారితో కలిపి గురువారం ఒక్కరోజే 380 మందికి కరోనా పరీక్షల కోసం స్వాబ్‌ తీసుకున్నామని నగరపాలక సంస్థ కమిషనర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని నెహ్రూనగర్, సామర్లకోట కోలావారివీధిలను రెడ్‌జోన్‌లుగా ప్రకటించారు.

కరోనా అనుమానిత లక్షణాలున్నవారు ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే నెగిటివ్‌ కేసులు పాజిటివ్‌గా మారుతున్నట్టుగా నాలుగైదు రోజులుగా వస్తున్న నివేదికలు తెలియజేస్తున్నాయి. నెగిటివ్‌ నుంచి క్వారంటైన్‌ అయ్యాక పాజిటివ్‌ ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదు. జిల్లాలో ఈరోజు వరకు 34 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. జిల్లాలో ప్రస్తుతం ప్రతిరోజు 400 నుంచి 500 పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.  శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుంచి  శాంపిల్‌ రావడంతో జిల్లాకు సంబంధించిన శాంపిళ్లను ప్రత్యేకంగా ఎక్కువగా చేయలేకపోతున్నారు. ఈ కారణంగా మత్స్యశాఖ నుంచి మరో మెషీన్‌ తీసుకు వస్తున్నాం. అది అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ వెయ్యి నమూనాలు పరీక్షించే అవకాశం లభిస్తుంది.– డి.మురళీధర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ 

నిర్వహించినపరీక్షలు :6291
నెగెటివ్‌నివేదికలు :5098
నివేదికలురావాల్సింది :  1193
మొత్తంపాజిటివ్‌ కేసులు :  34
మూడురోజుల్లో పాజిటివ్‌ కేసులు :13

Advertisement

తప్పక చదవండి

Advertisement