ఏపీలో మరో 31 పాజిటివ్‌ కేసులు | Sakshi
Sakshi News home page

ఏపీలో మరో 31 పాజిటివ్‌ కేసులు

Published Sun, Apr 19 2020 4:11 AM

Coronavirus: 31 New Cases Registered In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 603కు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన బులిటెన్‌లో కొత్తగా 31 కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఇందులో ఒక్క కృష్ణా జిల్లాలోనే కొత్తగా 18 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 70కి చేరింది. కర్నూలు జిల్లాలో ఐదు కేసులు కొత్తగా రావడంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 129కి చేరింది. మరోవైపు.. తూర్పుగోదావరిలో 2, నెల్లూరులో 3, ప్రకాశంలో 2, పశ్చిమ గోదావరిలో ఒక కేసు చొప్పున శనివారం నమోదయ్యాయి.

తాజాగా ఏడుగురు కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా, ఇద్దరు మరణించినట్లు ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు. విశాఖ నుంచి ముగ్గురు, తూర్పుగోదావరి నుంచి ముగ్గురు, కర్నూలు జిల్లా నుంచి ఒకరు చొప్పున డిశ్చార్జి అయ్యారు. కాగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించడంతో మొత్తం ఆ జిల్లాలో మరణాల సంఖ్య 5కి చేరింది. కర్నూలు జిల్లాలో శనివారం ఒకరు మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి 42 మంది కోలుకోగా, 16 మంది మరణించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 545 మంది చికిత్స తీసుకుంటున్నారు.

విజయవాడలో 9 నెలల పాపకు..
విజయవాడలో తొమ్మిది నెలల పాపకు కరానా పాజిటివ్‌ వచ్చింది. ఆమెతోపాటు, తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్యలకు కూడా రావడంతో వారంతా ప్రస్తుతం గన్నవరం సమీపంలోని కోవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాప తండ్రి కారు మెకానిక్‌గా పనిచేస్తూ మాచవరం కార్మికనగర్‌ ప్రాంతంలో ఉంటున్నాడు. లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి షెడ్‌ మూసేయడంతో ఇంటికే పరిమితమయ్యాడు. ఆ ప్రాంతంలో వారం రోజుల కిందట ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. ఎలా సోకిందో తెలీదు కానీ, తొమ్మిది నెలల చిన్నారితోపాటు, ఆమె తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్యలకు సోకింది. ఒకే ఇంట్లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆ ప్రాంతంతోపాటు, విజయవాడ నగరం ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.  

Advertisement
Advertisement