ఒకే రోజు 140 మంది డిశ్చార్జి | Sakshi
Sakshi News home page

ఒకే రోజు 140 మంది డిశ్చార్జి

Published Thu, May 7 2020 3:58 AM

Coronavirus: High impact is from primary contact - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారు చాలా వేగంగా కోలుకుంటున్నారు. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 140 మంది డిశ్చార్జి అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 729కు చేరుకోవడమే కాకుండా రికవరీ రేటు 41.02 శాతానికి చేరుకుంది. ఇది దేశీయ సగటు 28.63 శాతం కంటే చాలా ఎక్కువ. కరోనా వైరస్‌తో 1,012 మంది చికిత్స తీసుకుం టున్నారు. మరోవైపు... మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 7,782 మందికి టెస్టులు నిర్వహించారు. వీరిలో 60 మందికి పాజిటివ్‌ రిజల్ట్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,777కు చేరింది. ఇదే సమయంలో మూడు మరణాలు నమోదు కాగా, మొత్తం మరణాల సంఖ్య 36కు చేరింది. 

ప్రైమరీ కాంటాక్ట్‌దే అధిక ప్రభావం
కరోనా వచ్చిన రోజు నుంచే రాష్ట్ర ప్రభుత్వం పలు మాధ్యమాల ద్వారా భౌతిక దూరం పాటించి కరోనాను జయించొచ్చని పదే పదే విజ్ఞప్తి చేసింది. చాలా ప్రాంతాల్లో ఈ ప్రకటనలు, విజ్ఞప్తులు బాగా పనిచేశాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించకపోవడం, అనుమానిత లక్షణాలున్నా ఇతరులతో కలిసి వెళ్లడం వంటివి చేయడంతో కరోనా వ్యాప్తి చెందింది. ఢిల్లీకి వెళ్లి వైరస్‌ సోకి వచ్చిన వారూ తక్కువే.. కానీ ఇక్కడకు వచ్చాక వారి నుంచి ఇతరులకు వ్యాప్తిచెందిన కేసులే ఎక్కువ. ఇక విదేశాల నుంచి వచ్చిన వారి ప్రభావం ఒక విధంగా మన రాష్ట్రంలో నామమాత్రమనే చెప్పాలి. విదేశాల నుంచి, ఢిల్లీ నుంచి వచ్చిన వారి ద్వారా నమోదైన కేసులు కేవలం 16 శాతం మాత్రమేనని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  

తాజా గణాంకాలు చూస్తే...
► విదేశీ ప్రయాణికుల ద్వారా పాజిటివ్‌ కేసులు 17 మాత్రమే. అంటే మొత్తం కేసుల్లో ఈ శాతం 0.95 మాత్రమే. ఢిల్లీ నుంచి వచ్చిన వారి కేసులు 271 కాగా కేసుల శాతం 15.25. ఈ రెండు రకాల వారితో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ల ద్వారా నమోదైన కేసులు 866. మొత్తం కేసుల్లో ఇవే 48.73 శాతంగా ఉన్నాయి. 
► కంటైన్మెంట్‌ క్లస్టర్లలోనే 298 మందికి పాజిటివ్‌. ఇందులో ప్రైమరీ కాంటాక్ట్‌ శాతం 37.87 కాగా, సెకండరీ కాంటాక్ట్‌ శాతం 10.86. హెల్త్‌కేర్‌ ప్రొవైడర్స్‌లో ఇప్పటికి 64 మందికి పాజిటివ్‌.

Advertisement
Advertisement