అమాంతం పెరిగిపోయిన కౌలు ధరలు.. | Sakshi
Sakshi News home page

సేద్యమే ముద్దు

Published Fri, Jul 10 2020 8:44 PM

Corp Rental prices Demanding in villages Prakasam - Sakshi

సొంతూళ్లో పంట భూములను కౌలుకు అప్పగించి చెట్టుకొకరు, పుట్టకొకరుగా పట్టణాలకు పయనమైన వారంతా గ్రామాలకు తిరిగొచ్చారు. కరోనా మహమ్మారి విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి దొరక్క అంతా పల్లెబాట పట్టారు.  ఇప్పుడు వారి దృష్టి సేద్యం వైపు మళ్లడంతో జిల్లాలో కౌలు భూములకు డిమాండ్‌ పెరిగింది. గతానికి భిన్నంగా ఈ ఏడాది కౌలు ధరలు ఇంతగా పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికిస్తున్న ప్రోత్సాహం ఒక కారణమైతే.. కరోనా దెబ్బకు అన్ని రంగాలూ దెబ్బతిన్నప్పటికీ వ్యవసాయ పనులు మాత్రం యథావిధిగా సాగుతుండటం మరో కారణంగా కనిపిస్తోంది.  

జె.పంగులూరు:  జిల్లాలో సాగు భూములకు తీవ్ర డిమాండ్‌ నెలకొంది. కౌలు భూముల కోసం రైతుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గత ఏడాదితో పోల్చితే ఎకరాకు కనీసం ఐదు వేల రూపాయల మేర పెరుగుదల కనిపిస్తోంది. భూముల వారీగా ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు కౌలు ఖరారు చేస్తున్నారు. ఖరీఫ్‌లో పంటల సాగుకు ప్రకృతి అనుకూలిస్తుందన్న భరోసా, పంట ఉత్పత్తులకు మార్కెట్‌ ధర ఆశాజనకంగా ఉంటుందన్న విశ్వాసం అధిక శాతం మందిని సాగుకు సమాయత్తం చేస్తోంది. ఈ ఏడాది సగటు వర్షపాతానికి మించి వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలు రైతుల్లో ఆశావహ దృక్పథానికి దారితీసింది.

ఖరారవుతున్న ఒప్పందాలు..  
కరోనా మహమ్మారి దెబ్బకు చిన్నాచితకా వ్యాపారాలు కుంటుపడ్డాయి. నిన్నా మొన్నటి వరకు దూర ప్రాంతాలకు వెళ్లి చిన్నపాటి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను నెట్టు కొచ్చిన వారు స్వ గ్రామాలకు చేరుకుంటున్నారు. ప్రైవేటు కంపెనీలు, ఇతర రంగాలలో ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడంతో నిరుద్యోగ యువత పొలాల వైపు చూస్తోంది. గడచిన నాలుగు నెలలుగా మార్కెట్‌ పూర్తిగా దెబ్బతింది. వ్యాపారాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు లేకపోవడంతో సొంత భూములున్న రైతులు కౌలుకు ఇవ్వడం మానేసి తామే సాగుకు సన్నద్ధమవుతున్నారు. గత ఏడాది వరకు నీటి లభ్యత ఉండి వ్యవసాయ బోర్లు ఉన్న భూములకు ఎకరానికి రూ.20వేల నుంచి రూ.25వేల వరకు కౌలు లభించగా ఈ ఏడాది అవే భూములకు ఎకరానికి రూ. 30 నుంచి రూ.35వేల వరకు కౌలు చెల్లించేందుకు రైతులు పోటీ పడుతున్నారు. ఈ పోటీ భూ యజమానులకు కలిసి వస్తోంది. 

మిర్చి ధరలతో మరింత డిమాండ్‌..
గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది మిర్చి పంటకు గిట్టుబాటు ధర రావటం కౌలు ధరలు పెరిగేందుకు కారణమవుతోంది. గత సంవత్సరం సకాలంలో వర్షాలు పడ్డాయి. మిర్చి పంటకు నీరు సంవృద్ధిగా అందింది.   ప్రస్తుతం ఎకరా మిర్చి పంట వేసేందుకు కౌలు రూ. 35 వేలు నుంచి 40 వేలు వరకు ఉంది. శనగ సాగు చేసే పొలాలకు ఎకరా కౌలు రూ. 25 నుంచి 30 వేలు పలుకుతోంది. ఈ కౌలు కూడా జూన్, జూలై మాసాలలో ముందుగానే కౌలు చెల్లించాలని భూ యజమానులు షరతు పెడుతున్నారు.

శనగ పంటకు గిట్టుబాటు ధర..
ఎన్నడు లేని విధంగా ప్రభుత్వం ఈ సంవత్సరం శనగ పంటకు మంచి గిట్టుబాటు ధర కల్పించింది. దీంతో రైతులు దళారులకు పంట అమ్మకుండా నేరుగా మార్కెట్‌ యార్డులకు అమ్ముకొని లభాలు బాట పట్టారు. సంవత్సరాల కొద్ది శీతల గిడ్డంగులలో వున్న శనగపంట ఈ సంవత్సరం మొత్తం అమ్ముడుపోయింది. దానితో ఈ సంవత్సరం శనగ పంట వేసేందుకు రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.  

మాగాణికి రూ.30 వేలు..
ఈ సంవత్సరం జిల్లాలో మగాణి పంటలు కళకళలాడాయి. సకాలంలో వర్షాలు పడటం, సాగరు కాలువ నీరు సమృద్ధిగా అందటం, గిట్టుబాటు ధర వుండటంతో కౌలు ధరలు అమాంత పెరిగాయి.

Advertisement
Advertisement