కో ఆప్షన్ రగడ

24 Aug, 2014 03:58 IST|Sakshi

- కార్పొరేషన్ ఎన్నికలో పట్టు కోసం ఎమ్మెల్యే యత్నం
- ఎంపీ సూచించే అభ్యర్థికి చెక్‌పెట్టే దిశగా పావులు
- మైనార్టీ స్థానం కోసం ఇరువర్గాల పట్టు  

సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనంతపురం నగర కార్పొరేషన్‌లో ‘కో-ఆప్షన్’ సభ్యుల ఎన్నిక చినికి చినికి గాలివానగా మారే అవకాశం కనిపిస్తోంది. కార్పొరేషన్‌లో ఇప్పటికే ఎమ్మెల్యే వర్గం, మేయర్ వర్గం ‘ఉప్పు-నిప్పు’గా మారిన నేపథ్యంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక పాలక పక్షంలోని విభేదాలను మరింత తీవ్రతరం చేసే అవకాశాలున్నాయని పరిశీలకుల అభిప్రాయం. నగర కార్పొరేషన్ పాలకవర్గాన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలనుకున్న స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నాలకు మేయర్ స్వరూప అడ్డుకట్ట వేస్తున్న నేపథ్యంలో అసలు ఆమెకు మద్దతిస్తున్న జేసీ వర్గంతోనే అమీ తుమీ తేల్చుకోవాలని ఎమ్మెల్యే వర్గం పావులు కదుపుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో మైనార్టీ కోటా కింద జేసీ వర్గం ప్రతిపాదిస్తున్న అభ్యర్థి ఇషాక్‌కు పోటీగా సర్దాన్‌ను రంగంలోకి తెస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. కార్పొరేషన్ కౌన్సిల్‌లో ఐదు కో-ఆప్షన్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మూడు స్థానాలకు (వీటిలో ఒకటి మహిళ కోటా) ఉద్యోగ విరమణ చేసిన వారు, మాజీ ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈ మూడు స్థానాల్లో ఒకటి రిటైర్డ్ కమిషనర్ నాగభూషణం, రెండవది మాజీ కౌన్సిలర్, టీడీపీ నగర కమిటీ అధ్యక్షుడు కృష్ణకుమార్, మూడవది మాజీ కౌన్సిలర్ శివబాల పేర్లు దాదాపు ఖారారైనట్లు తెలిసింది.

మైనార్టీ కోటా కింద రెండు స్థానాలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఒక స్థానం ముస్లిం మైనార్టీకి, మరో స్థానం క్రిస్టియన్ లేదా ఇతర మైనార్టీ వర్గానికి ఇవ్వడం ఆనవాయితీ. ఇతర మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు అధికార పార్టీలో లేనప్పుడు రెండూ ముస్లిం మైనార్టీకి ఇస్తారు. ఈ రెండు స్థానాల్లో ఒకదాన్ని క్రిష్టియన్ మైనార్టీ కింద టీడీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకుడు ఈటెస్వామిదాస్ పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. మిగిలిన ఒక మైనార్టీ స్థానాన్ని ఇషాక్‌కు ఇవ్వాలని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సూచించినట్లు సమాచారం.

జేసీ సోదరులు సూచించిన అభ్యర్థికి స్థానం కల్పిస్తే నగర కార్పొరేషన్‌లో తన పట్టు మరింత సడలిపోతుందన్న అభిప్రాయంతో ఉన్న ఎమ్మెల్యే తనకు అనుకూలుడైన మరో మైనార్టీ అభ్యర్థి సర్దాన్‌ను తెరమీదకు తీసుకొస్తున్నట్లు సమాచారం. ఎలాగైనా కార్పొరేషన్ పాలక మండలిలో జేసీ వర్గీయులకు స్థానం లేకుండా చేయాలన్న పట్టుదలతో ఎమ్మెల్యే వర్గం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నగరంలో ఇటీవల జరిగిన ఒకటి రెండు సంఘటనలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల ఇద్దరు మైనార్టీ నేతలను వైఎస్‌ఆర్‌సీపీ నుంచి టీడీపీలోకి చేర్చుకునేందుకు ఎమ్మెల్యే పెద్ద ఎత్తున ‘లలిత కళా పరిషత్’లో ఏర్పాట్లు చేసుకున్నారు. నగరమంతా ఫ్లెక్సీలు కట్టించారు.

ఈ విషయం తెలిసిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర రెడ్డి మందీ మార్బలంతో సభావేదిక వద్దకు వచ్చి ‘మా అన్న ఎంపీగా ఉన్నాడు. మాకు సమాచారమే లేకుండా మీ ఇష్టానుసారం ఎవరినంటే వారిని పార్టీలో చేర్చుకుంటారా..? ఎంత ధైర్యం మీకు’ అంటూ ఉగ్రరూపం దాల్చారు. జేసీ ప్రభాకర రెడ్డి ఉగ్రరూపం చూసి టీడీపీలో చేరాలని వచ్చిన మైనార్టీ నేతలు చల్లగా జారుకోగా.. వీరిని పార్టీలో చేర్చుకునే కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఒక్క మాట కూడా జేసీ ప్రభాకర రెడ్డికి ఎదురు చెప్పకుండా మిన్నకుండి పోయారు.

ఇలా ఆ కార్యక్రమం రసాభాస అయ్యింది. కార్పొరేషన్‌లో జేసీ వర్గీయులకు ఎలాంటి పదవులు లేనప్పుడే.. వారి పెత్తనం ఇలా ఉంటే.. రేపు కార్పొరేషన్ పాలకవర్గంలో వారి వర్గీయులకు స్థానం కల్పిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన ఎమ్మెల్యే వర్గంలో నెలకొన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జేసీ వర్గీయులకు కౌన్సిల్‌లో స్థానం లేకుండా చేయాలని..అందుకోసం అవసరమైతే మేయర్ స్వరూపకు ప్రస్తుతం అనుకూలంగా ఉంటున్న కౌన్సిలర్లతో రాజీ ధోరణితో వ్యవహరించాలని ఎమ్మెల్యే వర్గీయులు భావిస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా అనంతపురం నగర కార్పొరేషన్‌లో పట్టు కోసం ఇంత కాలం మేయర్, ఎమ్మెల్యేల మధ్య సాగుతున్న పోటీ.. ఇకపై జేసీ, ఎమ్మెల్యే మధ్య కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు