తలదించుకున్న దొరతనం | Sakshi
Sakshi News home page

తలదించుకున్న దొరతనం

Published Tue, Feb 19 2019 7:37 AM

Corruption Allegation on CMD Resigned to Post - Sakshi

అసిస్టెంట్‌ ఇంజినీర్‌ నుంచి సీఎండీ పదవి వరకు అంచెలంచెలుగా ఎదిగారు. మరెవ్వరికీ దక్కని అవకాశాన్ని దక్కించుకున్నారు. విద్యుత్‌ శాఖలోని అన్ని  ఇంజినీరింగ్‌ పదవులను చేపట్టి ‘దొర’గా వెలుగొందారు. ఏకంగా యాభై ఏళ్లు ఏకఛత్రాధిపత్యాన్ని చెలాయించారు. చివరకు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి పదవి నుంచి తప్పుకున్నారు. ఇంకా పదవీకాలం ఏడు నెలలుండగానే ఆయన నిష్క్రమించారు. ఈపీడీసీఎల్‌లో అర్థంతరంగా పదవి నుంచి వైదొలగిన ప్రథమ సీఎండీగా రికార్డుకెక్కారు. ఆయనే ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ హెచ్‌వై దొర.

సాక్షి, విశాఖపట్నం: ఈపీడీసీఎల్‌ సీఎండీ దొర తరచూ ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయినప్పటికీ తనకున్న పలుకుబడితో వాటి నుంచి బయటపడుతూ వస్తున్నారు. ఆఖరికి ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీగా ఆయనపై వచ్చిన ఆరోపణలు మెడకు చుట్టుకొని తల వంచుకొని నిష్క్రమించాల్సివచ్చింది. హెచ్‌వై దొర ఏపీఎస్‌ఈబీలో 1978లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా విశాఖలోనే ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. చీఫ్‌ ఇంజినీర్‌ స్థాయిలో 2008లో పదవీ విరమణ పొందారు. అదే ఏడాది ఈపీడీసీఎల్‌ డైరెక్టర్‌గా నియమితులైన 2013లో ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ పీఠం ఎక్కారు. 2017 సెప్టెంబర్‌ 15న ఈపీడీసీఎల్‌ సీఎండీగా నియమితులయ్యారు. ఈయన పదవీకాలం 2018 సెప్టెంబర్‌తో ముగియాల్సి ఉన్న తరుణంలో ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని ఏడాదిపాటు పొడిగించింది. ఈ లెక్కన ఆయన వచ్చే సెప్టెంబర్‌ వరకు ఈ పదవిలో కొనసాగాల్సి ఉంది. ఇంతలో రాజీనామా చేయాల్సివచ్చింది.

ఆరోపణలు కొత్త కాదు
దొరపై ఆరోపణలు కొత్త కాదు. ఈపీడీసీఎల్‌ ఉద్యోగులు, ఇంజినీర్ల బదిలీల్లో అవినీతి, పక్షపాత వైఖరితో వ్యవహరిస్తారన్న ఆరోపణల్లో ఆయన చిక్కుకున్నారు. సంస్థ పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తారని చెబుతారు. ఈపీడీసీఎల్‌లో జీవీఎస్‌ ప్రాజెక్ట్సు పేరుమీద నడిచే ఓ కాంట్రాక్టు సంస్థ యజమానితో సన్నిహితంగా ఉంటూ అందులో పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలున్నాయి. ఈ సొమ్ముతో విజయనగరం జిల్లాలో ఓ ప్రైవేటు స్కూలు నడుపుతున్నారని చెబుతున్నారు. ఇంకా సబ్‌స్టేషన్ల నిర్మాణం, వైర్లు మార్చడం, అవసరం లేకపోయినా పనులు సృష్టించి నిధులు వెచ్చించడం వంటి ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి. అయినా ఇవేమీ ఆయనను ఏమీ చేయలేకపోయాయి.

మెడకు చుట్టుకున్న కవర్డ్‌ కండక్టర్లు..
అన్ని ఆరోపణల నుంచి తప్పించుకుంటూ వచ్చిన దొర కవర్డ్‌ కండక్టర్ల అవినీతి నుంచి బయట పడలేకపోయారు. ఎస్పీడీసీఎల్‌ సీఎండీగా ఉన్నప్పుడు కృష్ణా పుష్కరాల సందర్భంగా రెండు డిస్కంల పరిధిలో కవర్డ్‌ కండక్టర్లను వేశారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సరఫరాలో అంతరాయం కలగకుండా, ప్రాణాపాయం లేకుండా ఉండడానికి స్వీడన్‌ నుంచి దిగుమతి చేసుకున్న కవర్డ్‌ కండక్టర్లను అమర్చారు. బెంగళూరుకు చెందిన రేచం ఆర్పేజీ ప్రయివేటు లిమిటెడ్‌ అనే సంస్థకు అనుకూలంగా టెండరు నిబంధనలు రూపొందించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంట్రాక్టు దక్కించుకున్న ఆ సంస్థ 3,804 కిలోమీటర్ల మేర కండక్టరు వేయడానికి రూ.195.83 కోట్ల వ్యయం అవుతుందని తెలిపింది. స్వీడన్‌ నుంచి దిగుమతి అయిన ఆ పరికరాల ఇన్‌వాయిస్‌లను పరిశీలిస్తే రూ.64.52 కోట్లు మాత్రమే ఉన్నట్టు తేలడంతో ఆ కాంట్రాక్టు సంస్థకు రూ.131.30 కోట్లు అదనంగా చెల్లించినట్టు నిర్ధారణ అయింది. ఈ వ్యవహారంపై ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి విజిలెన్స్‌తో విచారణ చేయించగా.. అవినీతి జరిగినట్టు తేలింది. అయినా ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడంతో ఒక వ్యక్తి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సీరియస్‌ అవడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఈ బాగోతంలో సీఎండీ దొర పాత్రను దృష్టిలో ఉంచుకుని ఆయనను రాజీనామా చేయాలని ప్రభుత్వ పెద్దలు సూచించారు. దీంతో ఆయన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రభుత్వానికి లేఖ పంపడం, వెంటనే ఆమోదించడం జరిగిపోయాయి.

సాయంత్రం వరకూ కార్యాలయంలోనే..
మూడు రోజులు ముందుగానే రాజీనామా లేఖను పంపిన సీఎండీ దొర ఆ విషయాన్ని రహస్యంగా> ఉంచారు. ఎప్పటిలానే సోమవారం విధులకు హాజరయ్యారు. సాయంత్రం వరకు విధుల్లోనే ఉన్నారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ సాయంత్రం ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో విధుల నుంచి నిష్క్రమిస్తున్నట్టు ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. ఈ ఆకస్మిక పరిణామానికి వారంతా నిశ్చేష్టులయ్యారు. ఒక్కొక్కరుగా ఆయనను కలిసి ‘అయ్యో సారూ’ అంటూ సానుభూతి ప్రకటించారు. అనంతరం మౌనంగా ఇంటికి వెళ్లిపోయారు. ఇలా విశాఖలోనే ఏఈగా ప్రస్థానాన్ని ప్రారంభించిన దొర అత్యున్నత సీఎండీ పదవిలో ఆరోపణల్లో చిక్కుకుని ఇంకా ఏడునెలలు పదవీ కాలం ఉండగానే ఇంటిముఖం పట్టారు. పదవి ఉండగానే నిష్క్రమించిన తొలి సీఎండీగా ‘దొర’ రికార్డుకెక్కారు.

Advertisement
Advertisement