కమీషన్ ఇస్తేనే కనెక్షన్! | Sakshi
Sakshi News home page

కమీషన్ ఇస్తేనే కనెక్షన్!

Published Thu, Sep 11 2014 1:19 AM

corruption in electricity department

ఒంగోలు క్రైం : వ్యవసాయ విద్యుత్‌కు సంబంధించి కొత్త కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేసేందుకు ఆ శాఖాధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల అధికారులు నిబంధనల ప్రకారం రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయకుండా కమీషన్లు ఇచ్చిన వారికే మంజూరు చేస్తున్నారు. లంచాలు ఇవ్వని రైతులకు ఏడాదికి కూడా మంజూరు చేయకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ వేధిస్తున్నారు.

వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్లను దరఖాస్తులు వచ్చిన ఆర్డర్ ప్రకారం మంజూరు చేయాలి. కానీ, పలు మండలాల ఏఈలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కమీషన్లు ఇచ్చిన వారికి వెంటనే మంజూరు చేస్తున్నారు. ముందుగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ కమీషన్లు ఇవ్వకుంటే నెలల తరబడి మంజూరు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

 మూడు మండలాల్లో పరిస్థితి అధ్వానం...
 జిల్లాలోని సింగరాయకొండ, టంగుటూరు, చీమకుర్తి మండలాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామంలో పది మందికిపైగా రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు చేసిన అధికారులు.. వారికి మాత్రం మంజూరు చేయకపోవడంతో ఆయా రైతులు పంటలు సాగుచేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అదే విధంగా టంగుటూరు మండంలో వ్యవసాయ విద్యుత్ దరఖాస్తులు 30కిపైగా పెండింగ్‌లో ఉన్నాయి. చీమకుర్తి సెక్షన్ పరిధిలో పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. అవినీతి ఆరోపణలపై నెలన్నర క్రితం చీమకుర్తి సెక్షన్ ఏఈని బదిలీ చేసినప్పటికీ అతను మాత్రం అక్కడే కొనసాగుతున్నారు. ఈ మండలంలోని ఒక్క చండ్రపాడు గ్రామంలోనే మూడు వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల కోసం 11 మంది రైతులు డీడీలు చెల్లించి ఎదురుచూస్తున్నారు.

ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర నుంచి కేబుల్ వరకూ విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలోనే సమకూర్చి ఆ ప్రాంతానికి తరలించి బిగించాలి. కానీ, కిలోమీటర్ పొడవున కేబుల్ కొరత ఏర్పడిందని, దాన్ని తెచ్చుకుంటేనే ట్రాన్స్‌ఫార్మను బిగిస్తామని స్థానిక విద్యుత్ శాఖాధికారి చెప్పడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులే కేబుల్‌ను మాయంచేస్తూ రైతులతో తెప్పిస్తున్నారని, కమీషన్ ఇచ్చిన వారికే కేబుల్ సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలో మరో 8 ట్రాన్స్‌ఫార్మర్ల దరఖాస్తులు కూడా కార్యాలయంలో మగ్గిపోతున్నాయి.

పల్లామల్లి, మంచికలపాడు గ్రామాలకు చెందిన పలువురు రైతులు చీమకుర్తి ఏఈపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి మోమోలు కూడా జారీ చేశారు. అయినప్పటికీ మండలంలో పరిస్థితి మారలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పలు మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వర్షాభావానికితోడు విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా సాగుకు నోచుకోలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement
Advertisement