‘రెవెన్యూ’లో అవినీతి కంపు | Sakshi
Sakshi News home page

‘రెవెన్యూ’లో అవినీతి కంపు

Published Sat, Apr 22 2017 10:38 AM

corruption in revenue department in guntur


► రొంపిచర్ల తహశీల్దార్‌ అవినీతిపై కలెక్టర్‌ విచారణ
► నరసరావుపేట కార్యాలయ సిబ్బందిపై తహశీల్దార్‌ ఎంక్వైరీ
► విమర్శలకు తావిస్తున్న రెవెన్యూ అధికార, సిబ్బంది తీరు

అంతా పారదర్శకమన్నారు..అంతా ఆన్‌లైన్‌ సిస్టమన్నారు..ఏ ఒక్క చిన్న కాగితం కావాలన్నా మీ సేవ ద్వారా తీసుకోవాల్సిందేనన్నారు.. తహసీల్దార్‌లకు డిజిటల్‌ సిగ్నేచర్, బయోమెట్రిక్‌ ఇచ్చామన్నారు..అసలు రెవెన్యూ కార్యాలయం గడపే తొక్కాల్సిన పనేలేదని ఊదరగొట్టారు. తీరా వాస్తవ పరిస్థితుల్లోకి వెళితే అర్హుల దరఖాస్తులకు మోక్షం కలగాలంటే జేబులకు చిల్లులు పడుతున్నాయి. రూపాయి పట్టుకుని ఆఫీసుకు వెళితే కావాల్సిన సర్టిఫికెట్లు అందుతున్నాయి. ఈ వ్యవహారాల్లో ఒకరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా రెవెన్యూ సిబ్బంది మొత్తం భాగస్వామ్యులవుతూ శాఖ ప్రతిష్టను అవినీతి పాలు చేస్తున్నారు.  

నరసరావుపేట టౌన్‌ : రెవెన్యూ శాఖలో అధికార, సిబ్బంది అవినీతి భాగోతం ఒక్కొక్కటీ వెలుగు చూస్తోంది. ఒక్క నరసరావుపేటలోనే కాదు నియోజకవర్గంలోని రొంపిచర్ల మండల తహశీల్దార్‌ కార్యాలయ అవినీతి ఇప్పుడు బట్టబయలైంది. అధికారుల చేయి తడిపితే చాలు.. ఎటువంటి పనైనా ఇట్టే జరిగిపోతుంది. ఎంతలా అంటే ఒకరి కుటుంబ సభ్యుల «ధృవపత్రం మరొకరికి ఇచ్చేలా..,  ప్రభుత్వ భూములు ఇంకొకరికి కట్టబెట్టేలా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

వివరాల్లోకి వెళితే... రావిపాడు గ్రామానికి చెందిన పుట్టి ఇన్నయ్య గతేడాది జులైలో మృతి చెందగా, అతని కుటుంబ సభ్యుల ధృవపత్రం ఇంకొకరికి అందజేశారు. ఈ వ్యవహారంలో తన డిజిటల్‌ సంతకాన్ని దుర్వినియోగం చేసి కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది భారీగా ముడుపులు స్వీకరించారన్న ఆరోపణలపై తహశీల్దార్‌ విచారణకు ఆదేశించారు. ఇదిలా ఉంటే రొంపిచర్ల మండలం అన్నవరం గ్రామానికి చెందిన రైతు బొల్లా కోటేశ్వరరావు తనకున్న సుమారు 5 ఎకరాల భూమినిæ పవర్‌ గ్రిడ్‌ సంస్థకు విక్రయించాడు.

భూమి రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఆన్‌లైన్‌లో పేరు నమోదు అవసరమై ఉండటంతో తహశీల్దార్‌ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అధిక ధరకు భూమిని అమ్ముకున్నాడన్న విషయం తెలిసిన తహశీల్దార్‌ ఎకరాకు రూ.లక్ష ఇస్తే అడంగల్‌ ఎక్కిస్తానని, లేదంటే కుదరదని చెప్పటంతో కంగుతిన్న రైతు గత సోమవారం గుంటూరులో నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించినట్లు రెవెన్యూ వర్గాల ద్వారా సమాచారం.

చేయి తడిపితే ఏపనైనా ఇట్టే అవుతుంది..
నియోజకవర్గంలోని నరసరావుపేట, రొంపిచర్ల మండల తహసీల్దార్‌ కార్యాలయాల్లో కొంతమంది సిబ్బంది దళారుల అవతారం ఎత్తి ఎంతటి పనైనా ఇట్టే చక్కబెడుతున్నారు. ఫలితంగా నిరుపేదలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెబ్‌ల్యాండ్‌లో రైతులు భూములను నమోదు చేసుకోవాలని ఆదేశించడం.. రెవెన్యూ వర్గాలకు కనకవర్షం కురిపిస్తోంది. ఒక సర్వేలో ఉన్న భూమిని మరో సర్వేలో ఉన్నట్లు ముందుగానే వెబ్‌ల్యాండ్‌లో ఎక్కిస్తున్నారు.

విషయం తెలుసుకొని ఆందోళనతో పొలం యజమాని అడంగల్‌ నమోదు కోసం అధికారులను సంప్రదిస్తే మొదట సర్వేయర్‌ నుంచి సర్టిఫికెట్‌ తెప్పించుకోవాలంటూ చెబుతున్నారు. నానా ప్రయాసలకు కోర్చి ధృవపత్రం తెచ్చుకున్నా అనేకమార్లు తిప్పుకొని పనులు చేసేందుకు డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాటు విద్యార్థుల కుల, నివాసం, కుటుంబ, ఆదాయం ధృవపత్రాల కోసం అధికారుల చేయి తడపనిదే పని కావట్లేదు.

ఆరోపణలు అవాస్తవం..
అడంగల్‌ నమోదుకు ఎకరాకు రూ.లక్ష అడిగా నని రైతు బొల్లా కోటేశ్వరరావు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. పవర్‌ గ్రిడ్‌ సంస్థ కొనుగోలు చేసిన భూములను ఆ సంస్థ ప్రతినిధులు స్వయంగా దరఖాస్తు చేసుకొని అడంగల్‌ ఎక్కించుకుంటున్నారు. – నాసరయ్య, రొంపిచర్ల తహశీల్దార్‌ 

Advertisement
Advertisement