అట్టుడికిన గోవాడ | Sakshi
Sakshi News home page

అట్టుడికిన గోవాడ

Published Mon, Sep 7 2015 11:42 PM

అట్టుడికిన గోవాడ - Sakshi

ఫ్యాక్టరీలో అవినీతిపై మహా ధర్నా.. మానవహారం
వైఎస్సార్‌సీపీ పిలుపునకు అనూహ్య స్పందన..  సీపీఐ, కాంగ్రెస్ మద్దతు
ధర్నాను అడ్డుకోబోయిన పాడేరు ఏఎస్సీతోరైతుల వాగ్వాదం
విచారణకు అమర్, బూడి, ధర్మశ్రీ డిమాండ్
రిలే నిరశనలు ప్రారంభం

 
చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో అవినీతిపై వెంటనే విచారణ చేపట్టాలని, రైతులకు బకాయిలు చెల్లించాలని కోరుతూ ఫ్యాక్టరీ గేటు ఎదుట సోమవారం మహాధర్నా చేశారు. రిలేదీక్షలు ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ నాయకులు హాజరుకాగా సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఫ్యాక్టరీ గేటు ఎదుట మానవహారం చేయడంతో   ఇరు వైపులా  సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.   ఆందోళన సజావుగా సాగుతున్న సమయంలో   పాడేరు ఏఎస్పీ బాబూజీ ఆవేశంగా అక్కడకు వచ్చి మానవహారంలో ఉన్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఏఎస్పీని చూసి అక్కడే ఉన్న చోడవరం సీఐ కిరణ్‌కుమార్, పోలీసు సిబ్బంది  రంగంలోకి దిగి రైతులను, నాయకులను పక్కకు తోసేసి ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రయత్నించారు. దీనిని  రైతులు ప్రతిఘటించారు. పోలీసుల దౌర్జానాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ, సీపీఐ, కాంగ్రెస్  కార్యకర్తలు, నాయకులు వాహనాలకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు.   రైతుల బాధలంటే పోలీసులకు అంత చులకనా అంటూ  ఏఎస్పీని నిలదీశారు.   వైఎస్సార్‌సీపీ  జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, పార్టీ చోడవరం సమన్వయకర్త కరణం ధర్మశ్రీ  పోలీసు అధికారులతో మాట్లాడి ఆందోళన యథావిధిగా కొనసాగించారు. దీంతో ఏఎస్పీ  అక్కడ నుంచి వెళ్లిపోయారు.


త్వరలో కలెక్టరేట్ ముట్టడి: అమర్‌నాథ్
ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ చంద్రబాబులాగే ఆ పార్టీ నాయకులు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.  గోవాడ, అనకాపల్లి చెరకు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ త్వరలో గోవాడ నుంచి అనకాపల్లి మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి కలెక్టరేట్ ముట్టడి చేస్తామన్నారు.  మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ బినామీల పేరుతో పంచదారను అమ్మి రూ. 8కోట్లు అవినీతికి పాల్పడినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.  కేసు  మాఫీచేసుకోవడానికే ముఖ్యమంత్రి దగ్గరకి  స్థానిక ఎమ్మెల్యే వెళ్లారు తప్ప విచారణ వేయమని చెప్పడానికి కాదని విమర్శించారు.    కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ గోవాడ అవినీతి అంతా చోడవరం ఎమ్మెల్యే అండతోనే జరిగిందని ఆరోపించారు.

టెండర్లు వేయకుండా కేంద్ర మంత్రి సుజనా చౌదరి బందువుకు లక్షకుపైగా క్వింటాళ్ల పంచదారను ఎలా విక్రయిస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిపై తక్షణం సీబీఐ లేదా సిటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  సీపీఎం డివిజన్ కార్యదర్శి రెడ్డి పల్లి అప్పలరాజు,  కాంగ్రెస్  నాయకుడు, సీడీసీ చైర్మన్ దొండా రాంబాబు తదితరులు అవినీతిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో వైఎస్సార్‌సీపీ, సీపీఐ, కాంగ్రెస్  నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.  వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో  ఫ్యాక్టరీ గేటువద్ద సోమవారం చేపట్టిన రిలే  నిరహారదీక్షలను  అమర్‌నాథ్,   బూడి ముత్యాలనాయుడు,  కరణం ధర్మశ్రీ  ప్రారంభించారు.
 

Advertisement
Advertisement