అవినీతి ఖాకీల్లో కలవరం ! | Sakshi
Sakshi News home page

అవినీతి ఖాకీల్లో కలవరం !

Published Fri, Sep 29 2017 8:06 AM

Corruption police officers fear on cricket bookie case - Sakshi

సాక్షి, గుంటూరు : జిల్లాలో క్రికెట్‌ బుకీలు, బెట్టింగ్‌ నిర్వాహకులపై రూరల్‌ జిల్లా ఎస్పీ సీహెచ్‌.వెంకటప్పలనాయుడు కన్నెర్ర చేశారు. బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిపై తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి వదిలేయకుండా, కీలక బుకీల్ని కూడా అరెస్టు చేసి డొంకను కదులుస్తున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌పై సీరియస్‌గా దృష్టి సారించిన పి.హెచ్‌.డి. రామకృష్ణను బెట్టింగ్‌ మాఫియా అధికార పార్టీ నేతల అండతో బదిలీ చేయించిన విషయం తెలిసిందే. క్రికెట్‌ బుకీల ఒత్తిడితో ఎస్పీ స్థాయి అధికారినే బదిలీ చేయించడంతో జిల్లాలోని పోలీస్‌ అధికారుల్లో గుబులు మొదలయింది.

రెండేళ్లుగా రెచ్చిపోతున్న మాఫియా
క్రికెట్‌ బెట్టింగ్‌ మాఫియా రెండేళ్లుగా మరింత రెచ్చిపోయింది. అమాయకులను వ్యసనపరులుగా మార్చేసింది. బెట్టింగ్‌ల్లో డబ్బులు పోగొట్టుకున్న వారి ఆస్తులు సైతం దౌర్జన్యంగా రాయించుకుని వారి కుటుంబాలను రోడ్ల పాలు చేసింది. అనేక మంది బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలూ అనేకం ఉన్నాయి. జిల్లాలో కొందరు అవినీతి పోలీస్‌ అధికారులకు భారీ మొత్తంలో మామూళ్లూ ఇస్తూ ఆయా ప్రాంతాల్లో తమ స్థావరాల్ని ఏర్పాటు చేసుకుని నిర్భయంగా క్రికెట్‌ బెట్టింగ్‌ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. నర్సరావుపేట, సత్తెనపల్లి, గురజాల సబ్‌ డివిజన్‌ల పరిధిలో ఇప్పటి వరకూ పనిచేసిన కొందరు పోలీస్‌ అధికారులైతే స్థాయి మరిచి క్రికెట్‌ బుకీలతో కలిసి బెట్టింగ్‌ కేంద్రాలకు వెళ్లడం, వారితో కలసి టూర్లు, జల్సాలు సైతం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎస్పీ సీరియస్‌
గుంటూరు రూరల్‌ ఎస్పీ వెంకటప్పలనాయుడు క్రికెట్‌ బుకీలపై సీరియస్‌గా దృష్టి సారించారు. స్థానిక పోలీస్‌ అధికారులకు తెలియకుండా తాను ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం ద్వారా మొదట ఓ కీలక బుకీని అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా సేకరించిన సమాచారంతో బెట్టింగ్‌ మాఫియా డొంకను కదులుస్తున్న విషయం తెలిసిందే. గురువారం కీలక బుకీ సుబ్బారావుతోపాటు మరో ఎనిమిది మందిని అరెస్ట్‌ చూపిన పోలీసులు వారిపై గేమింగ్‌ యాక్ట్‌తోపాటు గంజాయి సరఫరా చేస్తున్నట్లు కేసు నమోదు చేయడంతో క్రికెట్‌ బుకీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బెట్టింగ్‌ నిర్వాహకులు, పంటర్‌లను సైతం అదుపులోకి తీసుకోవాలంటూ నర్సరావుపేట, గురజాల, సత్తెనపల్లి పోలీస్‌ సబ్‌ డివిజన్‌ల పరిధిలోని పోలీస్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో అవినీతి పోలీస్‌ అధికారుల్లో కలవరం మొదలయింది. అంతేకాకుండా బుకీల సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా జిల్లాలో బుకీలు, నిర్వాహకులతో సంబంధాలు ఉన్న పోలీస్‌ అధికారులు, సిబ్బంది జాబితాను సైతం ఎస్పీ తయారు చేశారనే విషయం బయటకు పొక్కడంతో అవినీతి పోలీసు అధికారులకు కంటిపై కునుకు లేకుండా పోతోంది. నర్సరావుపేట టూటౌన్‌ ఎస్‌ఐకి బెట్టింగ్‌ వ్యవహారంలో సంబంధాలు ఉండటం వల్లే ఎస్పీ వీఆర్‌కు పిలిపించారని తెలియగానే... ఈ వ్యవహారంలో ఇంకెదరిపై వేటు పడుతుందోననే చర్చ పోలీస్‌శాఖలో జోరుగా సాగుతోంది.

రాత్రికి రాత్రే పరార్‌
క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాను అరెస్ట్‌ చేసి వారిపై కఠినమైన సెక్షన్లు కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. నరసరావుపేటకు చెందిన కీలక బుకీ సుబ్బారావును గుంటూరు సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే విషయం తెలుసుకున్న జిల్లాలోని పలువురు బుకీలు, నిర్వాహకులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సెల్‌ఫోన్లు పక్కన పడేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఐదు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళడంతో వీరిని ఎలా పట్టాలో తెలియక  ఆయా ప్రాంతాల పోలీస్‌ అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఓ వైపు ఎస్పీ ఒత్తిడి మరోవైపు బుకీలు, నిర్వాహకుల సమాచారం తెలియక ఆందోళనలో పడ్డారు. అయితే, వారితో సంబంధాలు ఉన్న పోలీస్‌ అధికారులు మాత్రం విషయం పాతబడి సీరియస్‌ తగ్గే వరకూ పక్కకు వెళ్లి పొమ్మని బుకీలకు సలహా ఇచ్చి పంపారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.  బెట్టింగ్‌పై ఎస్పీ ఇదే తరహాలో పట్టు బిగిస్తే మాఫియా పని పట్టవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏ మాత్రం పట్టు సడలించినా బుకీలు మరింత రెచ్చిపోతారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

Advertisement
Advertisement