పత్తి అమ్ముకోవడానికి రైతుల అవస్థలు | Sakshi
Sakshi News home page

పత్తి అమ్ముకోవడానికి రైతుల అవస్థలు

Published Thu, Nov 7 2013 4:07 AM

Cotton farmers struggle to sale cotton crop

 భైంసా/భైంసా రూరల్, న్యూస్‌లైన్ : ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని అమ్ముకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నా రు. భైంసా మార్కెట్‌కు ఉదయం తీసుకొచ్చిన పత్తిని రాత్రి వరకు కూడా వ్యాపారులు, అధికారులు కొనుగోలు చేయకపోవడంతో ఆందోళన చేశారు. అయినా కొనుగోళ్లు జరగలేదు.
 
 బహిరంగ వేలం పాటలో..
 భైంసా పట్టణంలో బుధవారం నుంచి అధికారికంగా బహిరంగ వేలం పాట ద్వారా పత్తి కొ నుగోళ్లు జరుగుతాయని అధికారులు ప్రకటిం చారు.  ఇప్పటికే కలెక్టర్ అహ్మద్ బాబు వేలం పాటలు నిర్వహించే యార్డుల్లోనే పత్తి తూకం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకేంద్రంలో అదే విధంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం 9 గంటలకే కాటన్ యార్డుకు వచ్చిన జిన్నింగ్ ఫ్యాక్టరీ యజమానులు బహిరంగ వేలం పాటల్లో పాల్గొనక ముందే యార్డుల్లో తూకం వేస్తే అందరికీ ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొనడంతో రైతులకు, వ్యాపారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొనుగోళ్లు చేయమని వ్యాపారులు ఉదయం 11.13 గంటలకు యార్డు నుంచి నిష్ర్కమించారు. 11.23 గంటలకు అధికారులు కూడా వెనక్కి వెళ్లారు. దీంతో యార్డుకు వచ్చిన రైతులు ఏఎంసీ చైర్మన్ విఠల్‌రెడ్డిని కలిసి కార్యాలయానికి వెళ్లారు.
 
 రోడ్డుపై బైఠాయింపు
 కార్యాలయంలో చర్చించినా ఫలితం కనిపించక పోవడంతో అందరూ భైంసా బస్టాండ్ వద్దకు చేరుకుని మధ్యాహ్నం 12.32 గంటలకు ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. రైతులతోపాటే విఠల్‌రెడ్డి, రైతు నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మధ్యాహ్నం 1.03 గంటలకు పట్టణ సీఐ పురుషోత్తం విఠల్‌రెడ్డితోపాటు రాస్తారోకోలో బైఠాయించిన వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు.
 
 ఆర్డీవో రాకతో..
 ఈ విషయం తెలుసుకున్న నిర్మల్ ఆర్డీవో అరుణశ్రీ మధ్యాహ్నం 3.26 గంటలకు ఏఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. మార్కెటింగ్ ఏడీఎం అజ్మీరరాజు, ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌రెడ్డి సమస్యకు మార్గం చూపేందుకు పత్తి వ్యాపారులను, రైతులను, రైతు నాయకులను పిలిపించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 7.30 గంటల వరకు పలు దఫాలుగా చర్చలు జరిగినా సఫలం కాలేదు. సాయంత్రం 5.10 గంటలకు కలెక్టర్‌తో మాట్లాడేందుకు ఫోన్ చేసినా వీడియో కాన్ఫరెన్స్‌లో ఉండడంతో ఆయన మాట్లాడలేక పోయారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో అనంతరం కలెక్టర్‌తో రాత్రి 7 గంటలకు మరో మారు ఫోన్‌లో సంభాషించారు. పరిస్థితి వివరించడంతో ఆదిలాబాద్‌కు రావాలని కలెక్టర్ సూచించారు. దీంతో పత్తి వ్యాపారులు, అధికారులు, ఎమ్మెల్యే చారి, చైర్మన్ విఠల్‌రెడ్డిలు 7.30 గంటలకు ఆదిలాబాద్ బయలుదేరి వెళ్లారు.
 
 తప్పని నిరీక్షణ
 మొదటి రోజు పత్తి బండ్లతో వచ్చిన రైతులకు నిరీక్షణ తప్పలేదు. దశలవారీగా చర్చలు జరిగినా సఫలీకృతం కాకపోవడంతో బండ్లను రోడ్డుపైనే పెట్టారు. పత్తి బండ్లతో వచ్చిన 400లకుపైగా రైతులు ఆకలితో అలమటించాల్సి వచ్చింది. ఆటోవాలాలు రైతులతో వాగ్వాదానికి దిగి తాము చేసుకున్న అద్దె ఒప్పందాన్ని రెండు రోజులకు పొడిగించుకున్నారు. దీంతో రైతులు కొనుగోళ్లు త్వరితగతిన చేపట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానంతో రైతులే నష్టపోవాల్సి వస్తుందని వ్యాపారులతో చర్చించకుండానే కొనుగోళ్లు ప్రారంభమవుతాయని యార్డుకు పిలిపించడం ఎంత వరకు సమంజసం అంటూ అధికారులను నిలదీశారు. చేసేదేమి లేక రైతులు బండ్లపైనే నిద్రించారు.
 
 రాత్రి వరకు వాగ్వాదాలే...
 రైతులకు, అధికారులకు, రైతు నాయకులకు, కమీషన్ ఏజెంట్లకు, పత్తి వ్యాపారులకు, అధికారులకు మధ్య ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు వాగ్వాదాలు కొనసాగుతూనే కనిపించాయి. యార్డుల్లో కొనుగోలు చేసినా తూకం ఫ్యాక్టరీల్లోనే వేస్తామని వ్యాపారులు తేల్చి చెప్పారు. యార్డుల్లో తూకం వేస్తే ఫ్యాక్టరీకి వచ్చే వరకు ఎవరు బాధ్యులుగా ఉంటారని సీజన్ పెరిగితే బండ్లు ఎక్కువగా వస్తే తూకం వేయడం సాధ్యం కాదని పత్తి వ్యాపారులు తమ వాదన వినిపించారు. అధికారులు ఇచ్చిన ఆదేశాలు ఆదిలాబాద్‌లో పాటిస్తున్న వ్యాపారులకు భైంసాలో పాటించడం ఎందుకు సాధ్యం కాదని రైతులు ప్రశ్నించారు. రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా అవి అమలు కావడం లేదంటూ రైతు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు చెప్పినా ఎన్ని చర్చలు జరిపినా చివరకు కొనుగోళ్లు మాత్రం జరగలేదు. ఎంతో ఆశతో పంట అమ్మకానికి వచ్చిన పత్తి రైతులకు రెండు రోజుల నిరీక్షణ తప్పలేదు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement