మండలి నోటీసులు బేఖాతరు | Sakshi
Sakshi News home page

మండలి నోటీసులు బేఖాతరు

Published Mon, Mar 9 2015 2:53 AM

Council ignores notices

హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లోని బీ కేటగిరీ సీట్ల భర్తీలో అక్రమాలపై సంజాయిషీ ఇవ్వాలంటూ ఉన్నత విద్యామండలి జారీ చేసిన తాఖీదుల్ని  ప్రైవేటు కళాశాలలు గాలికొదిలేశాయి. మొత్తం 165 కళాశాలలకు నోటీసులు పంపగా అందులో సమాధానమిచ్చింది 25 కళాశాలలే. కొన్ని  పొరపాటును అంగీకరించినా,. మరికొన్ని మాత్రం సక్రమంగానే యాజమాన్య కోటాను భర్తీ చేశామంటూ బుకాయించాయి.  ఈ అక్రమాలపై లోతుగా విచారించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చే యాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత ఆయా కళాశాలల తప్పుల స్థాయినిబట్టి యాజమాన్యకోటా భర్తీని తిరస్కరించడం వంటి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ భర్తీపై విధివిధానాలను నిర్దేశిసూ ఉన్నత విద్యాశాఖ 2012, సెప్టెంబర్ 3న  66, 67 జీఓలతోపాటు 2011 జులై 28న 74 జీఓను విడుదల చేసింది. ప్రైవేటు కళాశాలలు వీటిని పట్టించుకోకుండా కోటా సీట్లను భర్తీ చేశాయి.

ఈ సీట్లను 2014 సెప్టెంబర్ 15వ తేదీలోగా భర్తీచేయాలి. సెప్టెంబర్ 30 నాటికి ఆ వివరాలను మండలి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడంతోపాటు సంబంధిత ధ్రువపత్రాలు, ఇతర వివరాల హార్డ్ కాపీలు, సీడీలను ఉన్నత విద్యామండలికి సమర్పించాలి. ఈ విధానాన్ని అనేక కళాశాలలు పట్టించుకోలేదు.మొక్కుబడి ఓ జాబితాను మండలికి పంపించి చేతులు దులుపుకుంటున్నాయి. అయితే నోటీసులు అందుతుండడంతో అడ్మిషన్లకు ఆమోదం తెలపాలంటూ కొన్ని కాలేజీలు మండలికి హార్డ్ కాపీలు, సీడీలను ఇప్పుడు పంపుతున్నాయి. కొన్ని కాలేజీలు రాష్ట్ర విద్యార్ధులకు కాకుండా బీహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల విద్యార్ధులను చేర్చుకున్నాయి.

మరికొన్ని కాలేజీలు ఇతర రాష్ట్రాల విద్యార్ధుల ధ్రువపత్రాలను తీసుకొని వారితో సీట్లు భర్తీచేసినట్లు రికార్డుల్లో చూపుతున్నా వాస్తవానికి వాటిల్లో పిల్లలు లేరనే సమాచారం కూడా మండలికి వచ్చింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఓ కాలేజీలో బీహార్ విద్యార్ధులను చేర్చుకున్నారంటూ స్థానిక ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి... ఉన్నత విద్యాశాఖకు ఫిర్యాదుచేశారు. ఇలాంటి ఆరోపణలతో ఉన్నత విద్యామండలి పరిశీలన చేపట్టగా 104 ఇంజనీరింగ్, 34 బీ ఫార్మసీ, 27 డీఫార్మసీ కళాశాలలు అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. నిబంధనల ఉల్లంఘనపై 10 రోజుల్లో సమాధానమివ్వాలని ఫిబ్రవరి 26న మండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి నోటీసులు జారీచేశారు. త్వరలోనే ఓ కమిటీని వేసి చర్యలకు ఉపక్రమించ నున్నారు.

Advertisement
Advertisement