కౌన్సిల్ గరంగరం... | Sakshi
Sakshi News home page

కౌన్సిల్ గరంగరం...

Published Fri, May 8 2015 4:41 AM

కౌన్సిల్ గరంగరం... - Sakshi

పాలక, ప్రతిపక్ష సభ్యుల మాటల తూటాలు
వైఎస్సార్ సీపీ సభ్యుడు సస్పెన్షన్
అధికారులే టార్గెట్‌గా సమావేశం

విజయవాడ సెంట్రల్ :
⇒ ఏమ్మా.. మేయర్ కూర్చోమంటే కూర్చోవాలి.
⇒ సార్.. కూర్చోవాల్సింది మీరు. మేం కాదు. సభ్యులు నిలబడి మాట్లాడటం సభా సంప్రదాయం.
⇒ ఇది రోడ్డు కాదమ్మా..
⇒ చర్చించేందుకే ఇక్కడికి వచ్చాం సార్. సభ్యుల్ని   మాట్లాడనివ్వండి.. అంటూ మేయర్ కోనేరు శ్రీధర్, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల మధ్య మాటల తూటాలు పేలాయి. వీరికి పాలక, ప్రతిపక్ష సభ్యులు గొంతు కలపడంతో కౌన్సిల్ సమావేశం వాడీవేడీగా సాగింది. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన గురువారం జరిగింది. సెక్రటరీ సెల్ అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని పుణ్యశీల ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులు ఇచ్చే ప్రశ్నకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. దీంతో సభలో వాగ్వాదం చెలరేగింది.

 
 ఒకరికొకరు వాగ్యుద్ధం
 నగరంలో తాగునీటి సమస్యపై అధికారులు సమాధానం చెప్పలేదని వైఎస్సార్ సీపీ సభ్యుడు బహుదూర్ ఆరోపించారు. సభ నిర్వహించడం మేయర్‌కు చేతకావడం లేదన్నారు. సోది మాటలతో నడిపేస్తున్నారని ఎద్దేవా చేశారు. దీనిపై టీడీపీ ఫ్లోర్‌లీడర్ హరిబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నీ లాంటి సభ్యుడు సభకు రావడం దురదృష్టకరం’ అన్నారు. దీంతో పాలక, ప్రతిపక్ష సభ్యుల వాగ్యుద్ధం మొదలైంది. బహుదూర్‌ను కూర్చోవాల్సిందిగా మేయర్ ఆదేశించారు. సమాధానం చెబితేనే కూర్చుంటాననడంతో ఆయనను సభ నుంచి సస్పెండ్ చేశారు. 22 ప్రశ్నలకు ఏడు ప్రశ్నలతోనే చర్చ ముగిసింది.
 
 అధికారులపై ముప్పేట దాడి
 అధికారుల తీరుపై పాలక, ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. పెంచిన ఏడుశాతం నీటి చార్జీలను తగ్గించమని ఆరు నెలల కిందట తీర్మానం చేసినా ఎందుకు తగ్గించలేదని టీడీపీ సభ్యులు ముప్పా వెంకటేశ్వరరావు, జాస్తి సాంబశివరావు కో-ఆప్షన్ సభ్యుడు సిద్ధెం నాగేంద్రరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదని సీఈ ఎంఏ షుకూర్ సమాధానమిచ్చారు. కార్పొరేటర్లకు ఏం అధికారాలు ఉన్నాయో చెప్పకుండా ఎందుకు మభ్యపెడుతున్నారని బీజేపీ సభ్యుడు ఉత్తమ్‌చంద్ బండారీ నిలదీశారు. ప్రశాంతి ఆస్పత్రి సమీపంలో నిర్మిస్తున్న ఒక భవనం ఖాళీ స్థలం పన్ను కోటి రూపాయల బకాయి ఉంటే టౌన్‌ప్లానింగ్ అధికారులు ఎలా అనుమతిచ్చారని వైఎస్సార్ సీపీ సభ్యురాలు పి.సుభాషిణి ప్రశ్నించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడతామని కమిషనర్ వీరపాండియన్ బదులిచ్చారు. సర్కిల్-1 పరిధిలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ప్రయివేటు సైన్యాన్ని ఏర్పాటుచేసుకుని డివిజన్లలో వసూళ్ల దందా చెలాయిస్తున్నారని టీడీపీ ఫ్లోర్‌లీడర్ హరిబాబు సభ దృష్టికి తెచ్చారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని
 
 మేయర్ చురకలు అంటించారు.
 కుక్కల బెడద తీర్చండి : కుక్కల బెడదకు శాశ్వత పరి ష్కారం చూపాలని వైఎస్సార్ సీపీ, టీడీపీ, సీపీఎం సభ్యు లు డిమాండ్ చేశారు. గోశాల తరహాలోనే కుక్కల పెంప కానికి కొంత స్థలాన్ని కేటాయించి, దాని నిర్వహణ బాధ్యతను జీవకారుణ్య సంస్థకు అప్పగించాలని పుణ్యశీల సూచి ంచారు. కమిషనర్ మాట్లాడుతూ కుక్కల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయన్నారు.
 
 త్వరలో ఎల్‌ఈడీ లైట్లు : వీధి దీపాల నిర్వహణ నగరంలో అధ్వానంగా మారిందని వైఎస్సార్ సీపీ సభ్యురాలు అవుతు శ్రీశైలజ ఆరోపించారు. రియల్ ఎనర్జీ సంస్థ నిర్వాహకులు సక్రమంగా పనిచేయడం లేదని సభ్యులు ఆరోపించారు. దీనికి కమిషనర్ సమాధానమిస్తూ పదివారాల్లో నగరంలో 30వేల ఎల్‌ఈడీ లైట్లు అమర్చనున్నట్లు చెప్పారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌కు ఆ కాంట్రాక్ట్ అప్పగించామని చెప్పారు. రోల్‌బ్యాక్ పింఛన్లు ఏడు నెలలు రావాల్సి ఉండగా, ఒక్కనెలే ఇవ్వడంపై లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారని వైఎస్సార్ సీపీ సభ్యుడు చందన సురేష్ సభ దృష్టికి తెచ్చారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందని కమిషనర్ పేర్కొన్నారు.
 
 బారికేడ్లు తొలగించండి
 బారికేడ్ల ఏర్పాటు విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పుణ్యశీల ఆరోపించారు. బందరురోడ్డులో బారికేడ్లు ఏర్పాటుచేయడం సరికాదన్నారు. టీడీపీ సభ్యుడు సీహెచ్ గాంధీ మాట్లాడుతూ ట్రాఫిక్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో మేయర్ అధ్యక్షతన కౌన్సిల్ హాల్‌లో జరగాల్సి ఉండగా, సీపీ ఆఫీసులో సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు.
 
 ఔట్‌గోయింగ్ కట్ : నగరపాలక సంస్థలో ల్యాండ్‌లైన్ ఫోన్లకు ఔట్ గోయింగ్ కట్ చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. అధికారులు, సిబ్బంది అందరికీ సెల్‌ఫోన్లు ఉం డగా రూ.5 లక్షల ల్యాండ్‌లైన్ బిల్లు రావడంతో దుబారా పెరుగుతోందన్నారు. అనంతరం భూకంప మృతులు, పర్వతారోహుడు మస్తాన్‌బాబు, జింఖానా స్విమ్మింగ్ పూల్‌లో మృతిచెందిన మనీష్‌కు కౌన్సిల్ సంతాపం తెలిపింది.

Advertisement
Advertisement