అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి | Sakshi
Sakshi News home page

అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి

Published Tue, Mar 13 2018 11:35 AM

CPI Dharna At Collectorate - Sakshi

నెల్లూరు(పొగతోట): వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇళ్ల నిర్మాణాల్లో  అవినీతికి పాల్పడుతున్న అధికారులు, కాంట్రాక్టర్లపై  చర్యలు తీసుకోవాలని సీపీఐ నేత వీ  రామరాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీపీగూడూరు మండలంలో మరుగుదొడ్లు, ఇళ్ల నిర్మాణాల్లో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. అర్హులకు బిల్లులు మంజూరు చేయకుండా గతంలో నిర్మించిన మరుగుదొడ్లు, ఇళ్లకు బిల్లులు చేస్తున్నారని తెలిపారు. ముడుపులు ఇచ్చిన వారికి సకాలంలో బిల్లులు చెల్లిస్తూ, ఇవ్వని వారిని అధికారులు తిప్పుకుంటున్నారని ఆరోపించారు. జిల్లా అధికారులు విచారణ జరిపి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ ఆర్‌ ముత్యాలరాజుకు వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాలో రైతు సంఘ నాయకుడు షాన్‌వాజ్, ప్రసాధ్, పీ మల్లి, సుందరం, వజ్రమ్మ, మమత, తదితరులు పాల్గొన్నారు.

చెరువుకు నీరు విడుదల చేయాలని డిమాండ్‌
ప్రజల, పశువుల దాహార్తిని తీర్చేం దుకు చాగణం చెరువుకు తెలుగుగంగ కాలువ నుంచి నీటిని విడుదల చేయాలని సైదాపురం మండలం చాగణం గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వర్షాలు లేని కారణంగా భూగర్భజలాలు అడగంటి పోయాయన్నారు. తానీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెనిద్రలో భాగంగా గ్రామానికి వచ్చిన కలెక్టర్‌కు తాగునీటి సమస్యను విన్నవించగా  తెలుగుగంగ కాలువ నుంచి చెరువుకు నీరు సరఫరా చేసేలా కాలువ పనులు ప్రారంభించారని తెలిపారు. ప్రస్తుతం కాలువ పనులు నిదానంగా సాగుతున్నాయన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని కాలువ పనులు పూర్తి చేసి తెలుగుగంగ కాలువ నుంచి చెరువుకు నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ ఆర్‌ ముత్యాలరాజుకు వినతి పత్రం అందజేశారు.

Advertisement
Advertisement