ఆర్థిక నేరగాళ్లకు అడ్డా బీజేపీ

26 Dec, 2019 05:37 IST|Sakshi

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

సూళ్లూరుపేట: ఆర్థిక నేరగాళ్లకు బీజేపీ అడ్డాగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ధ్వజమెత్తారు. ప్రజలసొమ్మును రుణాలుగా తీసుకుని ఆ నగదును తిరిగి బ్యాంకులకు ఎగ్గొట్టిన వారిని ఆ పార్టీలోకి చేర్చుకుంటూ దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. సూళ్లూరుపేటలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేస్తోందని, పరిపాలనను అస్తవ్యస్తం చేసి ప్రజలను తికమక పెడుతోందన్నారు. ఇప్పటికే అందరికీ ఆధార్‌ పేరుతో గుర్తింపు కార్డులున్నప్పటికీ ఇందులో మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ తుగ్లక్‌ పాలనను చేస్తున్నారని విమర్శించారు.

1971కు ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన ముస్లిం సోదరులకు పౌరసత్వం లేకుండా చేయాలనే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారన్నారు. కార్గిల్‌ వార్‌లో యుద్ధం చేసిన ఓ మాజీ ముస్లిం సైనికుడికి కూడా పౌరసత్వం లేకుండా చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. మనది సెక్యులరిజం దేశం అయినప్పటికీ హిందూమతం మాత్రమే ఉండాలన్నట్టుగా పాలన కొనసాగిస్తున్నారన్నారు. జనవరి 8న దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో అసెంబ్లీ, సెక్రటేరియట్‌ ఒకే చోట ఉంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. చంద్రబాబు రాజధాని విషయంలో ప్రజలను చీటింగ్‌ చేశారని విమర్శించారు. 

మరిన్ని వార్తలు