ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు ఉద్యమించాలి : సీపీఐ | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు ఉద్యమించాలి : సీపీఐ

Published Fri, Jul 17 2015 8:08 PM

CPI seeks special status for Andhra Pradesh

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం విద్యార్థులు ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన 13 నెలల కాలంలో ప్రత్యేక హోదా కోసం ప్రధానిపై ఒత్తిడి తేవడంలో సీమాంధ్ర ఎంపీలు విఫలమయ్యారని ఆరోపించారు. ఈ నెల 21 నుంచి జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించుకుని రావాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై పార్లమెంటులో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమై రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఎంపీలకు హిజ్రాలతో స్వాగతం పలకాలని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఈనెల 22న ఉత్తరాంధ్ర, 28, 29 వ తేదీల్లో రాయలసీమ ప్రాంతాల్లో సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పిన బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఎంపీలు వ్యాపారాలు చేసుకుంటూ ప్రత్యేక హోదా విషయాన్ని విస్మరించారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడిన ఎంపీలు వారి బలాన్ని పార్లమెంటులో చూపించాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి కేంద్రం రూ. 350 కోట్లను విదిలించగా, 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1600 కోట్లను ఇష్టారాజ్యంగా ఖర్చు చేసిందని అన్నారు. రాజమండ్రిలో జరిగిన దుర్ఘటన నుంచి గుణపాఠం నేర్చుకోని సీఎం చంద్రబాబు పుష్కరాలు ముగిసే రకూ అక్కడే ఉంటానని, మంత్రి వర్గ సమావేశాన్ని సైతం రాజమండ్రిలో నిర్వహిస్తానని ప్రకటించడం సిగ్గు చేటన్నారు. సీఎం రాజమండ్రిలోనే తిష్టవేస్తే అధికార యంత్రాంగం మొత్తం ఆయన చుట్టూనే తిరిగితే ప్రజలకు మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. ఉద్యోగులకు పీఆర్‌సీ ద్వారా వేతనాలు పెంచిన ప్రభుత్వం మున్సిపల్ కార్మికులపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం దారుణమన్నారు.

Advertisement
Advertisement