వామపక్ష విధానాలే ప్రత్యామ్నాయం | Sakshi
Sakshi News home page

వామపక్ష విధానాలే ప్రత్యామ్నాయం

Published Sun, May 31 2015 4:05 AM

CPm leader v.krishnaiah fires

సీపీఎం నేత వి.కృష్ణయ్య
 
 సత్తెనపల్లి : ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వామపక్ష విధానాలే దేశానికి ప్రత్యామ్నాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.కృష్ణయ్య అన్నారు. శనివారం స్థానిక మెడికల్ అసోసియేషన్ హాలులో పుతుంబాక వెంకటపతి 22వ వర్ధంతి సభ నిర్వహించారు. ముఖ్యఅతిథి కృష్ణయ్య మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు అమలుచేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు, నిత్యవసర ధరలు విపరీతంగా పెరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.

రోజురోజుకు ప్రజాసమస్యలు పెరుగుతున్నాయన్నారు. విధానాలపరంగా కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఒకేటనన్నారు. ఈ నేపథ్యంలో దేశప్రజలకు వామపక్ష విధానాలే ప్రత్యామ్నాయాలన్నారు. వెంకటపతి స్ఫూర్తితో కార్యకర్తలంతా కంకణబద్ధులై ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు గద్దె చలమయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకుని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మట్టి అమ్ముకుంటున్నారని విమర్శించారు.

ఈక్రమంలో పేదలను భూముల నుంచి తొలగిస్తున్నారని, ఇదే జరిగితే సీపీఎం చూస్తూ ఊరుకోదని, దీనిపై పోరాటం చేస్తుందన్నారు. రైతు రుణమాఫీపై వచ్చిన పిటిషన్‌లను వెంటనే పరిష్కరించి రుణమాఫీ సక్రమంగా అమలు చేయాలని డిమాండ్‌చేశారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి గుంటూరు విజయకుమార్ మాట్లాడుతూ జూన్ ఒకటిన చేపట్టిన భవన నిర్మాణ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలన్నారు.

సభకు సీపీఎం నాయకుడు ఎస్.ఆంజనేయనాయక్ అధ్యక్షత వహించారు.తొలుత పుతుంబాక చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న వెంకటపతి స్థూపం వద్ద గద్దె చలమయ్య పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు. సీపీఎం జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు అనంత పిచ్చయ్య, డివిజన్ కమిటీ సభ్యులు వంకాయలపాటి రాణి, గుంటుపల్లి బాలకృష్ణ, పి.సూర్యప్రకాష్‌రావు, గుంటూరు మల్లేశ్వరి, బి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement