రూల్స్ ఖరారు.. | Sakshi
Sakshi News home page

రూల్స్ ఖరారు..

Published Fri, Jan 2 2015 12:53 AM

crda bill rules released

* విమర్శల జడితో భూ సమీకరణ నిబంధనలపై అధికారుల హడావుడి
* రాజధానికి భూములు ఇచ్చే రైతులకు తక్షణమే అధికారిక రశీదు
* భూములు ఇవ్వని రైతుల వివరాలు సీఆర్‌డీఏ కమిషనర్‌కు నివేదిక
* భూ సమీకరణ పూర్తయ్యాక లాటరీ పద్ధతిలో రైతులకు ప్లాట్లు
* భూ అభివృద్ధి ప్రణాళికను బట్టి 5 కి.మీ. లోపునే రైతులకు ప్లాట్లు
* రైతులకు ప్లాట్లు ఇవ్వగా మిగిలిన భూమి మొత్తం సీఆర్‌డీఏకే
* తుది నోటిఫికేషన్ తర్వాత మూడేళ్లలో సదుపాయాల కల్పన
* భూములు లేని కుటుంబాలకు పదేళ్ల పాటు నెలకు రూ. 2,500
* గ్రామాల్లో రైతులకు ప్రభుత్వం నివాస అర్హతా పత్రాలు ఇస్తుంది
* నిబంధనలు లేకుండానే భూసమీకరణకు వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆగమేఘాలపై నిబంధనలతో సర్కారు జీవో జారీ

ఒక్కసారి ఒప్పందం చేసుకుంటే...
భూ సమీకరణకు ఒక్కసారి సమ్మతి పత్రాలు ఇస్తే సమీప భవిష్యత్తులో ఇక ఎలాంటి అదనపు పరిహారం కోరేందుకు రైతులకు వీలులేకుండా నిబంధనలు విధించారు.  భూములు కోల్పోయిన రైతులు నిరసనలకు దిగడం, కోర్టులకు వెళ్లడం చేయరాదు. భూములపై ఏవైనా బకాయిలు ఉంటే పరిహారంలో ఆ మొత్తాన్ని మినహాయించుకుని మిగతా సొమ్మును మాత్రమే రైతులకు ప్రభుత్వం ఇస్తుంది. భూములిచ్చే రైతులు ఆస్తి పన్ను చెల్లింపు రశీదులతో సహా యాజమాన్య ధ్రువీకరణ పత్రాలన్నీ (ఒరిజినల్)
ప్రభుత్వానికి సమర్పించాలి. భూములిచ్చే రైతులు వాటిపై వివాదాలు, లోపాలు ఉంటే వారే బాధ్యత వహించాలి.

సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) ద్వారా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను సమీకరించడంలో అనుసరించాల్సిన నిబంధనలను వెల్లడిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం భూ సమీకరణ పథకం (రూపకల్పన, అమలు) నిబంధనలు 2015’ పేరుతో ఈ ఉత్తర్వులిచ్చారు. నిజానికి శుక్రవారం జరిగే మంత్రిమండలి సమావేశంలో చర్చించి నిర్ణయించాలని భావించినప్పటికీ విధివిధానాలు ఖరారు కాకుండానే భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తడంతో గురువారం నాడు ఆగమేఘాలపై ఈ ఉత్తర్వులను జారీ చేశారు.

ఇందులో రైతులకు ఇచ్చే పరిహారం, ఎన్ని రోజుల్లో చెలించాలి, మెట్ట, జరీబు, అసైన్డ్ భూములకు ఎంత చెల్లించాలి అనే వివరాలు పొందుపరిచారు. రాజధాని ప్రాంతంలో రోడ్లు, ఉద్యానవనాలు, బలహీన వర్గాలకు ఎంత మేరకు స్థలాలు కేటాయించిందీ సూచించారు. భూసమీకరణకు తుది నోటిఫికేషన్ ఇవ్వడం, రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణ తదితర విషయాలు వెల్లడించారు. భూసమీకరణకు అంగీకరించని యజమానుల వివరాలు సేకరించి సీఆర్‌డీఏ కమిషనర్‌కు నివేదిక రూపంలో ఇవ్వాలని నిబంధనల్లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన 180 రోజుల్లోగా భూ యజమానులతో సంప్రథించి ఏ విధానంలో భూ సమీకరణ చేస్తున్నారన్న విధానాన్ని ప్రకటించాలి. గతంలో ప్రకటించినట్టే మెట్ట, జరీబు, అసైన్డ్ భూములకు నివాస, వాణిజ్య స్థలాలను ఎంతమేరకు ఇవ్వాలి, పరిహారం ఎంత ఇవ్వాలనేది నిబంధనల్లో స్పష్టం చేశారు.

ఉత్తర్వులు, నిబంధనల్లోని ముఖ్యాంశాలివీ...
* భూసేకరణ చేస్తే వాస్తవ ధర కంటే తక్కువ పరిహారం వస్తుందని రైతులు అసంతృప్తి వ్యక్తంచేయడంతో... రాజధాని అభివృద్ధిలో నిర్వాసితులనూ భాగస్వాములను చేయడానికి భూ సమీకరణ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

* భూములు లేని కుటుంబాలకు నెలకు రూ. 2,500 చొప్పున పది సంవత్సరాల పాటు ఇవ్వాలి.
* భూ సేకరణ పథకం కింద తీసుకున్న భూమి వినియోగం తీరు.. రాజధాని అవసరాలకు అనుగుణంగా రూపొందనున్న మాస్టర్ ప్లాన్‌లో ఉన్న విధంగా ఆటోమేటిక్‌గా మారుతుంది.

* సేకరించిన భూములను విభజించి లేదా కలిపి.. అవసరాలకు అనుగుణంగా మార్చి అభివృద్ధి చేసుకొనే హక్కు సీఆర్‌డీఏకు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రహదారులను వాడుకోవడానికి వీలుగా సేకరించిన భూమిని అవిచ్ఛిన్న భాగాలుగా మారుస్తారు.
 
* మౌలిక సదుపాయాల కల్పన, ఇతర సౌకర్యాల కల్పనకు, భూ సమీకరణ పథకానికి అయ్యే వ్యయం సీఆర్‌డీఏ చట్టంలో పేర్కొన్న 44-47 సెక్షన్ల ఆధారంగా ఉంటుంది.

* భూ సమీకరణ ప్రక్రియను పూర్తిగా లేదా పాక్షికంగా సీఆర్‌డీఏ స్వయంగా చేపట్టనుంది. ప్రభుత్వం నియమించిన అధికారులు, స్థానిక సంస్థలకు కూడా భూ సేకరణ బాధ్యత అప్పగించడానికి అవకాశం ఉంది.

* భూ సమీకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన 15 రోజుల్లోగా భూమిని ఎందుకోసం వినియోగిస్తున్నామనే విషయాన్ని పేర్కొంటూ బహిరంగ ప్రకటన విడుదల చేయాలి. భూ యజమానుల నుంచి అభ్యంతరాలు, సలహాలను 15 రోజుల్లో స్వీకరిస్తారు. నోటిఫికేషన్ వెలువడిన 7 రోజుల తర్వాతే భూ యజమానులతో సంప్రతింపులు ఆరంభించాలి.

* భూ సమీకరణ పథకం అసలు లక్ష్యం, పథకం అమలు, సీఆర్‌డీఏ పాత్ర, దాని బాధ్యతలు, భూమి సర్వే నంబర్లు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలు.. సమగ్ర వివరాలు నోటిఫికేషన్‌లో ఉండాలి. భూ యజమానులకు ఇవ్వనున్న ప్యాకేజీలు, పరిహారం, భూములు లేని కుటుంబాలకు కల్పించనున్న లబ్ధి.. తదితర వివరాలనూ పేర్కొనాలి. జిల్లా గెజిట్, రెండు ప్రముఖ దినపత్రికల్లో (కనీసం ఒక తెలుగు పత్రికలో) ప్రచురించడంతో పాటు గ్రామ పంచాయతీ మొదలు కలెక్టర్ కార్యాలయం వరకు అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో నోటిఫికేషన్ ప్రముఖంగా కనిపించే విధంగా ఏర్పాటు చేయాలి. వెబ్‌సైట్‌లోనూ పెట్టాలి.

* అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన తర్వాత 15 రోజుల్లో తుది నోటిఫికేషన్ జారీ చేయాలి. భూ యాజమాన్యానికి సంబంధించిన అభ్యంతరాలపై 30 రోజుల్లో పరిశీలన జరిపి తుది నిర్ణయం తీసుకోవాలి.

* భూ సమీకరణలో పాల్గొనడానికి సమ్మతించిన రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవడంతో పాటు వారికి అధికారికంగా సీఆర్‌డీఏ రసీదులు ఇస్తుంది.

* భూ సమీకరణకు నిరాకరించిన రైతులు, భూముల జాబితాను అధికారులు సేకరించి పూర్తి వివరాలతో సీఆర్‌డీఏ కమిషనర్‌కు నివేదిక ఇవ్వాలి.

* భూ యాజమాన్య హక్కులను పరిశీలించి నిర్ధారించిన తర్వాత ఆయా భూముల యజమానులతో సదరు భూమి సరిహద్దులు మార్చకుండా, ఇతర మార్పులు చేయకుండా సీఆర్‌డీఏ ఒప్పందం చేసుకుంటుంది.

* యాజమాన్య హక్కుల విషయంలో అపరిష్కృతంగా ఉన్న కేసులను సంబంధిత కోర్టుకు నివేదించి, భూ సమీకరణ పరిధి నుంచి మినహాయింపు రాకుండా సీఆర్‌డీఏ చర్యలు తీసుకుంటుంది.  భూ సమీకరణ లక్ష్యాన్ని ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన 180 రోజుల్లోగా భూ యజమానులతో సంప్రదించి భూ సమీకరణ పథకం ముసాయిదాను రూపొందించాలి. భూ సేకరణ చట్టం 2013 కింద సేకరించే భూముల వివరాలనూ ముసాయిదాలో చేర్చాలి.

* సమీకరించిన మొత్తం భూమిని సెక్టార్లుగా విభజించడం, వివిధ అవసరాలకు రిజర్వు చేయడం జరుగుతుంది.
* తుది నోటిఫికేషన్ జారీ చేసిన 60 రోజుల్లోగా రహదారుల నమూనాను ప్రకటించి, రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను గుర్తించాలి. భూ అభివృద్ధి ప్రణాళికను బట్టి 5 కిలోమీటర్ల పరిధిలోనే రైతులకు ప్లాట్లను కేటాయించాలి.

* ప్లాట్ల గుర్తింపు పూర్తయిన 30 రోజుల్లోగా లాటరీ పద్ధతిలో రైతులకు కేటాయించాలి. లాటరీ తీసే ప్రక్రియను వీడియో తీయాలి. కనీసం మూడో వంతు రైతులు లాటరీ ప్రక్రియను నేరుగా పరిశీలించాలి.

* లాటరీ తీసిన 30 రోజుల్లోగా యాజమాన్య ధ్రువీకరణ పత్రాలను రైతులకు అందజేయాలి. భూ అభివృద్ధి రుసుము, రిజిస్ట్రేషన్ల ఖర్చను రైతుల నుంచి తీసుకోకూడదు. రైతులకు ఇవ్వగా మిగిలిన మొత్తం భూమి సీఆర్‌డీఏకు చెందుతుంది. అందులో పార్కులు, ఆటస్థలాలు, చౌక గృహ నిర్మాణం, రోడ్లతో పాటు సామాజిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి.

* తుది నోటిఫికేషన్ వెలువరించిన ఏడాదిలోగా మౌలిక వసుతులైన రోడ్లు, ప్లాట్ల పూర్తిస్థాయి విభజన పనులు పూర్తి చేయాలి. వెంటనే రైతులకు వారికి కేటాయించిన ప్లాట్లను స్వాధీనపరచాలి.

* తుది నోటిఫికేషన్ ఇచ్చిన మూడేళ్లలోగా దశల వారీగా మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించాలి.

* అభివృద్ధి పనులు పూర్తయినట్లు సీఆర్‌డీఏ ప్రకటించిన తర్వాత.. ప్రభుత్వం విధించే అన్ని రకాల పౌర సేవలు, ఇతర వసతుల కల్పన రుసుములను ప్లాట్ల యజమానులే భరించాల్సి ఉంటుంది.

* గ్రామాల్లో రైతులకు నివాస అర్హతా పత్రాలను ప్రభుత్వం ఇవ్వనుంది. తద్వారా ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు అవకాశం ఉంటుంది. అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఇళ్లు కోల్పోతే, వారికి పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. రూ. 25 లక్షల వరకు పేదలకు స్వయం ఉపాధి కల్పనకు వడ్డీలేని రుణాలు అందించనుంది.

* పార్కులు, ఆటస్థలాలు, ఉద్యానవనాలకు 10 శాతం, రహదారులకు 30 శాతం, సామాజిక అవసరాలకు 5 శాతం, పేదలకు చౌకగా గృహాలు నిర్మించడానికి 5 శాతం భూమిని వినియోగించనున్నారు.

* ప్రతి వెయ్యి ఎకరాల సేకరణను ఒక డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో అధికార బృందం పర్యవేక్షిస్తుంది.

Advertisement
Advertisement