‘సీఆర్‌డీఏ’లో లేఅవుట్లకు గ్రీన్‌సిగ్నల్ | Sakshi
Sakshi News home page

‘సీఆర్‌డీఏ’లో లేఅవుట్లకు గ్రీన్‌సిగ్నల్

Published Mon, Jan 12 2015 1:24 AM

‘సీఆర్‌డీఏ’లో లేఅవుట్లకు గ్రీన్‌సిగ్నల్

  • గుట్టుచప్పుడు కాకుండా 130 అనుమతులు
  • మంత్రి నారాయణ ఆదేశంతో పరుగులు పెడుతున్న ఫైళ్లు
  • సాక్షి, విజయవాడ బ్యూరో: మూడు నెలల కిందట నిలిచిపోయిన లేఅవుట్లు, భవన నిర్మాణాలకు సీఆర్‌డీఏ వాయువేగంతో అనుమతులు మంజూరు చేస్తోంది. మరిన్ని ఫైళ్లు పరుగులు పెడుతున్నాయి. రాజధాని ప్రాంతాన్ని మినహాయించి మిగిలిన సీఆర్‌డీఏ పరిధిలోని లేఅవుట్లు, నిర్మాణాలకు అనుమతులివ్వాలని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ నాలుగురోజుల కిందట మౌఖిక ఆదేశాలిచ్చారు.

    ఆందోళనలు, ఉద్యమాల వల్ల పని జరగదనే వాస్తవాన్ని గ్రహించిన కొందరు రియల్ పెద్దలు ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే టీడీపీ ముఖ్య నాయకుడి అనుగ్రహం సంపాదించారు. ఆయన ఈ సాయం ఉచితంగా చేసిపెట్టారా? లేక చేతుల మార్పిడి వ్యవహారం ఏమైనా జరిగిందా అనేది తెలియక పోయినప్పటికీ ఏదో జరిగిందని మాత్రం అధికారవర్గాలు ఘంటాపథంగా ఆఫ్‌ది రికార్డ్ వ్యాఖ్యలు చేస్తున్నాయి.
     
    జూన్‌లో అనుమతులు నిలిపివేత

    రాజధాని భూసమీకరణకు ఇబ్బంది కలగకూడదనే కారణంతో గత సంవత్సరం సెప్టెంబర్‌లో అప్పటి వీజీటీఎం ఉడా పరిధిలో కొత్త లేఅవుట్లు, గ్రూపు భవనాలకు అనుమతి ఇవ్వడాన్ని ప్రభుత్వం నిలిపేసింది. పట్టపగ్గాలు లేకుండా దూసుకెళుతున్న రియల్ వ్యాపారానికి కళ్లెం వేసే ఆలోచన కూడా అనుమతులు నిలిపేయడానికి మరో కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది. ప్రభుత్వ నిర్ణయంతో రియల్ వ్యాపారం ఒక్కసారిగా కుదేలైంది.

    లేఅవుట్లకు అనుమతి రాకపోవడంతో రియల్ వ్యాపారులు అప్పటికే వేసిన వెంచర్ల అమ్మకాలు నిలిచిపోయాయి. కొత్త వెంచర్లకు అవకాశం లేకుండాపోయింది. నిర్మాణాలకు అనుమతులు నిలిచిపోవడంతో అపార్టుమెంట్లు, గ్రూప్ భవనాల పరిస్థితి కూడా అలాగే మారింది. ప్రభుత్వం అనుమతులు నిలిపేసే నాటికి గత సంవత్సరం జూన్‌కు ముందు స్వీకరించిన లేఅవుట్ల నిర్మాణాలకు సంబంధించిన ఫైళ్లను ఉడా పరిశీలిస్తోంది.  
     
    కొత్త మార్గదర్శకాలు లేకుండానే..

    సీఆర్‌డీఏ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందిస్తుందని, అప్పటివరకు అనుమతులు ఉండవని అధికారులు చెబుతూ వచ్చారు. దీంతో రాజధాని మాస్టర్‌ప్లాన్ వచ్చేవరకు అనుమతులు ఇవ్వరనే ప్రచారం జరిగింది. మాస్టర్‌ప్లాన్ వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణానికి అనుగుణంగా రోడ్ల వెడల్పు, కామన్ సైట్లు వంటి నిబంధనలు మారతాయని అందరూ భావిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో నాలుగు రోజుల కిందట మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయానికి వచ్చినప్పుడు లేఅవుట్లు, నిర్మాణాల ఫైళ్లను క్లియర్ చేయాలని, కొత్త వాటికి అనుమతివ్వాలని మౌఖికంగా ఆదేశించారు. దీంతో సీఆర్‌డీఏ ప్లానింగ్ విభాగం అధికారులు ఫైళ్ల దుమ్ము దులిపి ఆగమేఘాల మీద వాటిని క్లియర్ చేయడం ప్రారంభించింది. నాలుగు రోజుల్లోనే లేఅవుట్లు, నిర్మాణాలు, భూమార్పిడికి సంబంధించిన 130కి పైగా ఫైళ్లను క్లియర్ చేశారు. మిగిలిన ఫైళ్లను పండుగ తర్వాత క్లియర్ చేయనున్నారు.

    అనుమతులు నిలిపేసే సమయంలో ఆ విషయం గురించి ప్రచారం చేసిన ప్రభుత్వం వాటిని పునరుద్ధరించిన విషయాన్ని పెద్దగా ప్రాధాన్యత లేని అంశంగా చూడడం విశేషం. ఇటీవల టీడీపీ నేత నగరానికి వచ్చినప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ముఖ్యమైన రియల్ వ్యాపారులు ఆయనతో సమావేశమైనట్లు తెలిసింది. ఈ సమావేశంలోనే వారిమధ్య ఒక అంగీకారం కుదిరిందని, ఆ మేరకే మాస్టర్‌ప్లాన్, నిబంధనల గురించి కనీసం ఆలోచించకుండా లేఅవుట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement