మకీ సంచలన వ్యాఖ్యలు, సీఆర్‌డీఏ నోటీసులు | Sakshi
Sakshi News home page

మకీ సంచలన వ్యాఖ్యలు, సీఆర్‌డీఏ నోటీసులు

Published Mon, May 1 2017 7:40 PM

మకీ సంచలన వ్యాఖ్యలు, సీఆర్‌డీఏ నోటీసులు

అమరావతి : ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలించారంటూ జపాన్‌ కంపెనీ ‘మకీ అసోసియేట్స్‌’కు సీఆర్‌డీఏ లీగల్‌ నోటీసులు జారీ చేసింది. ఆర్కిటెక్చరల్‌ డైజెస్ట్‌ మ్యాగజైన్‌ వ్యాసంలో మకీ చైర్మన్‌ ఫుమిహికో  సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్‌ కంటే ఆంధ్రప్రదేశ్‌లో చెత్తపాలన ఉందని అన్నారు. ప్రతి విషయంలో రాజకీయ జోక్యం ఉంటుందని, సీఆర్‌డీఏను స్వతంత్రంగా పని చేయనివ్వరు అని ఆయన వ్యాఖ్యానించారు.

లోపాయికారి ఒప్పందం ప్రకారమే అంతా జరుగుతుందని ఫుమిహికో పేర్కొన్నారు. అయితే ఏపీ ప్రభుత్వంతో పాటు సీఆర్‌డీఏ ప్రతిష్టకు, పరువుకు భంగం కలిగించేలా వివిధ వెబ్‌సైట్ల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపిస్తూ  మకీ అసోసియేట్స్‌ తో పాటు ఆ సంస్థ చైర్మన్‌ ఫుమిహికో మకీ కి సీఆర్‌డీఏ వేర్వేర్వుగా నోటీసులు ఇచ్చింది.

కాగా రాజధాని అమరావతి నిర్మాణంలో పారదర్శకత లేశ మాత్రం కూడా లేదంటూ అప్పట్లో ‘డిజైన్‌’ కాంట్రాక్టు దక్కించుకున్న జపాన్‌ సంస్థ ‘మకీ అండ్‌ అసోసియేట్స్‌’ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. భారతీయ వాస్తు శిల్పి శాస్త్ర నిపుణుల (ఇండియన్‌ ఆర్కిటెక్చురల్‌ ప్రొఫెషన్‌) ప్రతిష్టను ఏపీ ప్రభుత్వం పణంగా పెట్టిందని మండిపడింది. అంతర్జాతీయ టెండర్‌లో పాల్గొని కాంట్రాక్టు దక్కించుకున్న తమను అనైతికంగా తప్పించారని, ప్రభుత్వ పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసం, వారికి కావాల్సిన సంస్థను ఎంపిక చేసుకోవడానికి తమ సంస్థకు దక్కిన కాంట్రాక్టును రద్దు చేశారని ఆ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.

ఏపీ సర్కార్‌ వ్యవహరించిన తీరుతో భారతదేశంలో పనిచేసేందుకు అంతర్జాతీయ ఆర్కిటెక్టులు ఎవరూ సాహసం చేయలేరంటూ ‘మకీ అండ్‌ అసోసియేట్స్‌’ ప్రిన్సిపల్‌ ఆర్కిటెక్టర్‌ ఫుమిహికో మకీ 2016 డిసెంబర్‌ 21న భారత ఆర్కిటెక్చర్‌ సమాఖ్య ఉపాధ్యక్షుడు విజయ్‌ గర్గ్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement