ఈ ఏడాది నేరాలు అదుపులోనే.. | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది నేరాలు అదుపులోనే..

Published Wed, Dec 24 2014 2:43 AM

crime should be control in this year

ఒంగోలు క్రైం: ‘గత ఏడాది కంటే ఈ ఏడాది నేరాలు అదుపులోనే ఉన్నాయి.   రాష్ట్ర విభజన ఉద్యమాలు, వరుస ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాం. వచ్చే ఏడాది నేరాలు ఇంకా తగ్గుముఖం పట్టేందుకు సిబ్బందిని అప్రమత్తం చేశాం’ అని ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ అన్నారు.  ఈ ఏడాది జరిగిన నేరాలకు సంబంధించిన వివరాలను స్థానిక తన చాంబర్లో ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ విలేకర్లకు వివరించారు.

ఈ ఏడాది జరిగిన అన్ని రకాల నేరాల వివరాలను ఎస్పీ వెల్లడించారు. దొంగతనాలు, మహిళలపై లైంగికదాడులు, రోడ్డు ప్రమాదాలు గతేడాది కంటే అధికంగానే జరిగాయన్నారు. వాటి అదుపు కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకంగా రాష్ట్ర విభజన సందర్భంగా తలెత్తిన ఉద్యమాల విషయంలో పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఎలాంటి నష్టం జరగకుండా చూశారన్నారు.  వరుస ఎన్నికలను కూడా పోలీసులు విజయవంతంగా నిర్వహించగలిగారని చెప్పారు.

మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయటం ద్వారా మహిళలపై లైంగిక దాడులు, వరకట్న వేధింపుల కేసుల విషయంలో పరిష్కారాన్ని వేగవంతం చేయవచ్చన్నారు. అదే విధంగా ఒంగోలు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడానికి సిబ్బందిని ఎక్కువ మొత్తంలో కేటాయించడంతో పాటు డీఎస్పీ స్థాయి అధికారిని నియమించి ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. క్లూస్ టీంను బలంగా తయారు చేశామని, ఆ టీమ్‌కు కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేశామని చెప్పారు. రక్షక్ వాహనాలను ఏర్పాటు చేసి విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని నగరంలో విస్తృతపరిచినట్లు పేర్కొన్నారు.

సైబర్ నేరాలపై దృష్టి:
సైబర్ నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు. అందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సైబర్ టీమ్ ఇప్పటి వరకు ఫోన్లకు సంబంధించిన కాల్‌డీటైల్స్ తీయడానికి మాత్రమే పరిమితమయ్యారని, అలా కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నేరాలకు పాల్పడుతున్న వారిపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్థికపరమైన నేరాల అదుపుపై ఎస్సై స్థాయి నుంచి నిఘా ఉంచాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

జిల్లాకు ఫేస్‌బుక్ సౌకర్యాన్ని కల్పించామని, ప్రజలు నేరుగా పోలీస్‌స్టేషన్లకు వెళ్లకుండానే ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఆ ఫిర్యాదులపై సవివరమైన సమాచారాన్ని కూడా ఫిర్యాదుదారుడికి అందిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన విచారించేందుకు జిల్లాలో ఇద్దరు డీఎస్పీలను ఏర్పాటు చేశామని, వారికి సహాయంగా సిబ్బందిని కేటాయించామన్నారు.

అలాంటి కేసుల్లో బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఇళ్లలో దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు సంబంధించి సీసీఎస్ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. డీఎస్పీ స్థాయి అధికారిని ఇందుకోసం కేటాయించి నేరాల అదుపుపై పట్టు సాధించేందుకు చర్యలు చేపట్టామన్నారు.


వచ్చే ఏడాదికి ముందస్తు ప్రణాళిక:
2015 సంవత్సరానికిగాను ప్రత్యేకమైన ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు ఎస్పీ వివరించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు.  ప్రజలను మోసం చేసి చిట్టీలు, డిపాజిట్లు, అధిక వడ్డీలతో ప్రజలను దోచుకునే శక్తులపై దృష్టి సారించి  మోసపోకుండా చేయటంలో అవగాహన కల్పించేలా పోలీసులను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.    

పోలీసులకు సహకరించి నేరాల అదుపునకు దోహదపడాలని జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.  సమావేశంలో అదనపు ఎస్పీ బి.రామానాయక్, డీసీఆర్‌బీ డీఎస్పీ మరియదాస్, ఎస్‌బీ డీఎస్పీ రాయపాటి శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీలు కె.వి.రత్నం, ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, కందుకూరు డీఎస్పీ శంకర్, మార్కాపురం ఓఎస్‌డీ సి.సమైజాన్‌రావు, దర్శి డీఎస్పీ లక్ష్మినారాయణ, చీరాల డీఎస్పీ జయరామరాజు తదితరులున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement