క్రికెట్‌ బెట్టింగ్‌ జోరు | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బెట్టింగ్‌ జోరు

Published Tue, Apr 17 2018 7:51 AM

Crores Of rupees IPL Cricket Betting Happening In Rayachoti - Sakshi

రాయచోటి రూరల్‌  : మన దేశంలో యువత నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల వారిలో విపరీతమైన క్రేజ్‌ ఉన్న ఆట క్రికెట్‌. టి–20 మ్యాచులతో క్రికెట్‌కు మరింత క్రేజ్‌ పెరిగింది. దీనికి తోడు ఐపీఎల్‌ పేరుతో నిర్వహిస్తున్న అతి పెద్ద టి–20 క్రికెట్‌ టోర్నమెంట్‌కు ఆట పరంగా క్రేజ్‌తో పాటు బెట్టింగ్‌ పరంగా దేశ వ్యాప్తంగా విపరీతమైన మోజు పెరుగుతోంది. ఫోర్లు, సిక్సర్లతో ఐపీఎల్‌ జోరుగా కొనసాగుతుండటంతో, అంతే స్థాయిలో క్రికెట్‌బెట్టింగ్‌ కూడా సాగుతోంది. జిల్లా వ్యాప్తం గా ఎక్కడ చూసినా ఐపీఎల్‌ మాటే.

ప్రతి రోజు రెండు మ్యాచ్‌లు ఉండటంతో హోటళ్లు, ప్రధాన కూడలి ప్రాంతాలు, రెస్టారెంట్లు బుకీలకు వేదికగా మారాయి. అయితే జిల్లాలో ప్రొద్దుటూరు బెట్టింగ్‌లో మొదటి స్థానం సాధించగా, రాయచోటి రెండవ స్థానంలో ఉన్నట్లు పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వీటితో పాటు రాజంపేట, కడప, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో బెట్టింగ్‌కు పాల్పడే వారిలో ఎక్కువగా యువత, విద్యార్థులు ఉండటం విశేషం.

పలు రకాలుగా బెట్టింగ్‌లు.!
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో బుకీలు, బెట్టింగ్‌ రాయుళ్లు వివిధ రకాలుగా నిమిషాలలో వేలాది రూపాయలు చేతులు మారే విధంగా బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఫలా నా ఓవర్‌లో ఇంత స్కోరు వస్తుంది, ఫలానా ఓవర్‌లో అవుట్‌ అవుతారు, ఓవర్ల వారిగా ఫోర్లు, సిక్సర్లు వస్తాయంటూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. అలాగే మ్యాచ్‌ మొత్తానికి ఎవరు గెలుస్తారు, టాస్‌ వేయకముందే మొదటి ఫీల్డింగ్‌ చేసే వారో, లేక బ్యాటింగ్‌ చేసే వారో గెలుస్తారంటూ లక్షల్లో బెట్టింగులు జరుగుతున్నాయి. అలాగే ప్రధాన ఆట గాళ్ల ఆటతీరుపైన కూడా బెట్టింగ్‌లు జరుపుతున్నారు. ఏదీ ఏమైనా ఎక్కువ శాతం కమీషన్లు తీసుకుని బుకీలు బెట్టింగ్‌కు పాల్పడుతూ యువతలో క్రికెట్‌పై ఉన్న క్రేజ్‌ను సొమ్ము చేసుకుంటున్నారు. 

పోలీసుల వలలో చిక్కుతున్న చేపలు, తప్పించుకుంటున్న తిమింగళాలు 
ప్రతి రోజు ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు ఉండటంతో జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఆదేశాలతో బెట్టింగ్‌ రాయుళ్లపై , బుకీలపై , యువతపై పోలీసులు నిరంతరం నిఘా పెట్టారు.  ఇప్పటికే ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభం కాకముందు నుంచి గతంలో బెట్టింగ్‌కు పాల్పడిన వారిని, కేసుల్లో ఉన్న వారిని పోలీస్‌ స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయితే కొత్తగా తయారైన బుకీలు, బెట్టింగ్‌ రాయుళ్లు పోలీసుల నిఘాను ఏమార్చేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడి నుంచి ఇక్కడి వారితో బెట్టింగ్‌లు కట్టించే విధంగా ముందుకు సాగుతున్నారు. దీంతో పోలీసులు మరింత చాకచక్యంగా ప్రవర్తించినప్పటికీ పోలీసులు వేస్తున్న వలలో చిన్నపాటి బెట్టింగ్‌లకు పాల్పడుతున్న చేపలే చిక్కుతున్నాయి కానీ , పెద్ద పెద్ద తిమింగళాలు మాత్రం తప్పించుకుంటున్నాయని రాయచోటి పట్టణంలోనూ, ఇతర ప్రాంతాల్లో కూడా విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి.

రూ.100 కోట్లు బెట్టింగ్‌ జరిగే అవకాశం.!
జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాలు,  మండల , గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెయ్యి రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా బెట్టింగ్‌ జరుగుతోంది. ఐపీఎల్‌ జరిగే నెల రోజులకు పైగా ప్రతి రోజు రూ.2 కోట్లు–2.5 కోట్ల నుంచి మొత్తం 100కోట్ల రూపాయల వరకు బెట్టింగ్‌ల రూపంలో చే తులు మారే అవకాశం ఉన్నట్లు కొం దరు బుకీలు, ప్రధాన బెట్టింగ్‌ రాయు ళ్లు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

బెట్టింగ్‌లపై 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వండి: 
అట్టాడ బాబూజీ, ఎస్పీ
యువత చెడుమార్గంలోనకి వెళ్లకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. పోలీసు శాఖ నుంచి మేము కూడా అవగాహన కల్పించే విధంగా కృషి చేస్తున్నాం. షార్ట్‌ ఫిల్మ్‌ తీసి దాని ద్వారా అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తున్నాం. బెట్టింగ్‌ను నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యత . బెట్టింగ్‌ నివారణకు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో అనుమానాలు ఉన్న వారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌ ఇస్తున్నాము. బెట్టింగ్‌ వల్ల చాలా వరకు కుటుంబాలు నాశనం అయ్యే పరిస్థితి ఉంది. బెట్టింగ్‌పైన ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే ఆయా పోలీసు స్టేషన్లలో కానీ, 100 నంబర్‌కు ఫోన్‌ చేసి తెలియజేయాలి.

Advertisement
Advertisement