అతడు.. బా(ద్)షా! | Sakshi
Sakshi News home page

అతడు.. బా(ద్)షా!

Published Sun, Dec 15 2013 3:31 PM

అతడు.. బా(ద్)షా! - Sakshi

కడప: మాసిన దుస్తులు, అరిగిన చెప్పులు.. తలపై టోపీ, వెంటొక స్కూటీ.. చుట్టూ సమోసా బ్యాగులు.
అతడు.. సగటు మనిషి, సమోసా వ్యాపారి.
వడలిన దేహం, వదలని దరిద్రం.. ఆకలి పేగులు, చాచిన చేతులు.. చుట్టూ జాలి లేని సమాజం.
వారు.. అయినవారు లేని అనాథలు, దిక్కులేని పక్షులు.
అతడు.. వారి కోసం రోజూ వస్తాడు. సమోసాలతో పాటు వారి ఆశలను మోసుకొస్తాడు.

అతడు.. సయ్యద్‌బాషా. కడప నగరంలోని రవీంద్రనగర్‌కు చెందిన చిరువ్యాపారి. మూడేళ్లుగా సమోసాలు తయారు చేసి పలు షాపులకు అమ్ముకుంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాలు తిరిగి సరుకు ఇస్తుంటాడు. తద్వారా వచ్చే అరకొర ఆదాయంతోనే ఆనందంగా బతుకుతున్నాడు. రెండేళ్ల క్రితం.. ఓసారి పూర్తిస్థాయిలో సమోసాలు అయిపోలేదు. మరుసటి రోజుకు అవి చెడిపోతాయి. ఆకలి విలువ తెలిసినవాడు కనుక వాటిని వృధా చేయలేదు. అన్నార్తులకు ఇచ్చాడు. ఆబగా అందుకుని తిన్న వారి కళ్లలో కొత్త వెలుగు కన్పించింది. ఆ వెలుగులో బాషా ఆత్మసంతృప్తి వెతుక్కున్నాడు.

వ్యాపారంలో వచ్చే లాభం కంటే.. తోటి మనుషులకు చేసే సాయమే ఎక్కువ సంతోషాన్నిస్తుందని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి కడపలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకునే వృద్ధులకు ప్రతిరోజు రాత్రి 200 సమోసాలను ఇస్తూ వస్తున్నాడు. పేదవారికి సాయం చేయడానికి పెద్దమనుషులే కానక్కర్లేదని నిరూపిస్తున్నాడు. మానవత్వముంటే చాలునని చాటుతున్నాడు. పిడికెడు మెతుకులకు తపస్సు చేసే వారి కోసం తమస్సులో సైతం తపిస్తున్నాడు. అందుకే అతడు.. మనసున్న బాద్‌షా!  

Advertisement

తప్పక చదవండి

Advertisement