కాకినాడకు 1054 కి.మీ దూరంలో లెహర్ | Sakshi
Sakshi News home page

కాకినాడకు 1054 కి.మీ దూరంలో లెహర్

Published Tue, Nov 26 2013 9:04 AM

కాకినాడకు 1054 కి.మీ దూరంలో లెహర్

విశాఖ : బంగాళాఖాతంలో ఏర్పడిన లెహర్  పెను తుపానుగా దూసుకొస్తోంది. ఈ తుపాను కాకినాడకు 1054 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయినట్లు విశాఖలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది.  మచిలీపట్నం, కళింగపట్నంతో పాటు కాకినాడకు సమీపంలో గురువారం మధ్యాహ్నానికి  (28వ తేదీకి ) అది తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. 

ఆ సమయంలో గంటకు 170-180 కి.మీ. వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదముందని తెలిపారు.  దీని ప్రభావంతో మంగళవారం ఉత్తర కోస్తాంధ్రలో చాలాచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని  చెబుతున్నారు. ఒకట్రెండు చోట్ల పెను విధ్వంసకర పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని ఆంధ్రా యూనివర్సిటీలోని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

మరోవైపు లెహర్ తుపాను కారణంగా ఈనెల 28న జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలతో పాటు అన్ని విద్యాసంస్థలకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ సెలవు ప్రకటించారు. లెహర్ కారణంగా పది జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు జిల్లాకు చేరుకోనున్నాయి. మరోవైపు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కలెక్టర్ సూచించారు.

Advertisement
Advertisement