అర్హులకే దీపం సిలిండర్లు ఇవ్వాలి | Sakshi
Sakshi News home page

అర్హులకే దీపం సిలిండర్లు ఇవ్వాలి

Published Fri, Sep 20 2013 3:56 AM

cylinders should provide only those who are names mentioned in the record

ఉప్పునుంతల, న్యూస్‌లైన్: దీపం పథకం కింద మంజూరైన సిలిండర్లను అర్హులకే మాత్రమే ఇవ్వాలని టీఆర్‌ఎస్, టీడీపీ నేతలు డిమాండ్‌చేశారు. గురువారం వారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. అక్కడే సహపంక్తి భోజనాలు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నేతలు కట్టా గోపాల్‌రెడ్డి, బాలయ్యలు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలుచేసి అర్హులకు లబ్ధి చేకూరేలా చూడాల్సిన అధికారులు కేవలం అధికార పార్టీ నాయకులకు తలొగ్గి పనిచేస్తున్నారని విమర్శించారు. ఎంపీడీఓ దేవన్న కాంగ్రెస్ నాయకులు సూచించిన వారినే లబ్ధిదారులుగా ఎంపికచేశారని ఆరోపించారు. మంజూరైన 700  సిలిండర్లను లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్‌చేశారు.
 
 సిలిండర్లు కేటాయింపు విషయంలో కొందరు సర్పంచ్‌లకు తెలుపకుండా దొంగచాటుగా లబ్ధిదారుల జాబితాను తయారుచేసి మంత్రుల ద్వారా సిఫారసు చేస్తున్నారని మండిపడ్డారు. అర్హులకు అందించేలా చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారి నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు తాము ఆందోళన విరమించబోమని భీష్మించుకూర్చున్నారు.
 
 ఎంపీడీఓ దేవన్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న సమావేశానికి వెళ్లగా ఈఓపీఆర్‌డీ, జూనియర్ అసిస్టెంట్, ఈజీఎస్ సిబ్బంది చేసేదిలేక బయటనే ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు యాదమ్మ, లక్ష్మమ్మ,రంగారెడ్డి, జంగయ్యలు, నాయకులు జంగిరెడ్డి, లింగమయ్య, భూసిరెడ్డి, రవీందర్‌రావు, రాజేందర్‌రెడ్డి, వసూరాంనాయక్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement