దాబారులు | Sakshi
Sakshi News home page

దాబారులు

Published Mon, Dec 9 2013 5:00 AM

dabas and alcohol stores along with the Asian Highway

 నెల్లూరు సిటీ,న్యూస్‌లైన్ :  దాబాలు బార్లను తలపిస్తున్నాయి. హైవే వెంబడి ఉండే మద్యం దుకాణాల్లో మద్యం తాగడం నిషేధం. అయితే ఇం దుకు విరుద్ధంగా దుకాణదారులు ప్రత్యేకంగా  గదులూ ఏర్పాటు చేసి మద్యం తాగడానికి అనుమతిస్తున్నారు. అర్ధరాత్రి అత్యవసర పని మీద రోడ్డు మీదకు వచ్చిన వ్యక్తికి గుక్కెడు తాగునీరు,సేద తీరేందుకు కాసింత తేనీరు దొరికే పరిస్థితి లేదు. అదే సమయంలో మద్యం కావాల్సినంత దొరుకుతుందంటే పరిస్థి తి అర్థం చేసుకోవచ్చు. ఏషియన్ హైవే వెంబడి ప్రతి ఏటా దాబాల సంఖ్య పెరుగుతూ వస్తోంది.   
 మద్యం మత్తులో ప్రమాదాలు..
 దాబాల్లో మద్యం అందుబాటులో ఉండటంతో సమీప ప్రాంతాల మందుబాబులే కాకుండా వాహనచోదకులు విచ్చలవిడిగా మద్యం తాగుతున్నారు. బాగా పొద్దుపోయే వరకు మద్యం తాగి ఇంటికి తిరిగి వెళ్లే సమయాల్లో ప్రమాదాలకు గురవుతున్నారు. జిల్లాలో గడచిన మూడేళ్లలో హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 520 మంది మృత్యువాత పడగా, 2 వేల మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ప్రమాదాల్లో మృతి చెందిన వారిలో ఎక్కువ  మంది మద్యం తాగి ప్రమాదాల బారిన పడిన వారేనని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మద్యం మత్తులో యువత ఘర్షణలకు పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలున్నాయి. దాబాల నిర్వాహకులే ఇరు వర్గాలకు సర్ది చెప్పి రాజీ చేస్తున్నారు.

ఇలాంటి సంఘటనలు అధిక శాతం పోలీసు రికార్డులకెక్కడం లేదు. కొన్ని సందర్భాల్లో హత్యలు కూడా జరిగాయి. రాత్రి 10 గంటలు దాటితే దుకాణాలు మూసివేయాలని హడావుడి చేసే పోలీసులు హైవే వెంబడి ఉండే మద్యం దుకాణాలు, దాబాలపై కనీసం కన్నెత్తైనా చూడడం లేదు. ఆ వ్యాపారులతో కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు హైవేపై దాబాల్లో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లాలో పోలీసులు  దాబాలపై దాడులు చేసి కేసులు నమోదు చేశారు. రెండు రోజుల పాటు హడావుడి చేసిన పోలీసులు ఆ తర్వాత పట్టించుకోవడం మానివేశారు. పోలీసుల హడావుడి తగ్గేంత వరకు దాబాల్లో మద్యం విక్రయాలకు బ్రేక్ పడింది. కొద్ది రోజులుగా మళ్లీ మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి.
 నిర్వాహకులపై చర్యలు నిల్
 దాబాల్లో మద్యం విక్రయించకూడదు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యం విక్రయాలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే వీరు దాబా ల వైపు దృష్టి సారించడం లేదు. అడపాదడపా దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నా రు. దీంతో దాబాల నిర్వాహకులు విచ్చలవిడిగా వ్యాపారాలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పీవీఎస్ రామకృష్ణ దాబాల్లో మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోండి.. లేదంటే మీపై చర్యలు తప్పవు అంటూ పదే పదే సిబ్బందిని హెచ్చరిస్తున్నారు. ఒకటి రెండు రోజులు హడావుడి చేసిన పోలీసులు ఆ తర్వాత చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీని వెనక మామూళ్ల మత్తేనన్న ఆరోపణలు ఉన్నాయి.

Advertisement
Advertisement