డబ్బులిచ్చేయ్.. బిట్లు కొట్టేయ్.. | Sakshi
Sakshi News home page

డబ్బులిచ్చేయ్.. బిట్లు కొట్టేయ్..

Published Sun, Mar 16 2014 5:18 AM

డబ్బులిచ్చేయ్.. బిట్లు కొట్టేయ్..

  •      ఇంటర్ పరీక్షల్లో యథేచ్ఛగా కాపీయింగ్
  •      డబ్బులు తీసుకొని జవాబు బిట్లు అందిస్తున్న వైనం
  •  చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: చిత్తూరు నగరంలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షల్లో కాపీయింగ్ యథేచ్ఛగా సాగుతోంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణ సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 12న ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. చిత్తూరులోని 14 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. వీటిలో 8 ప్రయివేటు పరీక్ష కేంద్రాలు. మిగిలినవి ప్రభుత్వ కళాశాలలు.

    రెండు, మూడు ప్రయివేటు కేంద్రాలు తప్పిస్తే మిగిలిన చోట్లంతా కాపీయింగ్ జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. పరీక్ష ప్రారంభమైన 15 నిమిషాలకే ప్రశ్నపత్రం బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. తర్వాత జవాబులను మైక్రో జెరాక్స్ చేయించి విద్యార్థులకు ఇస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.1000 నుంచి రూ.1500 వసూలు చేస్తున్నట్లు సమాచారం. పరీక్ష ప్రారంభమైన తర్వాత పరిసర ప్రాంతాల్లో విద్యార్థి తాలూకు వాళ్లు ఎవరూ ఉండకూడదనే నిబంధన ఉంది.

    ఇందుకు విరుద్ధంగా పలువురు పరీక్ష కేంద్రంలోకి వెళ్లి పని చక్కపెట్టుకుని వస్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో పనిచేస్తున్న క్లర్క్‌లే ఈ తతంగాన్ని చేస్తున్నట్లు తెలిసింది. గిరింపేటలోని ఓ ప్రభుత్వ కళాశాలలో ప్రయివేటు వ్యక్తిని నియమించుకుని మరీ విద్యార్థులకు బిట్లు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
     
    కుమ్మక్కైన కళాశాలలు
     
    తమ విద్యార్థులను పాస్ చేయించేందుకు, అధిక మార్కులు తెప్పించుకునేందుకు నగరంలోని కొన్ని కళాశాలలు కుమ్మక్కైనట్లు తెలిసింది. మీ పరీక్ష కేంద్రంలోని మా విద్యార్థులకు సహకరించండి, మా పరీక్ష కేంద్రంలోని మీ విద్యార్థులకు సహకరిస్తాం అనే అవగాహనతో ముందుకెళుతున్నట్లు సమాచారం. క్లర్కులు విద్యార్థులకు బిట్లు ఇచ్చి వసూలు చేసిన డబ్బుల్లో ఇన్విజిలేటర్లకు భాగం ఇస్తున్నట్లు తెలిసింది.
     
    అధికారులకు తెలిసే..

     ఇంటర్‌బోర్డు అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతోం దని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పూతలపట్టులో కాపీయింగ్‌కు అనుమతించమని ఓ ఇన్విజిలేటర్‌ను ప్రయివేటు కళాశాల యాజమాన్యం అధికారులతో మాట్లాడి విధుల నుంచి తప్పించినట్లు తెలిసింది. డీఈసీ (జిల్లా పరీక్షల కమిటీ), హైపవర్ కమిటీలు నామమాత్రంగానే పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తున్నట్లు విమర్శలున్నాయి.

Advertisement
Advertisement