కష్టాల పాలు! | Sakshi
Sakshi News home page

కష్టాల పాలు!

Published Tue, May 1 2018 9:21 AM

Dairy farmers Suffering With Milk Prices - Sakshi

బైరెడ్డిపల్లె మండలంకూటాలవంకకు చెందినరెడ్డెమ్మకు రెండు పాడిఆవులు ఉన్నాయి. అందులో ఒకటి పాలు ఇస్తోంది. పూటకు ఐదు లీటర్ల చొప్పున రోజూ పది లీటర్ల పాలు డెయిరీకి పోస్తోంది. 15 రోజుల కోసారి లీటరు ధర రూ.25 చొప్పున రూ.3,750 బిల్లు వస్తోంది. అంటే నెలకు రూ.7,500 వస్తుంది. ఇందులోపశువుకు దాణా, మేత, వైద్యం తదితరాలకు నెలకు రూ.5000పోగా నెలకు మిగిలేదిరూ.2,500 మాత్రమే. దీంతోనే ఆమె కుటుంబాన్ని పోషించుకోవాలి. ఒక రెడ్డెమ్మ బాధేకాదు పడమటి కరువు మండలాల్లో 30వేల మంది పాడి రైతులుపడుతున్న కష్టమిదీ.

పలమనేరు: పశుదాణా ధర పెరగడం, పాలకు ఆశించిన ధర లభించకపోవడంతో  పాడి పశువుల పెంపకం రైతులకు భారంగా మారింది. వేసవిలో పాలకు డిమాండ్‌ ఉన్నా పాల ధర మాత్రం పెరగలేదు. వేసవిలో పాల డిగ్రీ 30,  వెన్నశాతం 4.2 ఉంటే లీటరు ధర రూ. 25 ఉంటోంది. పొరుగునే ఉన్న కర్ణాటకలో లీటరు పాలకు డిగ్రీని బట్టి రూ.30 దాకా ఇస్తుంటే ఇక్కడి డెయిరీలు మాత్రం లీటరు ధర సరాసరిగా రూ.25 ఇస్తున్నాయి. ఇక్కడి మార్కెట్‌లో ప్రైవేటు కంపెనీలు మాత్రం లీటరు పాలు రూ. 40 నుంచి రూ. 50 వరకు విక్రయిస్తున్నాయి. 

కొండెక్కిన పాడిఆవుల ధరలు
జిల్లాలో ఎక్కువగా హెచ్‌ఎఫ్, జెర్సీ రకాల సీమజాతి ఆవులను రైతులు కొనుగోలు చేస్తున్నారు. వీటిని కర్ణాటక, తమి ళనాడు నుంచి కొనుగోలు చేయాల్సిందే. లీటరు  పాలిస్తే రూ.5 వేలుగా 10 లీటర్ల పాలిచ్చే ఆవు రూ.50 వేలు ధరతో కొనేవారు. ప్రస్తుతం లీటరుకు రూ.8 వేలు చొప్పున పది లీటర్ల పాలిచ్చే ఆవును కొనాలంటే రూ.80 వేలకు పైగా వెచ్చించాలి. పాడిఆవు ధర, రవాణా, మూడేళ్ల ఇన్యూరెన్స్‌కు మరో రూ.6 వేలు పెట్టాల్సిందే.

డెయిరీల సిండికేట్‌..
జిల్లాలోని మదనపల్లె డివిజన్‌లో 45 ప్రైవేటు డెయిరీలు ఉన్నాయి. గతంలో ఈ డెయిరీలు రోజుకు 30 నుంచి 40 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నాయి. వేసవిలో మాత్రం పాల ఉత్పత్తి 25 లక్షల లీటర్లు దాకా ఉంటుంది. పాలు ఎక్కువగా ఉన్నప్పుడు సరఫరా ఎక్కువగా ఉందని ధరలను తగ్గించడం, డెయిరీల నుంచి అమ్మకాలు తగ్గితే ధరలు తగ్గించడం చేస్తున్నారు. రైతులకు డెయిరీలు లీటరు ధర రూ.25 నుంచి రూ.26 దాకా ఇస్తున్నాయి. కర్ణాటకలో డెయిరీలు రూ.30 నుంచి 32 దాకా ధర చెల్లిస్తున్నాయి. అక్కడ ప్రైవేటు పాల ఫ్యాక్టరీలున్నా ప్రభుత్వ డెయి రీ ఉన్నందున ప్రైవేటు డెయిరీల ఆధిపత్యం సాగడంలేదు. ఇక్కడ ప్రభుత్వ పాల డెయిరీలను ప్రభుత్వం మూసేయడంతో ప్రైవేటు డెయిరీల ఆధిపత్యం కొనసాగుతోంది. జిల్లాలోని రెండు పాల డెయిరీలు ధరను శాశిస్తున్నాయి.

పెరిగిన దాణా ధరలు..
ఒక పాడి రైతు రోజుకు 10 లీటర్ల పాలు పితికే ఆవును ప్రస్తుతం కొనుగోలు చేయాలంటే సుమారు రూ.80వేలు పెట్టాల్సిందే. దాంతో పాటు పాడి ఆవు సంరక్షణకు ఉపయోగించే దాణా ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుత మార్కెట్‌లో బూసా (50 కేజీలు) రూ.1350 గానుగపిండి మూట రూ.2500, మొక్కజొన్నలు 50 కేజీలు రూ.1000, బుడ్డశెనగ పొట్టు 24 కేజీలు రూ.500లుగా ఉన్నాయి. తవుడు 50 కిలోలు రూ.850 గా ఉంది. దీనికి తోడు వరిగడ్డి ట్రాక్టరులోడ్డు రూ.13వేలుగా ఉంది. ఆలెక్కన  మొత్తం రూ.19వేల దాకా ఖర్చు అవుతుంది.

ఆవు ధర, పోషణలో తేడాలివీ..
పది లీటర్ల పాలిచ్చే హెచ్‌ఎఫ్‌ లేదా జెర్సీ ఆవు ధర కర్ణాటక, తమిళనాడులో రూ.80 వేలుదాకా పలుకుతోంది.
జిల్లాలోని పడమటి మండలాల్లో  అదే జాతి ఆవు ధర రూ. 60 వేలకు దొరికినా అక్కడి ఆవులు ఇచ్చినంత పాలు ఇక్కడి ఆవులు ఇవ్వడంలేదు.
అందుకే రైతులు పొరుగు  రాష్ట్రాల నుంచి ఆవులను కొనుగోలు చేస్తున్నారు.
కర్ణాటకలోని కోలారు జిల్లాలో ఉండే ఉష్ణ్రోగ్రతలు సీమజాతి ఆవులకు సరిపడేలా ఉండడం. వారు ఎక్కువగా పచ్చిమేతను పెట్టడం, సరైన సంరక్షణ చర్యల కారణంగా బలిష్టంగా ఉంటున్నాయి.
జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల తగినంత పచ్చిగడ్డి లేదు. ఎక్కువగా ఎండుగడ్డి, బూసా వాడుతున్నారు.
కర్ణాటక నుంచి కొన్న ఆవులు సైతం ఇక్కడికి తెచ్చిన తొలినాళ్లలో ఇచ్చినంత పాలు మరుసటి ఈతకు ఇవ్వడం లేదు. సరైన పోషణ లేకపోవడం, ఇక్కడి వాతావరణ పరిస్థితులే అందుకు కారణాలు.

ఏమీ గిట్టడం లేదు
ధరల విషయంలో పాల డెయిరీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. అసలే మేత లేక ఏడు లీటర్లు పాలిచ్చే ఆవు ఐదు లీటర్లే ఇస్తోంది. పొద్దస్తమానం ఆవులకు చాకిరీచేసి వాటికి మేత, గానుగపిండి పెట్టి పోషిస్తే కూలి కూడా మిగలడంలేదు. ఏదో చేయాలి కాబట్టి గత్యంతరం లేక పశువులను మేపుతున్నాం.– రెడ్డెమ్మ, కూటాలవంక, బైరెడ్డిపల్లె మండలం

 పాలధరలు మరీ మోసం
ఇక్కడ ఉన్నవంతా ప్రైవేటు పాల డెయిరీలే. దానికి తోడు రైతులకు జరిగే అన్యాయంపై ప్రైవేటు డెయిరీలను ప్రశ్నించే అధికారం ఈ ప్రభుత్వానికి కూడా లేదు. ఇక ఐకేపీ వారి బీఎంసీయూలు ఉన్నప్పటికీ అవి ప్రైవేటు డెయిరీలను ఎదుర్కొనలేకపోతున్నాయి. పాల ధరలు ఇష్టారాజ్యంగా ఉంటున్నాయి. పాడి ఆవులను సంరక్షించడం కంటే అమ్ముకోవడం మేలుగా మారింది.-బాలయ్య, జంగాలపల్లె,పలమనేరు మండలం

Advertisement

తప్పక చదవండి

Advertisement