ఈ ప్రయాణం ప్రమాదకరమైనది | Sakshi
Sakshi News home page

ఈ ప్రయాణం ప్రమాదకరమైనది

Published Fri, Jul 1 2016 3:07 AM

ఈ ప్రయాణం ప్రమాదకరమైనది

భుజాన బిడ్డను మోసుకుంటూ ముందుకెళ్తున్నాడో తండ్రి. స్కూల్ బ్యాగు తడిసిపోకుండా జాగ్రత్తపడుతోందొక విద్యార్థిని. నిత్యావసర సరుకుల కోసం పొరుగు గ్రామానికి బయల్దేరాడో వ్యక్తి. మోకాలి లోతులో నీటి ప్రవాహం. వర్షాలు కురిస్తే తప్పని ప్రమాదకర విన్యాసం. ఏటా వర్షం కురిస్తే సువర్ణముఖి నదిలో కనిపించే దృశ్యాలివి. వంతెన నిర్మించక ఆరు గ్రామాలు పడుతున్న అవస్థలివి.
 
 సీతానగరం: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆవాలవలస, అంటివలస, రేపటివలస, కొత్తవలస, చినంకలాం, గెడ్డలుప్పి గ్రామాల ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఆవాలవలస, చినంకలాం గ్రామాల ప్రజలు బూర్జలోని రేషన్ డిపోలు, కిరాణా దుకాణాల నుంచి నిత్యావసర సరుకులు తీసుకెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. తామరఖండి నుంచి రేపటివలస, బగ్గందొరవలసుంచి గెడ్డలుప్పి, కొత్తవలస గ్రామస్తులు సరుకులు తీసుకెళ్తుంటారు.
 
  కానీ వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో సరుకులు అందక అవస్థలు పడుతున్నారు. గెడ్డలుప్పి నుంచి నిత్యం పిల్లలను విద్యాలయాలున్న సీతానగరం, చినబోగిలి, విశాఖపట్నం, బొబ్బిలి తదితర సుదూర ప్రాంతాలకు బగ్గందొరవలస కూడలి నుంచి వెళ్లాలి. ఈ నేపథ్యంలో నాలుగు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు సువర్ణముఖి నదిలో నీరు ఉధ్ధృతంగా ప్రవహించడంతో పిల్లలను తల్లిదండ్రులు భుజాన వేసుకుని నది దాటిస్తున్నారు. ఆరో తరగతి నుంచి ఉన్నత చదువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు బ్యాగ్‌లో రెండు జతల బట్టలు వేసుకుని వస్తున్నారు. నదిలో తడిసినబట్టలు ఒడ్డున ఆరవేసి, పొడి బట్టలను వేసుకుని వెళ్తున్నారు.
 
 వైఎస్ హఠాన్మరణంతో నిర్లక్ష్యం
 సుమారు 400 కుటుంబాలున్న గెడ్డలుప్పి గ్రామస్తులు ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినా సువర్ణముఖి నదిని దాటుకుని బగ్గందొరవలస సెంటర్ మీదుగా మండల కేంద్రానికి రావాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008లో సువర్ణముఖినదిపై వంతెన నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరుచేసి పనులకు భూమి పూజ చేశారు. అప్పట్లో 2010-11 నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వైఎస్ హఠాన్మరణం అనంతరం 10 శాతం పనులు చేసి నిలిపివేశారు. వంతెన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు రెండేళ్లుగా ప్రజాప్రతినిధులు చెబుతున్నారని, వారి మాటలు నమ్మే స్థితిలో లేమంటున్నారు ఈ ప్రాంతీయులు.   
 
 ఎక్కువ నీరుంటే కాలేజీకి డుమ్మా
 రోజూ ఉదయం గెడ్డలుప్పి నుంచి కాలేజీకి వెళ్తుంటాను. నదిలో ఎక్కువ నీరు ప్రవహిస్తే దిగలేక కాలేజీ మానేస్తాను. వంతెన నిర్మిస్తామన్న హామీతో ఎంతో సంతోషించాం. కానీ ఇప్పటికీ నిర్మాణం పూర్తికాలేదు.
 - ఎస్ సురేష్‌కుమార్, ఇంటర్ విద్యార్థి, గెడ్డలుప్పి
 
 పనులు మాని పిల్లాడ్ని ఏరు దాటిస్తున్నా
 రోజూ పిల్లాడ్ని గెడ్డలుప్పి నుంచి నదిని దాటించుకుని బగ్గందొరవలస కూడలికి పంపిస్తున్నాను. సాయంత్రం నది ఒడ్డున పిల్లాడు వచ్చేవరకూ నిరీక్షిస్తున్నాను. దీంతో వ్యవసాయ పనులు చేయలేకపోతున్నాం.
 -  కె.శ్రీనివాసరావు, రైతు, గెడ్డలుప్పి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement