చీకటి కమ్మేస్తోంది | Sakshi
Sakshi News home page

చీకటి కమ్మేస్తోంది

Published Sat, Nov 8 2014 2:47 AM

చీకటి కమ్మేస్తోంది

కొండలా పేరుకుపోయిన విద్యుత్ బకాయిలతో పంచాయతీలను చీకటి కమ్మేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ బకాయి పిడుగు కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్‌పీడీసీఎల్) బకాయిల వసూలులో నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. నోటీసులు జారీ చేయడం.. అప్పటికీ స్పందించకపోతే విద్యుత్ సరఫరా నిలిపేస్తోంది. ఫలితంగా ఏ పంచాయతీ ఎప్పుడు అంధకారంలో మగ్గుతుందో.. ప్రభుత్వాధికారుల కార్యాలయాలను ఏ సమయంలో చీకటి ఆవహిస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.    
 - సాక్షి ప్రతినిధి, కర్నూలు

 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలో పంచాయతీల విద్యుత్ బకాయి రూ.82 కోట్ల పైమాటే. ఆదుకోవాల్సిన ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం నిధులను బకాయిలకు జమ చేయాలనే ఆదేశాలతో సరిపెట్టింది. ఈ నిధులు అభివృద్ధి పనులకే సరిపోని పరిస్థితుల్లో బకాయిలకు ఎలా సర్దాలని సర్పంచ్‌లు గగ్గోలు పెడుతున్నారు. విద్యుత్ బకాయిల చెల్లింపునకే ప్రాధాన్యతనిచ్చినా.. లక్షల రూపాయల బిల్లులకు ఆ నిధులు ఏ మూలకూ సరిపోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వాస్తవానికి పంచాయతీల కరెంట్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని 2009లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆదేశాలు వెలువడ్డాయి. పంచాయతీలపై విద్యుత్ భారం సరికాదని అప్పట్లో ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీల విద్యుత్ బకాయిల చెల్లింపు భారం నుంచి తప్పుకుంది. 2011 నవంబర్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆ మేరకు నిర్ణయించారు.

ఆ తర్వాత నుంచి బకాయిలతో పాటు ప్రతి నెలా విద్యుత్ బిల్లుల చెల్లింపు ఆయా పంచాయతీలే చూసుకోవాల్సి వస్తోంది. ఈ కోవలో గత కొన్నేళ్లుగా పంచాయతీలను విద్యుత్ భారం వెన్నాడుతోంది. తాజాగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోంది. 13వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే అభివృద్ధి నిధులను బకాయిల చెల్లింపునకు ఉపయోగించాలని ఆదేశించడం గమనార్హం. అభివృద్ధి పనులకు వినియోగించాల్సిన నిధులను విధిలేని పరిస్థితుల్లో సర్పంచ్‌లు బకాయిలకు సర్దుబాటు చేస్తున్నా.. చాంతాడు బకాయిలతో చాలా పంచాయతీల్లో అంధకారం అలుముకుంటోంది.

 ఇక తాగునీటికీ కటకటే..
 పంచాయతీల విద్యుత్ బిల్లులను 2013 ఏప్రిల్‌లోనే ప్రభుత్వం పెంచింది. ఈ బిల్లుల కారణంగానే పంచాయతీల్లో సమస్య మొదలైంది. అభివృద్ధి పనులకే నిధులు లేక సతమతమవుతున్న పంచాయతీలకు ఇది మరింత భారమవుతోంది. బిల్లులు చెల్లించలేని పంచాయతీలకు విద్యుత్ శాఖ నిర్మొహమాటంగా సరఫరా నిలిపేస్తోంది. ఈ పరిస్థితి రానున్న రోజుల్లో తాగునీటి సరఫరా పథకాల పైనా ప్రభావం చూపనుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement