డీసీసీ అధ్యక్షుడిగా ఆనం? | Sakshi
Sakshi News home page

డీసీసీ అధ్యక్షుడిగా ఆనం?

Published Sun, Feb 23 2014 3:22 AM

DCC president anam ram narayan reddy

 సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో పార్టీని పున ర్నిర్మిస్తానని ప్రకటించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలోనే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలిసింది. కొత్త ప్రభుత్వంలో బెర్త్ దొరికినా అది మూడు నెలలే కాబట్టి డీసీసీ అధ్యక్షుడిగా పార్టీ వ్యవహారాల మీదే దృష్టి పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు.

ఈ మేరకు తన మద్దతుదారులతో ప్రాథమికంగా సమాలోచనలు చేశారని సమాచారం. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాలో ఆనం సోదరులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరు అటు పార్టీలోను, ఇటు ప్రభుత్వంలోను ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తున్నారు. వైఎస్సార్ మరణం తర్వాత ఆనం సోదరుల మీద పార్టీలో కొంత అసమ్మతి రాగం వినిపించినా మంత్రిగా తమకుండే  అధికార బలంతో దాన్ని అధిగమిస్తూ వస్తున్నారు.
 
 జిల్లా పార్టీ మీద తమ పట్టు పోకూడదనే ఉద్దేశంతోనే తమకు అత్యంత సన్నిహితుడైన చాట్ల నరసింహారావును ఇన్‌చార్జి డీసీసీ అధ్యక్షుడిని చేశారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆనం వివేకానందరెడ్డికి అతి దగ్గరి మిత్రుడిగా మెలిగిన నెల్లూరు సిటీ శాసనసభ్యుడు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి వంటి వ్యక్తి కూడా పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారు. తొలి నుంచి ఆనం సోదరులతో అంటీముట్టనట్టే వ్యవహరిస్తూ వచ్చిన సర్వేపల్లి శాసనసభ్యుడు ఆదాల ప్రభాకరరెడ్డి సైతం మళ్లీ సైకిల్ ఎక్కబోతున్నారు.
 
 సర్వేపల్లి, నెల్లూరు సిటీ, కోవూరు, ఉదయగిరి, కావలి, సూళ్లూరుపేట, గూడూరు శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ కావాలని అడిగే వారే లేకుండా పోయారు. నెల్లూరు లోక్‌సభ స్థానానికి కూడా పోటీ చేసేందుకు ఎవరూ ధైర్యం చేసే పరిస్థితి లేదు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ కారణం కావడంతో జిల్లాలో కేడర్ కూడా ప్రజల ముందుకు వెళ్లి ధైర్యంగా ఓటు అడిగే పరిస్థితి లేదు. ఇలాంటి వాతావరణంలోనే జిల్లాలో పార్టీని భుజానికెత్తుకుంటే భవిష్యత్తులో అధిష్టానం వద్ద భారీ పరపతి సంపాదించవచ్చనే దూరాలోచనతోనే ఆనం రామనారాయణరెడ్డి పార్టీ బాధ్యతలు మోయడానికి ముందుకొచ్చినట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
 
 ఇందులో భాగంగానే తొలుత ఆయన డీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించి ఆ తర్వాత జిల్లా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు సమయం ముంచుకురావడంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ఎవరో ఒకరిని పోటీ పెట్టేందుకు కసరత్తు చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రామనారాయణరెడ్డి కూడా ఆత్మకూరు నుంచి కాకుండా నెల్లూరు లోక్‌సభ స్థానానికి పోటీచేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
 

Advertisement
Advertisement