ముంచుకొస్తున్న గడువు | Sakshi
Sakshi News home page

ముంచుకొస్తున్న గడువు

Published Wed, Jan 29 2014 2:50 AM

ముంచుకొస్తున్న గడువు

 ఈ నెల 31తో పూర్తిఆధార్‌తో గ్యాస్
 అనుసంధానం 43 శాతమే!
 వినియోగదారుల స్పందన అంతంత మాత్రమే
 
 విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : జిల్లా లో నగదు బదిలీ పథకానికి గడువు ముంచుకొస్తున్నా ప్రజల నుంచి స్పందన మాత్రం కనిపించడం లేదు. ఫిబ్రవరి 1 నుంచి నాన్‌సబ్సిడీ సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉన్నా గ్యాస్, ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానంపై ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటి వరకు కేవలం 43 శాతం మంది మాత్రమే నగదు బదిలీకి వివరాలను అనుసంధానం చేసుకున్నారు. ఇంకా జిల్లాలో 4,73,100 మంది గ్యాస్ వినియోగదారులు వరకు నమోదు చేయించుకోవాల్సి ఉంది. గ్యాస్ సబ్సిడీ డబ్బును వినియోగదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసేందుకు ప్రభుత్వం జిల్లాలో అక్టోబర్ 1వ తేదీ నుంచి నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంది.
 
  డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రభుత్వం గడువిచ్చినా అప్పటికి కేవలం 25 శాతం మాత్రమే నమోదు చేసుకోవడంతో జనవరి 31వ తేదీ వరకు గడువు పెంచిన విషయం తెలిసిందే. జిల్లాలో 8.3 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉండగా ఇప్పటి వరకు 3,56,900 మంది గ్యాస్ వినియోగదారులు మాత్రమే గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానం చేసుకున్నారు. జనవరి 31వ తేదీతో గడువు ముగుస్తుండడంతో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నాన్‌సబ్సిడీ సిలిండర్‌ను ప్రస్తుత ధర ప్రకారం రూ.1310 కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement