పింఛన్లకు ‘డెడ్’లైన్ | Sakshi
Sakshi News home page

పింఛన్లకు ‘డెడ్’లైన్

Published Thu, Mar 3 2016 12:48 AM

Deadline pensions

ఆకివీడు :
 రేషన్ సరఫరా గడువును కుదించి నట్టే పింఛన్ల పంపిణీనీ మూడురోజులకు పరిమితం చేయడంతో లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి మూడోతేదీలోపే పంపిణీని పూర్తిచేయాలని జిల్లా, మండల స్థాయి అధికారులకు కలెక్టర్ నుంచి ఆదేశాలందాయి. దీంతో ఒకటో తేదీ ఉదయం నుంచే పంపిణీని ప్రారంభించారు. మూడురోజుల్లో తీసుకోకుంటే పింఛన్లు ఇవ్వరనే ఆందోళనతో లబ్ధిదారులు  మంగళ, బుధవారాల్లో పంచాయతీ కార్యాలయాల వద్ద అధిక సంఖ్యలో బారులు తీరారు. పింఛన్లు పంపిణీ చేసే ట్యాబ్‌లు మొరాయించడం, సర్వర్లలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటలతరబడి పంచాయతీ కార్యాలయాల వద్దే పడిగాపులు పడ్డారు.
   
 తలపట్టుకున్న పంపిణీ సిబ్బంది
 మంగళ, బుధవారాల్లో తెల్లవారుజామునే లబ్ధిదారులు పంచాయతీ కార్యాలయాల వద్దకు చేరుకోవడంతో సిబ్బంది ఉదయం ఏడు గంటలకే పంపిణీని ప్రారంభించారు. కొద్ది నిమిషాలకే సర్వర్ మొరాయించడం, వేలిముద్రల సేకరణ కష్టంగా మారడంతో సిబ్బంది ట్యాబ్‌లతో కుస్తీపట్టారు. అయినా ఫలితం లేకపోయింది. గంటకు పాతిక పింఛన్లు మాత్రమే పంపిణీ చేయగలిగారు. దీంతో వృద్ధులు, వికలాంగులు నిలబడలేక, కూర్చోలేక అవస్థలు పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ లబ్ధిదారులు ఇళ్లకు కూడా వెళ్లకుండా తిండీతిప్పలు లేకుండా పంచాయతీ కార్యాలయాల వద్దే ఆపసోపాలు పడ్డారు. కొన్నిచోట్ల వృద్ధులు ఎక్కువసేపు నిలబడలేక సొమ్మసిల్లి పడిపోయారు. ఓ వైపు సర్వర్ పనిచేయక, మరో వైపు లబ్ధిదారుల అవస్థలు చూడలేక పంపిణీ సిబ్బంది  తలలు పట్టుకున్నారు.
 
 మూడోతేదీ దాటితే పింఛన్ అందనట్టేనా!
 గతంలో ప్రతినెలా పదో తేదీ వరకూ పింఛన్లు పంపిణీ చేసేవారు. ఆ తేదీకి తీసుకోని వారికి ఆ తరువాత నెలలో పింఛన్ ఇచ్చేవారు. అయితే ఈనెల నుంచి గడువులోపు పింఛన్లు తీసుకోకుంటే తరువాతినెలలో ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇది లబ్ధిదారుల్లో ఆందోళనరేపుతోంది. గత నెలలో ఐదు శాతం అంటే సుమారు 16 వేల మంది ఫించన్ పొందలేదు. వీరికి ఈనెలలో ఇస్తారు. నిబంధనల ప్రకారం.. మూడు నెలలు వరుసగా పింఛన్ తీసుకోకపోతే ఆ లబ్ధిదారుని జాబితా నుంచి తొలగిస్తారు. తరువాత లబ్ధిదారులు స్థానికంగానే ఉన్నానని ధ్రువపత్రాలు దాఖలు చేస్తే పింఛన్ పునరుద్ధరించాలి.  
 
 రెండేళ్ల నుంచీ తిప్పలే
 పింఛన్ల కోసం రెండేళ్ల నుంచి తిప్పలు పడుతూనే ఉన్నామని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలిముద్రలు సరిగా పడకపోవడంతో పంపిణీ కేంద్రాలకు తరుచూ తిరగాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో డ్వాక్రా గ్రూపుల ద్వారా, పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు ఇస్తామన్నారని, ఇప్పుడు పంచాయతీ కార్యాలయాల వద్ద ఇస్తున్నారని ప్రభుత్వం నెలకో విధానాన్ని అమలు చేస్తూ లబ్ధిదారులను అవస్థలకు గురిచేస్తోందని ఆవేదన చెందారు.  
 
 సగం మందికే పంపిణీ
 జిల్లాలో మొత్తం 3,42,259 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా  రూ.37.03 కోట్లు అందిస్తున్నారు.  వీరిలో వృద్ధాప్య పింఛన్‌దారులు 1,61,608 మంది ఉండగా, వారికి రూ.16.89కోట్లు, వితంతు పింఛన్‌దారులు  1,05,530 మంది ఉండగా, రూ.11.17కోట్లు, వికలాంగ పింఛన్‌దారులు 44,810 మంది ఉండగా,  రూ.6.10కోట్లు, చేనేత కార్మిక పింఛన్‌దారులు 3,275 మంది ఉండగా,  రూ.0.34కోట్లు, కల్లుగీత కార్మిక పింఛన్‌దారులు 1974 మంది ఉండగా, రూ.0.20కోట్లు, అభయహస్తం పింఛన్‌దారులు 25,062 మంది ఉండగా, వీరికి రూ.2.60కోట్లు పంపిణీ చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి  మొత్తం 52 శాతం మందికి మాత్రమే పింఛన్ల పంపిణీ జరిగిది. అంటే 1,77,900 మందికి మాత్రమే పింఛన్ అందింది. ఇంకా సగం మందికి మూడోతేదీ ఒక్కరోజే అందించాల్సి ఉంది. ఇది ఏమాత్రం సాధ్యం కాదని పంపిణీ సిబ్బందే చెబుతున్నారు.
 

Advertisement
Advertisement