అప్పుల తిప్పలు | Sakshi
Sakshi News home page

అప్పుల తిప్పలు

Published Mon, Sep 22 2014 12:13 AM

అప్పుల తిప్పలు

రుణమాఫీకి ని‘బంధనాలు’
 
 సాక్షి, కర్నూలు:  జిల్లాలో దాదాపు 6.50 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 2,211 కోట్ల బకాయి మాఫీ కావాల్సి ఉంది. ప్రభుత్వం అండగా నిలుస్తుందనే భరోసా రోజురోజుకు సన్నగిల్లుతోంది. రీషెడ్యూల్‌పై చేతులెత్తేయగా.. కొత్త రుణాల ఊసే కరువైంది. ఖరీఫ్‌లో దాదాపు 1.50 లక్షల మంది మాత్రమే కొత్త రుణాలు అందుకోగా.. ఈ మొత్తం రూ.700 కోట్లకే పరిమితమైంది. వాస్తవానికి రూ.2,880 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యం కాగా.. ఇందులో సగం కూడా అందుకోలేకపోవడం రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. విధిలేని పరిస్థితుల్లో రైతులంతా ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు.. మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించి అధిక వడ్డీతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు. ‘వ్యవసాయ రుణాలు కట్టకండి. నేను అధికారంలోకి రాగానే అన్నింటినీ మాఫీ చేస్తా’నని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తుండటం మొదటికే మోసం తీసుకొస్తోంది. ఇటీవల కాలంలో అధిక వర్షాల కారణంగా పంటలు చాలా వరకు దెబ్బతినడంతో అప్పు తీర్చే దారి లేక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిబంధనల పేరిట రుణ మాఫీ జాబితా నుంచి రైతులను తగ్గించుకుంటూ పోతుండటం గందరగోళానికి తావిస్తోంది. ఒకవేళ ప్రభుత్వం రుణాలను మాఫీ చేసినా.. అప్పటికి అర్హులయ్యే వారి సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టవచ్చనే చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణ మాఫీ చేస్తానని ప్రకటించిన బాబు.. వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నా ఇప్పటికీ స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం మొదట కొందరికి.. ఆ తర్వాత మరికొందరికి విడతల వారీగా రుణ మాఫీ వర్తింపజేస్తామని ప్రకటించడమే తప్పిస్తే ఎప్పుటిలోగా అనే విషయాన్ని వెల్లడించని పరిస్థితి. ఎప్పటిలానే ఆశల సాగులో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్నదాత చివరి ప్రయత్నంగా భార్యల మెడల్లోని తాళిబొట్లను సైతం కుదవ పెట్టాల్సిన దౌర్భాగ్యం నెలకొంది.
 రైతులు హాయిగా ఉన్నారట.. రుణమాఫీ విషయంలో ప్రభుత్వంపై నమ్మకం ఉండబట్టే రైతులు ఆందోళన చెందడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. భవిష్యత్ అగమ్యగోచరంగా మారిన పరిస్థితుల్లో.. రైతులంతా హాయిగా ఉన్నట్లు చెప్పుకోవడం విడ్డూరమని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా రైతులు వడ్డీ వ్యాపారుల చేతుల్లో విలవిల్లాడుతున్నారు. అతి కష్టం మీద పంటలు సాగు చేస్తున్నా.. చేతికందే వరకు నమ్మకం లేని పరిస్థితి. ప్రభుత్వం చేయూతనివ్వకపోవడంతో.. అన్నదాత పూర్తిగా ప్రకృతిపైనే భారం వేయాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది.



 

Advertisement
Advertisement