Sakshi News home page

రుణ ప్రదక్షిణ

Published Sun, Jun 22 2014 3:48 AM

రుణ ప్రదక్షిణ - Sakshi

  • సాగుపెట్టుబడుల కోసం బ్యాంకుల చుట్టూరైతుల ప్రదక్షిణలు
  •  కొత్తవి ఇవ్వడానికి బ్యాంకర్లు వెనుకంజ
  •  రుణమాఫీపై ప్రభుత్వం మెలిక
  •  కాలయాపన నేపథ్యంలో సందిగ్ధం
  • ఖరీఫ్ పనులు మొదలయ్యాయి. రైతులు పెట్టుబడుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రుణ మాఫీ ఒక కొలిక్కి రాకపోవడంతో కొత్త రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మదుపుల కోసం మహిళల పుస్తెలను కుదవ పెట్టేందుకు రైతులు వెనుకాడటం లేదు.
     
     నర్సీపట్నం : ఖరీఫ్ ప్రారంభంతో అన్నదాతలను పెట్టుబడుల కష్టాలు చుట్టుముట్టాయి. జిల్లాలో 4,56,445 మంది రైతులు ఉన్నారు. వీరిలో 90 శాతం మంది వ్యవసాయ మదుపుల కోసం ఏటా బ్యాంకులపైనే ఆధారపడుతుంటారు. జిల్లాలో సాగు సాధారణ విస్తీర్ణం 2,27,400 హెక్టార్లు. వీటిల్లో వ్యవసాయ పనులకు మదుపుగా 2,00,304 మంది రైతులకు సుమారు రూ.700 కోట్లు రుణాలిచ్చేందుకు అధికారులు ప్రణాళికను రూపొందించారు. ఇంతవరకు బాగానే ఉంది. అధికారుల లక్ష్యానికి.. క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

    2013-14 ఖరీఫ్, రబీ సీజన్‌లలో జిల్లాలోని 2,10,881 మంది రైతులు జాతీయ, సహకార బ్యాంకుల్లో సుమారు రూ. 894 కోట్లు రుణాలు తీసుకున్నారు. ఖరీఫ్‌వి మార్చి చివరిలోగా, రబీ బకాయిలు ఈ నెలాఖరులోగా చెల్లించాలి. మళ్లీ ఈ ఏడాదికి రుణాలు తీసుకోవాలి. గతేడాది సాగు అనుకూలించక పోవడంతో పాటు చంద్రబాబు రుణ మాఫీ హామీతో బకాయిలు పేరుకుపోయాయి.
     
    పెరిగిన పెట్టుబడులు

    ఎరువులు, పురుగు మందుల ధరలు బాగా పెరిగిపోయాయి. కూలీల మదుపులూ ఎక్కువయ్యాయి. జిల్లాలో ఎకరా చెరకు మొక్కతోట సాగుకు 67,190లు, అదే కార్శి తోట అయితే రూ.48,315లు ఖర్చవుతోంది. వరికి రూ.24,700లు, మొక్కజొన్నకు రూ.19,600లు, వేరుశనగకు రూ.13,600లు, పొద్దుతిరుగుడుకు రూ.9,900లు, చోడికి రూ.13,400లు, కందులుకు రూ.10,400లు, పెసలుకు రూ.5,350లు, మినుములుకు రూ.5,200లు ఖర్చవుతోంది.

    అందరికీ కాకపోయినా బ్యాంకులు కొందరికైనా గతంలో రుణాలిచ్చేవి. ప్రస్తుతం చంద్రబాబు హామీతో బ్యాంకర్లు వేచి చూసే ధోరణిని పాటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు రుణాల కోసం వెళితే ససేమిరా అంటూ తిరిగి పంపుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రుణ మాఫీ అమలు చేసుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇళ్లల్లో ఉన్న బంగారు వస్తువులను తాకట్టు పెడుతున్నారు. బంగారంపై కూడా కొన్ని బ్యాంకులు రుణాలివ్వడం లేదు. దీంతో కొందరు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మూడు నుంచి నాలుగు రూపాయలు వడ్డీపై అప్పులు తెచ్చి నిండా మునిగిపోతున్నారు.

Advertisement
Advertisement