5 మండలాల్లోనే రుణాల రీ షెడ్యూల్ | Sakshi
Sakshi News home page

5 మండలాల్లోనే రుణాల రీ షెడ్యూల్

Published Sat, Nov 8 2014 2:51 AM

debt re-scheduling in 5 Mandals

ఎస్‌ఎల్‌బీసీలో నిర్ణయం
సర్కారుపై రైతుల నిరసన

 
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఖరీఫ్‌లో పంట దెబ్బతిన్న ఐదు మండలాల్లో పంట రుణాల రీ షెడ్యూల్‌కు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు జీఓ నంబర్ 16ను శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం(ఎస్‌ఎల్‌బీసీ)లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ జీఓ విడుదలైంది. ఈ విషయాన్ని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ జగన్నాథస్వామి ‘సాక్షి’కి ధృవీకరించారు. ఆ జీఓను అనుసరించి ఐదు మండలాల్లో మాత్రమే పంట రుణాల రీ షెడ్యూల్ జరగనుంది. ఖరీఫ్‌లో (ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య) రుణాలు తీసుకుని పంట దెబ్బతిన్న రైతులకు ఇది వర్తిస్తుంది.

జిల్లా యంత్రాంగం పంపించిన సిఫార్సుల మేరకు ఐదు మండలాల్లో రీ షెడ్యూల్‌కు ఆమోదం తెలియచేశారని సమాచారం.ఆ ఐదు మండలాల్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం తునిలో (తుని, తొండంగి, కోటనందూరు) మూడు మండలాలు ఉండటం గమనార్హం.  పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి, అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలాలకు కూడా రుణాల రీ షెడ్యూల్ జాబితాలో చోటుకల్పించారు.

రీ షెడ్యూల్ గడువు ఎంతో..!
ఆ మండలాల్లో ఏప్రిల్-అక్టోబరు మధ్య పంట రుణాలుండి, పంట దెబ్బతిన్న వారికి మాత్రమే ఈ రీ షెడ్యూల్ అమలవుతుందంటున్నారు. ఆ మండలాల్లో రుణాలున్న రైతుల నుంచి మూడు లేదా ఐదేళ్ల వరకు రుణాలు వసూలు చేయకుండా వెసులుబాటు లభించనుంది. రిజర్వు బ్యాంక్  మార్గదర్శకాల ప్రకారమైతే రుణవసూళ్లకు మూడేళ్ల గడువు లభించనుందని బ్యాంకింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రుణాలు రీ షెడ్యూల్ అయ్యే సందర్భాల్లో రీ షెడ్యూల్ చేసిన రుణం ఎంత ఉంటే అంత మేరకు తిరిగి రుణం పొందేందుకు రైతుకు అవకాశం ఉంది.

కానీ రెండో పంట వేస్తేనే ఈ రుణం లభిస్తుందని బ్యాంక్‌లు చెబుతున్నాయి. రీ షెడ్యూల్‌కు నిర్ణయించిన ఐదు మండలాల్లో ఏయే గ్రామాల్లో, ఎంతమందికి వర్తిస్తుంది, ఎంత మేరకు రుణాలు రీ షెడ్యూల్ అవుతాయి అనే విషయాలపై జిల్లా స్థాయిలో బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి దీనిపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. వ్యవసాయ రుణ మాఫీ రేపు, మాపంటూ గత ఐదారు నెలలుగా నానుస్తున్న సర్కార్ ఇప్పుడు ఖరీఫ్‌లో పంటలు దెబ్బతిన్న రైతుల రుణాల రీ షెడ్యూల్‌ను  ఐదు మండలాలకే పరిమితం చేయడం దాని స్వభావానికి అద్దం పడుతోందని కోనసీమకు చెందిన రైతు సంఘ ప్రతినిధి జున్నూరు బాబీ ఆక్షేపించారు.

ఇంత కంటే గొప్పగా అమలు చేస్తుందనే నమ్మకం రైతుల్లో కనిపించడం లేదన్నారు. పాత రుణాలపై వడ్డీలకు చక్రవడ్డీలతో తడిసి మోపెడై రైతులు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతిన్న పరిస్థితుల్లో రుణాల మాఫీకి చాపచుట్టేసి, ఐదు మండలాల్లో ఖరీఫ్ పంటరుణాల రీ షెడ్యూల్ ప్రకటించడంపై రైతులు మండిపడుతున్నారు.

Advertisement
Advertisement