‘అప్పు రేపు’ చందంగా రుణమాఫీ | Sakshi
Sakshi News home page

‘అప్పు రేపు’ చందంగా రుణమాఫీ

Published Wed, Dec 3 2014 2:37 AM

‘అప్పు రేపు’ చందంగా రుణమాఫీ - Sakshi

రాష్ట్రంలో రుణమాఫీ అంశం ‘అప్పు రేపు’ చందంగా మారిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి వాగ్దానాలకు మోసపోయిన ప్రజల పక్షాన నిలబడి వైఎస్సార్‌సీపీ శుక్రవారం చేస్తున్న మహాధర్నాకు ముఖ్యంగా రైతులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు గుంటూరు కలెక్టరేట్‌కు తరలిరావాలని ఆయనతోపాటు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు.
 
గుంటూరు సిటీ: రాష్ట్రంలో రుణమాఫీ అంశం ‘అప్పు రేపు’ చందంగా మారిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. రుణమాఫీ సాధ్యం కాదని తెలి సినా, అలా చెప్పకుండా ప్రభుత్వం కప్పదాటు ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. మంగళవారం గుంటూరు అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ ముఖ్య నేతలు, సమన్వయకర్తల సమావేశం జరిగింది.
 
 పార్టీ జిల్లా అధ్యక్షుడు మ ర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించగా తొలుత అంబటి మాట్లాడారు. రుణమాఫీపై రైతులకు మొదట్లో ఉన్న భ్రమలు కూడా పూర్తిగా తొలగిపోయాయని అంబటి అన్నారు. రుణమాఫీ ‘జరిగేదీ లేదు - చచ్చేదీ లేదు’ అన్న సంగతి అందరికీ తెలిసిపోయిందన్నారు. ఈ ప్రభుత్వమే మాఫీ అయిపోతే పీడా వదిలిపోతుందనే కసిలో  ప్రజలంతా ఉన్నారని అన్నారు.
 
  మోసపోయిన ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ నిలబడి పోరాటం చేయాల్సిన అవసరాన్ని గుర్తించి పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మూడు అంచెల ఆందోళనా కార్యక్రమాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. తొలి విడత మండల కార్యాలయాలు, మలి విడతగా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, చివరగా తూర్పు గోదావరి జిల్లాలో రెండు రోజుల పాటు నిరాహారదీక్ష కార్యక్రమాన్ని ఆయన రూపొందించారన్నారు.
 
 ప్రస్తుతం రెండో విడతలో భాగంగా శుక్రవారం గుంటూరులోని కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ, ఎన్నికల తర్వాత జిల్లా స్థాయిలో జరుగుతున్న మొట్ట మొదటి ఆందోళనా కార్యక్రమం ఇదేనన్నారు.  తెలుగు దేశం ప్రభుత్వ ఆరు మాసాల పాలనలోనే ఇటు రైతులు అటు అన్ని వర్గాల ప్రజలు విసుగెత్తి పోయి ఉన్నారన్నారు.
 
  గ్రామాల అభివృద్ధికి వస్తున్న కేంద్ర నిధులను కూడా తెలుగుదేశం ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని మర్రి రాజశేఖర్ ఆరోపించారు. 5వ తేదీన కలెక్టరేట్ ఎదుట జరగనున్న మహాధర్నాను జయప్రదం చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. గురజాల మాజీ ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ,  అధికారంలో లేమన్న నిరాశా నిస్పృహలను పక్కనబెట్టి, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు సమస్యలపై రాజీలేని పోరాటం చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
 
  బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ, అమలు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన బాబు అన్ని రంగాల్లో విఫలమయ్యారని ఆరోపించారు.పార్టీ రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యలు గాలికొదిలేసి పచ్చ చొక్కాల జేబులు నింపే కార్యక్రమంలో తెలుగు దేశం ప్రభుత్వం తల మునకలై ఉందని ఆరోపించారు. మహాధర్నాకు గుంటూరు నగరం నుంచి పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వెల్లడి చేయాలని పిలుపునిచ్చారు.
 
  జిల్లాపరిషత్‌లో వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ దేవళ్ళ రేవతి, తాడికొండ, తెనాలి, వేమూరు, పెదకూరపాడు నియోజకవర్గాల పార్టీ సమన్వయ కర్తలు కత్తెర క్రి స్టీనా, శివకుమార్, మేరుగ నాగార్జున, హనిమిరెడ్డి తదితరులు మాట్లాడుతూ చంద్రబాబుకు స్వయంగా తాను చేసిన హామీల మీదే స్పష్టత లేదనీ, పథకాల అమల్లో కూడా చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. సమావేశంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ ముస్తఫా, జిల్లాలోని వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జిల్లా సేవాదళ్ చైర్మన్ కొత్త చిన్నపరెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ సయ్యద్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement