జిల్లాకు రిక్తహస్తమే | Sakshi
Sakshi News home page

జిల్లాకు రిక్తహస్తమే

Published Fri, Sep 5 2014 3:48 AM

Decentralized development of all regions, districts

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరించి అన్ని ప్రాంతాలు, జిల్లాలను ప్రగతి పథంలో పయనింపజేస్తామని, దీనికి పలు నూతన ప్రాజెక్టులు చేపడతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు మాత్రం మొండిచేయి చూపారు. గురువారం అసెంబ్లీలో సీఎం చేసిన రాష్ట్ర రాజధాని ప్రకటన సందర్భంగా జిల్లాకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్న అసం తృప్తి ఉంది. దీనిపై జిల్లావాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు ఒక్క ఉన్నత విద్యాపరమైన సంస్థ కూడా రాలేదని వాపోతున్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపాదించి, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను కొత్త ప్రతిపాదనలుగా పేర్కొనడాన్ని విమర్శిస్తున్నారు.
 
 ఇప్పటికే హోటల్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్ 90 శాతం నిర్మాణం పూర్తికాగా, దీనిని కూడా కొత్త ప్రతిపాదనల్లోకి తీసుకుని వచ్చారు. అదేవిధంగా నెల్లూరులో విమానాశ్రయ నిర్మాణం చేపట్టడానికి గత యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించడం, దానికి స్థల సేకర ణ చేపట్టారు. దీనిని కూడా కొత్త ప్రతిపాదనల్లోకి తీసుకొచ్చారు. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణాన్ని అనేకమంది వ్యతిరేకిస్తున్నారు.
 
  దీంతో పులికాట్ సరస్సు ఉనికి దెబ్బతింటుందని, శ్రీహరికోటలోని రాకెట్‌ప్రయోగ కేంద్రంకు ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో దుగ్గరాజపట్నం పోర్టు ఇకలేనట్లేనని వార్తలు వస్తుండగా, మళ్లీ పోర్టును ప్రతిపాదనల్లోకి తీసుకుని వచ్చారు. ఇది రాని ప్రాజెక్టు అని అందరికీ తెలిసినా, జిల్లావాసులను మభ్యపెట్టేందుకు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. పులికాట్‌ను పర్యాటక కేంద్రం చేసే పక్షంలో దుగ్గరాజపట్నం పోర్టు వచ్చే ప్రసక్తే లేదని ఆ ప్రాంతవాసులు పేర్కొంటున్నారు. ఇక మిగిలింది ఆటోమొబైల్ హబ్, మెరైన్ ఇన్‌స్టిట్యూట్‌లను కూడా నెల్లూరుకు ప్రకటించారు. ఆటోమొబైల్ హబ్‌లో ప్రయివేటు సంస్థలను నిర్మించాల్సి ఉంది. మెరైన్ ఇన్‌స్టిట్యూట్ కేంద్రప్రభుత్వం ప్రతిపాదించాల్సి ఉంది.
 
 జిల్లాలో ఒక కేంద్రమంత్రి, మరొక రాష్ట్రమంత్రి ఉన్నా, జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని జిల్లావాసులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యమైన విద్యాసంస్థలు, ఇతర పారిశ్రామిక కారిడార్‌లు కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాలకు మాత్రమే కేటాయించుకున్నారని, జిల్లాకు మొండిచేయి చూపించినట్లు జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నై-వైజాగ్ కారిడార్‌తో పారిశ్రామిక అభివృద్ధి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి, పరిశ్రమల ప్రతిపాదనలు ఒక్కటి కూడా జిల్లాకు కేటాయించలేదని అంటున్నారు. ఎరువుల కర్మాగారం ప్రకటన కూడా తూతూమంత్రంగానే ఉంది. ఏదో ఒక ప్రతిష్టాత్మక విద్యాసంస్థను ప్రకటించి నెల్లూరు జిల్లాకు ప్రాధాన్యం కల్పించాలని కోరుతున్నారు.
 

Advertisement
Advertisement