డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల ఉద్వాసనకు రంగం సిద్ధం | Sakshi
Sakshi News home page

డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల ఉద్వాసనకు రంగం సిద్ధం

Published Wed, Jul 8 2015 12:56 AM

degree Contract lecturers Prepare sector

 శ్రీకాకుళం న్యూకాలనీ :జిల్లాతోపాటు రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల ఉద్వాసనకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నెట్, సెట్, పీహెచ్‌డీ వంటి యూజీసీ అర్హతలు లేనికారణంగా కాంట్రాక్ట్ లెక్చరర్ల రెన్యువల్స్‌ను నిలిపివేయాలని తాజాగా ఉత్తర్వులు రావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 13 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సులు, సబ్జెక్టుల్లో దాదాపు 104 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. ఇందులో దశాబ్ద కాలంగా విధుల నిర్వర్తిస్తున్నవారు సగానికిపైగా ఉన్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తమ రెన్యువల్స్‌కు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తాయని భావించారు.
 
 అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, క్లాసులు జరగడంలేదని భావించి మంగళవారమే జిల్లాలోనే అన్ని కళాశాలలకు చెందిన కాంట్రాక్ట్ లెక్చరర్ల రెన్యువల్స్ పక్రియను నిర్వహించారు. ఇంతలోనే పిడుగులాంటి వార్త వారిని కలవర పరుస్తోంది. సాయంత్రానికే రెన్యువల్స్‌ను నిలుపదల చేయాలని కోరుతూ డిగ్రీ ఆర్జేడీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడటంతో వారంతా లబోదిబోమంటున్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్‌చేస్తున్నారు. దశాబ్దాలు, ఏళ్లతరబడి ప్రభుత్వ లెక్చరర్లకు సరిసమానంగా విధులు నిర్వర్తిస్తున్న తమకు ఉన్న పళంగా యూజీసీ అర్హతలు లేవని విధులకు దూరం చేయాలనిచూడటం భావ్యం కాదని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు.
 
 ఇదీ  జరిగింది!
 కడప జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు యూజీసీ నిబంధనలను అనుసరించి నెట్, సెట్, పీహెచ్‌డీ వంటి అర్హతలు లేని కాంట్రాక్ట్ లెక్చరర్లతో పాఠాలు బోధిస్తున్నారని, వీటిని నిలుపుదల చేయాలని కోరుతూ ఇటీవల హైకోర్టులో ఫిల్‌దాఖలు చేశారు. స్పందించిన హైకోర్టు డిగ్రీ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల కౌన్సెలింగ్, విధివిధానాలు, రెన్యువల్స్, నిబంధనలు తదితర అంశాలపై కౌంటర్ దాఖలుచేయాని ప్రభుత్వాన్ని, కాలేజియేట్ ఎడ్యుకేషన్‌కు ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 747 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేస్తుండగా... అందులో 600 మందికి నెట్, సెట్, పీహెచ్‌డీ వంటి అర్హతలు లేకపోవడం, ప్రస్తుతానికి హైకోర్టులో కేసు కొనసాగుతున్న నేపధ్యంలో రెన్యువల్స్ చేయడం సరికాదని ప్రభుత్వం భావిస్తున్నట్తు తెలుస్తోంది. గత ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభంలోనూ ఇదే తంతు జరిగింది.
 

Advertisement
Advertisement