రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి డిగ్రీ పరీక్షలు

Published Wed, Mar 19 2014 1:59 AM

Degree exams from tomorrow

యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు గురువారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 116 కళాశాలలకు చెందిన మొదటి, రెండు, మూడు సంవత్సరాల విద్యార్థులు, సప్లిమెంటరీ రాసేవారు 62,384 మంది పరీక్షలు రాయనున్నారు.
 
 ఈ నేపథ్యంలో హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో పెట్టారు. ఆన్‌లైన్ ద్వా రా హాల్‌టికెట్ల పంపిణీ సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభమైంది. మంగళవారం నుంచి సర్వర్ మొరాయించడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. ఈ అంశాన్ని విద్యార్థులు పరీక్షల విభాగం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు వెబ్‌సైట్‌ను మంగళవారం సాయంత్రానికి పునరుద్ధరించారు. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.
 
 ఆన్‌లైన్ కష్టాలు
 ఎస్వీయూలో డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ, హాల్‌టికెట్ల పంపిణీ తొలిసారిగా ప్రవేశపెట్టారు. దీనికోసం చెన్నైకి చెందిన టీఆర్‌ఎస్ ఫామ్స్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించారు.
 
  ఈ సంస్థ నిర్వాకంవల్లే మంగళవారం హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ కాక ఇబ్బంది పడినట్లు కొందరు విద్యార్థులు ఆరోపించారు. ఈ ఆరోపణలను పరీక్షల విభాగం డీన్ ఎం.సురేష్‌బాబు ఖండించారు. 60 వేల మంది ఒకేసారి హాల్‌టికెట్ల కోసం ప్రయత్నించడం వల్ల సాంకేతిక సమస్యలు వచ్చాయన్నారు. మధ్యాహ్నం కల్లా సరిదిద్దామని చెప్పారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
 
  ఇతర జిల్లాల వారికి తిరుపతిలో పరీక్షలు
 వైఎస్‌ఆర్, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు చెందిన సప్లిమెంటరీ విద్యార్థులకు డిగ్రీ పరీక్షలను తిరుపతి కేంద్రంలో మాత్రమే నిర్వహిస్తున్నట్టు అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఏ.సునీత తెలిపారు. బీకాం, బీఎస్సీ, బీసీఏ విద్యార్థులకు ఎస్‌జీఎస్ కళాశాలలో బీఏ, బీబీఎం వారికి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో, బీఎస్సీ విద్యార్థులకు పద్మావతి డిగ్రీ కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement