టెన్షన్..టెన్షన్ | Sakshi
Sakshi News home page

టెన్షన్..టెన్షన్

Published Fri, Nov 8 2013 4:29 AM

Delay in announcement of results of supervisor posts

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్-2 సూపర్‌వైజర్ రెగ్యులర్ పోస్టుల ఫలితాలు రోజురోజుకూ వెనక్కుపోతున్నాయి. ఎంపికైన అభ్యర్థుల ఫలితాలు ప్రకటిస్తారని ఏరోజుకారోజు ఎదురుచూస్తున్న అభ్యర్థులు భంగపాటుకు గురవుతున్నారు. రాత పరీక్షలో వచ్చిన మార్కులను ఇప్పటికే వెబ్‌సైట్ ద్వారా తెలుసుకుని పోస్టులు వస్తాయోరావోనని ఆందోళన చెందుతున్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా రోస్టర్‌వారీగా సిద్ధమైనప్పటికీ కలెక్టర్ సంతకం కాలేదని సంబంధిత అధికారులు ప్రకటించకుండా వాయిదావేస్తూ వస్తున్నారు. అభ్యర్థుల్లో మాత్రం రోజురోజుకూ టెన్షన్ పెరిగిపోతోంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రెండురోజుల్లో ప్రకటిస్తామని అధికారులు చెప్పడం, కానీ, ప్రకటించకపోవడం జరుగుతోంది.
 
 మహిళాశిశు సంక్షేమశాఖలో ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో 305 గ్రేడ్-2 రెగ్యులర్ సూపర్‌వైజర్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 3,572 మంది అభ్యర్థులు రాత పరీక్ష రాశారు. సరిగ్గా నాలుగు రోజులకు రాతపరీక్ష ఫలితాలను ఆ శాఖ వెబ్‌సైట్‌లో పెట్టారు. మొత్తం 45 మార్కులకుగానూ అభ్యర్థులకు వచ్చిన మార్కులను ఆ వెబ్‌సైట్‌లో ఉంచారు. కాంట్రాక్టు సూపర్‌వైజర్లకు 15 శాతం, అంగన్‌వాడీ శిక్షణ కేంద్రాల్లో కో ఆర్డినేటర్లుగా వ్యవహరించే వారికి 5 శాతాలను గ్రేస్ మార్కులుగా ఇస్తున్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాత పరీక్షలో అభ్యర్థులకు వచ్చిన మార్కులు, గ్రేస్ మార్కులు కలుపుకుని రిజర్వేషన్ల వారీగా ఎవరికివారు లెక్కలు వేసుకుంటున్నారు.
 
 రోస్టర్ వారీగా అభ్యర్థుల వివరాలను ప్రకటించడంలో ఎక్కువ సమయం తీసుకుంది. రోస్టర్‌ను ఆధారం చేసుకుని పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను అధికారులు ప్రకటించనున్నారు. రోస్టర్‌లో ఏ చిన్న తప్పు దొర్లినా తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయి. అయితే రోస్టర్ ప్రక్రియ కూడా పూర్తయినప్పటికీ జాబితా ప్రకటించకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను పత్రికాముఖంగా ప్రకటించడం జరుగుతుందని మహిళా శిశు సంక్షేమశాఖ రీజినల్ డిప్యూటీ డెరైక్టర్ కామేశ్వరమ్మ ప్రకటించారు. దాంతో అభ్యర్థులు ఉదయాన్నే నిద్ర లేవగానే ముందుగా పేపర్లు చూడటం, ఫలితాలు లేకపోవడంతో నిరుత్సాహానికి గురికావడం జరుగుతోంది. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉన్న అభ్యర్థులు రీజినల్ డిప్యూటీ డెరైక్టర్ కార్యాలయానికి ఫోన్లు చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ఫలితాల జాప్యంతో అభ్యర్థులతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్ విజయకుమార్ చొరవ తీసుకుని వెంటనే ఫలితాలు విడుదల చేయాలని వారు కోరుతున్నారు.

Advertisement
Advertisement