పట్టా భూములపై ‘స్థానిక’ గెద్ద | Sakshi
Sakshi News home page

పట్టా భూములపై ‘స్థానిక’ గెద్ద

Published Wed, Feb 11 2015 4:13 AM

demand for lands now

ఒకప్పుడు ఆ భూములకు పెద్దగా డిమాండ్ లేదు. ఎకరం లక్ష రూపాయలంటే గొప్పగా చెప్పుకునేవారు. అటువంటిది ఇప్పుడు ఎకరం ఏకంగా రూ.5 లక్షలు పలుకుతోంది. లేటరైట్ నిక్షేపాలున్నాయనే సమాచారం తెలియడంతో.. ఇక్కడి భూములపై మైదాన ప్రాంతానికి చెందిన భూస్వాములు, పెట్టుబడిదారుల కన్ను పడింది. నిరక్షరాస్యులైన అమాయక గిరిజనులకు ఎంతో కొంత ముట్టజెప్పిఆ భూములను సొంతం చేసుకొనేందుకు అనేకమంది గెద్దల్లా వాలిపోతున్నారు. వారికి కొందరు స్థానిక నేతలు సహకరిస్తూ.. గిరిజనుల భూముల కోసం బేరసారాలు సాగిస్తున్నారు. స్థానిక సంస్థలకు చెందిన ఓ ప్రజాప్రతినిధే స్వయంగా ఆ భూములను బడాబాబులకు బేరం పెడుతున్నాడు. ఈ భూ బాగోతంపై ‘సాక్షి’ పరిశీలనలో అనేక అంశాలు వెలుగుచూశాయి.
 

కాకినాడ : రౌతులపూడి మండలం రాఘవపట్నం గ్రామం రంపచోడవరం ఐటీడీఏ ఉప ప్రణాళికా ప్రాంత పరిధిలోకి వస్తుంది. ఈ భూదందాకు ఈ గ్రామమే వేదికగా నిలిచింది. గ్రామంలోని సర్వే నంబర్-61లో 43.83 ఎకరాల భూమి ఉంది. ఇందులో 28.89 ఎకరాలను 20 మంది గిరిజనులకు 1995లో పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇస్తారన్న ఆశతో మిగిలిన 14.94 ఎకరాలను మరో పదిమంది గిరిజనులు మూడు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. ఈ భూములను ఆనుకుని సర్వే నంబర్-60లో ఉన్న మరో 12.55 ఎకరాల ప్రభుత్వ భూమి 15 మంది గిరిజనుల సాగులో ఉంది. ఇంతకాలం నుంచీ ఎటువంటి ఇబ్బందీ లేకుండా అటు పట్టాదారులు, ఇటు పట్టాలు లేని గిరిజనులు ఈ భూముల్లో జీడిమామిడి తోటలు సాగు చేసుకుంటున్నారు. ఏడాదంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే వారికి ఎకరాకు రూ.30 వేలు మించి రావడం లేదు. ఈ భూములను రియల్టర్లకు అమ్మేసి సొమ్ము చేసుకోవాలనేది నేతల ప్లాన్.
 
స్థానిక సంస్థలకు చెందిన ఒక ప్రజాప్రతినిధి ఆ భూములను బడాబాబులకు బేరం పెట్టాడు. అధికార పార్టీ పెద్దల అండదండలు లేనిదే ఈ ప్లాన్ అమలు కాదన్న నిర్ధారణకు వచ్చాడు. అయితే ఇందుకు అండదండలు అందించాలంటే ఆ ప్రజాప్రతినిధి అధికార పార్టీలో చేరాలని షరతు పెట్టారు. అనుకున్న కార్యం పూర్తి చేసుకునేందుకు పార్టీ ఫిరాయించడానికి కూడా ఆ నేత వెనుకాడలేదు. ఆ ప్రక్రియ పూర్తి కావడంతో ధైర్యంగా తన అనుచరులను ఆ భూముల్లోకి పంపిస్తున్నాడు. ఒకప్పుడు అవన్నీ జిరాయితీవేనని, వాటిని ఖాళీ చేయాలంటూ వారు బెదిరింపులకు దిగుతున్నారని పట్టాదారులు ఆవేదన చెందుతున్నారు. అవి గ్రామానికి చెందిన రాజబాబు అనే రైతుకు చెందిన భూములంటూ తమను ఖాళీ చేయించేందుకు ఒత్తిడి తీసుకు వస్తున్నారని వాపోతున్నారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను గిరిజనులు చూపిస్తున్నా అవేమీ చెల్లుబాటు కావని, జిరాయితీ భూములేనని చెబుతున్నారని అంటున్నారు. వాస్తవానికి పట్టా భూముల కొనుగోలు, అమ్మకాలకు చెల్లుబాటు కావనే విషయం తెలిసినా, అనధికారిక ఒప్పందాలతో స్వాధీనం చేసుకోవాలనేది వారి ఎత్తుగడగా ఉంది.
 
ఇదే ఉద్దేశంతో వారానికి రెండుమూడుసార్లు ఖరీదైన కార్లలో ఎవరో ఒకరిని తీసుకువచ్చి భూములు చూపిస్తూండటం గిరిజనులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో పట్టాదారులు, పట్టాలు లేకున్నా సాగు చేసుకుంటున్న గిరిజనులు కలిసి సంక్రాంతికి ముందు కాకినాడలో కలెక్టర్‌కు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. గత నెల 25న రాఘవపట్నం వచ్చిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు కూడా వారు మొర పెట్టుకున్నారు.
 
లేటరైట్ నిక్షేపాలతోనే అంత డిమాండ్
శంఖవరం మండలం పెద్దూరు, ఆవెల్తి తదితర గ్రామాల్లో లేటరైట్ నిక్షేపాలున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన భూస్వాములు అధిక ధరలకు భూములు కొనుగోలు చేస్తున్నారు. రాఘవపట్నం, మాదేపేట, జలదాం, బి.పైడిపాల, అంపాడ, చాకిరేవులపాలెం గ్రామాల్లో బడాబాబులు భూములు కొనుగోలు చేస్తున్నారు. ఇంత డిమాండ్ ఉండబట్టే ‘ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన పట్టా భూములే కదా! రూ.లక్ష చేతిలో పెడితే మాట్లాడరు’ అని భావిస్తూ వాటిని సొంతం చేసుకొనే ఎత్తుగడతో ‘స్థానిక’ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. మరోపక్క వారు తమ భూముల జోలికి రాకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.
 
 
భూములు మావి కావని బెదిరిస్తున్నారు
సర్వే నంబర్-61లో మూడెకరాల 45 సెంట్ల భూమికి నాకు పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచీ ఆ భూమిని నా భర్త సాగు చేసేవాడు. భర్త చనిపోయాక నేనే వాటిని సాగు చేసుకుంటున్నాను. ఇప్పుడేమో ఆ భూమి నాది కాదంటున్నారు. ఎవరో జిరాయితీ భూమి హక్కుదారులు వస్తున్నారు, వారికి స్వాధీనం చేయాలని అంటున్నారు.
 - చెన్నాడ నాగయ్యమ్మ, రాఘవపట్నం
 
ఆత్మహత్యలే శరణ్యం
ముప్ఫయ్యేళ్లుగా సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడు అధికార పార్టీతో కలిసి మా భూములు లాక్కుని, అమ్మేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ భూములు తప్ప మాకు మరో జీవనాధారం లేదు. రెక్కల కష్టంపై బతికేటోళ్లం. మా భూములే దొరికాయా వారికి? ఏం చేయాలో తెలియక జిల్లా కలెక్టర్‌గారికి కూడా చెప్పుకున్నాం. ఈ భూములు పోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం.
 - బాలోజు కామయ్యమ్మ, రాఘవపట్నం
 
ముప్ఫయ్యేళ్లుగా పట్టా ఇవ్వలేదు
ముప్ఫయ్యేళ్లుగా సాగు చేసుకుంటున్నాం. భూమి పట్టా కోసం కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడేమో ఆ భూములు ఖాళీ చేయాలని స్థానిక నాయకులు మాపై ఒత్తిడి తెస్తున్నారు. లేదంటే దౌర్జన్యంగానైనా ఖాళీ చేయించేస్తారేమోనని భయంగా ఉంది. ప్రభుత్వం ఇప్పటికీ పట్టా ఇవ్వలేదు. ఆ భూములు లాగేసుకోవాలని కుట్రలు పన్నుతున్నారు.
 - పోతుబంది రాజు, రాఘవపట్నం
 

Advertisement

తప్పక చదవండి

Advertisement