‘ముక్కంటి’కి గంతలు | Sakshi
Sakshi News home page

‘ముక్కంటి’కి గంతలు

Published Tue, Feb 4 2014 2:56 AM

‘ముక్కంటి’కి గంతలు

శ్రీశైలాలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా రోజుకో నిర్మాణం కూల్చివేత.. పూటకో నిర్ణయం మార్పు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. అభివృద్ధి పనుల్లో అడుగడుగునా నిర్లక్ష్యం అధికారుల పనితీరుకు నిదర్శనం.
 మహాశివరాత్రి ముంచుకొస్తున్న వేళ.. నాణ్యత కృష్ణా జలాల్లో కలసిపోతోంది.
 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు: అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి.. జ్యోతిర్లింగ క్షేత్రం కలసి వెలసిన శ్రీశైలాలయం పవిత్రతకు భంగం వాటిల్లుతోంది. చంద్రశేఖర్‌ఆజాద్ ఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎప్పుడు ఏ మార్పు చోటు చేసుకుంటుందో.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి. ఎంతో ప్రాశస్త్యం కలిగిన నిర్మాణాలు ఒక్కొక్కటిగా రూపురేఖలను కోల్పోతుండటం పట్ల భక్తులు పెదవిరుస్తున్నారు. రెడ్డిరాజుల కాలంలో ఆలయ ప్రాంగణంలో నిర్మించిన సాలు మండపాలలో కొంత భాగాన్ని తొలగించడం విమర్శలకు తావిస్తోంది. పురావస్తు శాఖ అనుమతి లేకుండా ఎలా తొలగిస్తారనే ప్రశ్నకు సమాధానం కరువైంది.
 
  పంచభూతాల ప్రతిష్టిత ఆలయాల పక్కనే ఉన్న మండపాన్ని తొలగించి మెట్ల మార్గాన్ని అదనంగా పొడిగించడంలోని ఆంతర్యం ఎవరికీ అంతుపట్టడం లేదు. అభివృద్ధి పేరిట సుమారు పాతిక అడుగుల ఎత్తున గాల్వలం షీట్లతో విశాలమైన షెడ్ల నిర్మాణం చేపట్టడంతో ఆలయ ప్రాంగణం శోభ కోల్పోయింది. అదేవిధంగా ఇటీవల భారీ షెడ్డు ఏర్పాటు చేయడంతో సాక్షి గణపతి ఆలయం కళావిహీనంగా మారిపోయింది. ఇదే విషయమై బీజేపీ, భజరంగదళ్, వీహెచ్‌పీ నేతలు సైతం ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే సుమారు రూ.100 కోట్లకు పైగా అంచనా వ్యయంతో మాస్లర్‌ప్లాన్ అమలుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా చేపట్టిన  షాపింగ్ కాంప్లెక్స్, సీవరేజ్ ప్లాంట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. పెద్ద పనులను పక్కనపెట్టి రూ.10 లక్షల లోపు పనులను ఆగమేఘాలపై చేస్తుండటం అనుమానాలకు తావిస్తోంది.
 
 భక్తుల మనోభావాలతో ఆటలు: మల్లన్న లింగ స్వరూపం అరిగిపోతుందనే సాకుతో సువర్ణ కవచం ఏర్పాటుకు ఈవో వేగంగా పావులు కదపడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. తన పంతం నెగ్గించుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను వీరశైవులు, పండితులు, స్వాములు తప్పుపడుతున్నారు. ఆలయ ప్రాంగణంలోని కట్టడాల్లో సహజత్వం తీసుకొచ్చేందుకంటూ రాతి నిర్మాణాలపై టైల్స్ ఏర్పాటు, సున్నపు పొరలను శాండ్ బ్లాస్టింగ్ ద్వారా తొలగించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ పనులకు ఆలయ ప్రాంగణంలో వినియోగిస్తున్న పొక్లెయిన్లు, ట్రాక్టర్లు రణగొణ ధ్వనులతో భక్తులు విసిగిపోతున్నారు. స్వామి సన్నిధిలో ప్రశాంతత కోరి వచ్చి తమను ఈవో చర్యలు నిరాశ కలిగిస్తున్నాయని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
 ఇష్టారాజ్యం: ఏడెనిమిది నెలల్లోనే పరిచారకులు, అర్చకులు, వంటమనుషులు, ఇంజనీరింగ్ విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిపై చేపట్టిన నియామకాల్లో ఈవో ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది.
 
  ఇదే సమయంలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన అతిథిగృహాలకు సామగ్రి కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయానికి భక్తులు తాకిడి పెరిగిన నేపథ్యంలో వారి నెత్తిన భారం మోపి ఆదాయం పెంపొందించుకునే దిశగా చేపట్టిన మార్పుల పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభిషేకం.. శీఘ్రదర్శనం.. మహామంగళహారతి.. సుప్రభాత సేవా టిక్కెట్ల ధరలను అమాంతం పెంచడం భక్తుల ఆగ్రహానికి కారణమవుతోంది.
 
 నిబంధనల మేరకే పనులు
 శ్రీశైల మహాక్షేత్రంలో అభివృద్ధి పనులన్నీ అధికారికంగా ఆమోదం పొందినవే. ఆగమ శాస్త్ర ప్రకారం.. వైదిక కమిటీ.. పీఠాధిపతుల సూచనల మేరకే అభివృద్ధి పనులు చేపడుతున్నాం. మాస్టర్ ప్లాన్ పనులను వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. భక్తుల కోసం శాశ్వత ప్రాతిపదికన షెడ్లను నిర్మించి డార్మెంటరీలుగా తీర్చిదిద్దుతున్నాం.
 - చంద్రశేఖర్ ఆజాద్,
 ఈఓ, శ్రీశైలం దేవస్థానం

Advertisement

తప్పక చదవండి

Advertisement